Chakkora Review: చకోర రివ్యూ- అమ్మాయి కోసం పక్షిలా తిరిగే ప్రేమికుడు- పూరి జగన్నాథ్ శిష్యుడి ప్రేమ కావ్యం ఎలా ఉందంటే?
Chakkora Review And Rating In Telugu: డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ శిష్యుడు మంగా శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ప్రేమకథా చిత్రం 'చకోర'. శ్రవణ్, మలైకా జంటగా నటించిన ఈ భావోద్వేగ డ్రామా ఇవాళ థియేటర్లలో విడులైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు మెప్పించిందో నేటి చకోర రివ్యూలో చూద్దాం.
Chakkora Movie Review And Rating In Telugu: మాస్ కథలతో, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్లతో వెండితెరపై తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ స్కూల్ నుంచి మరో కొత్త ప్రతిభ వెలుగులోకి వచ్చింది. పూరి జగన్నాథ్ వద్ద ఎంతోకాలంగా సహాయ దర్శకుడిగా పనిచేసిన మంగా శ్రీనివాస్ డైరెక్టర్‌గా మారిన సినిమానే 'చకోర' (లూనార్ లవ్ బర్డ్).

చకోర రివ్యూ
శ్రవణ్, మలైకా టి. వాసుపల్ జంటగా నటించిన చకోర చిత్రాన్ని డాక్టర్ చింతాడ హేమారావు నిర్మించగా, శ్రీలక్ష్మీ పిక్చర్స్ పతాకంపై బాపిరాజు నిర్మించారు. ఇవాళ (అక్టోబర్ 9) చకోర మూవీ థియేటర్లలో విడుదలైంది. ప్రేమ, కుటుంబ అనుబంధాలు, లక్ష్య సాధన కలబోతగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందించిందో నేటి చకోర రివ్యూలో తెలుసుకుందాం.
లక్ష్య సాధన.. పట్టుదల కలిసిన ప్రేమ కథ!
చిన్నతనం నుంచి తల్లి చూపించే చందమామను చూస్తూ పెరిగిన ఒక సాధారణ యువకుడి జీవితం చుట్టూ ఈ 'చకోర' కథ తిరుగుతుంది. ఇద్దరు మిత్రుల మధ్య సాగే ఆసక్తికరమైన సంభాషణతో సినిమా కథ ప్రారంభమవుతుంది. నింగిలోని జాబిల్లి కోసం ఆరాటపడే చకోర పక్షిలాగే, తన జీవితంలో అనుకున్న ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలని ఆ యువకుడు నిరంతరం శ్రమిస్తుంటాడు. ఈ క్రమంలోనే అతడి జీవితంలోకి ఒక అందమైన అమ్మాయి ప్రవేశిస్తుంది.
ఆమెను తన జీవితంలో అత్యంత ప్రత్యేకమైన వ్యక్తిగా భావించిన హీరోకు ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. కొన్ని పరిస్థితుల వల్ల వారిద్దరి మధ్య దూరం పెరుగుతుంది. అసలు ఆ అమ్మాయి అతడికి ఎందుకు దూరమైంది? తన ప్రేమను, ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి ఆ యువకుడు ఎలాంటి పోరాటం చేశాడనేది తెలియాలంటే చకోర సినిమాను చూడాల్సిందే.
భావోద్వేగాల మేళవింపు.. స్క్రీన్‌ప్లే విశ్లేషణ
తెలుగు తెరపై ప్రేమకథలకు కొదువ లేదు. ప్రతిసారి ఓ లవ్ స్టోరీ సినిమా తెలుగు వెండితెరపైకి వస్తుంటుంది. అయితే కేవలం ప్రేమకే పరిమితం కాకుండా తల్లి-కొడుకుల అనుబంధం, స్నేహం, జీవితంలో అనుకున్నది సాధించాలనే పట్టుదలను జోడించి కథను తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకుంటుంది. చకోర పక్షి జాబిల్లి కోసం తపించే అంశాన్ని ప్రేమికుడి ఆరాటంతో ముడిపెట్టిన దర్శకుడి ఆలోచన మెప్పిస్తుంది.
అయితే, కథలోని బలానికి తగినట్లుగా కథనం ఇంకాస్త పదునుగా ఉంటే సినిమా ఇంపాక్ట్ మరో స్థాయిలో ఉండేది. కొన్ని సన్నివేశాలు నెమ్మదించడం, కొన్ని సీన్లు ఊహించేలా ఉండటం వల్ల ఆడియెన్స్‌కు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ తగ్గుతుంది. అయినప్పటికీ, ప్రేమను ఒక బాధ్యతగా, పట్టుదలగా భావించే యువకుడి ప్రయాణం మాత్రం ప్రేక్షకులను హృదయాలను తాకుతుంది.
నటీనటుల ప్రతిభ.. సాంకేతిక బలం
కథానాయకుడిగా పరిచయమైన శ్రవణ్ భావోద్వేగ సన్నివేశాల్లో చాలా బాగా ఒదిగిపోయే ప్రయత్నం చేశారు. హీరోయిన్ మలైకా టి. వాసుపల్ తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. సీనియర్ నటులు సుమన్, ఎల్.బి. శ్రీరామ్ తమ సుదీర్ఘ అనుభవంతో పాత్రలకు సహజత్వాన్ని తీసుకొచ్చారు. సీనియర్ నటుడు బ్రహ్మాజీ, సీనియర్ హీరోయిన్ ఇంద్రజ తమ పాత్రల పరిధి మేరకు బాగా మెప్పించారు.
పూరి జగన్నాథ్ కాంపౌండ్ నుంచి
ఇక సాంకేతికపరంగా చూస్తే, ప్రిన్స్ హెన్రీ అందించిన సంగీతం కథలోని అనుభూతిని మరింత పెంచగా, రుప్ప గోపీకృష్ణ సినిమాటోగ్రఫీ దృశ్యాలను అందంగా మలిచింది. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ బాగుంది. పూరి జగన్నాథ్ కాంపౌండ్ నుంచి వచ్చిన దర్శకుడు మంగా శ్రీనివాస్ మొదటి ప్రయత్నంలోనే ఒక స్వచ్ఛమైన భావోద్వేగ కథను ఎంచుకుని థియేటర్లలో చకోర సినిమాను ఓసారి చూసేలా తెరకెక్కించారు.
రేటింగ్: 2.75/5
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


