OTT Telugu Today: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు ఫ్యామిలీ కామెడీ మూవీ- న్యూస్ vs సీరియల్ vs క్రికెట్- ఇక్కడ చూసేయండి!

Colony Circus OTT Streaming Today: ఓటీటీలోకి ఇవాళ తెలుగు ఫ్యామిలీ కామెడీ డ్రామా చిత్రం కాలనీ సర్కస్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. డైరెక్టర్ వెంకటేష్ మహా ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాను 1990 నాటి కాలంలో ఓ గవర్నమెంట్ కాలనీలో జరిగే కథగా తెరకెక్కించారు. ఈ కాలనీ సర్కస్ ఓటీటీ రిలీజ్ ఎక్కడో తెలుసుకుందాం.

Published on: May 24, 2026, 12:44:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Telugu Family Comedy Movie OTT Release Today: డిజిటల్ వినోద ప్రపంచంలో విభిన్నమైన, అచ్చ తెలుగు నేటివిటీ కంటెంట్‌ ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. 90ల నాటి తీపి జ్ఞాపకాలను గుర్తుచేసేలా రూపొందించిన ఒక అందమైన ఫ్యామిలీ కామెడీ డ్రామా ఎంటర్‌టైనర్ మూవీ ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది.

ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు ఫ్యామిలీ కామెడీ మూవీ- న్యూస్ vs సీరియల్ vs క్రికెట్- ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు ఫ్యామిలీ కామెడీ మూవీ- న్యూస్ vs సీరియల్ vs క్రికెట్- ఇక్కడ చూసేయండి!

ప్రధాన పాత్రలో డైరెక్టర్

స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్ లేని ఆ రోజుల్లో ఒక కలర్ టీవీ చుట్టూ ఇరుగుపొరుగు మనుషులు ఎలా అల్లుకుపోయేవారో ఈ కథలో ఎంతో చక్కగా చూపించారు. ఆ సినిమానే కాలనీ సర్కస్. ఈ చిత్రంలో దర్శకుడు వెంకటేష్ మహా ప్రధాన పాత్రలో కనిపించడం విశేషం. 'కేరాఫ్ కంచరపాలెం' వంటి క్లాసిక్ చిత్రంతో తెలుగు సినిమా సత్తా చాటిన ఆయన కాలనీ సర్కస్ మూవీలో ప్రభుత్వ లెక్కల మాస్టర్‌గా అలరించారు.

ఆయనతో పాటు ఉద్విత హర్ష, మాస్టర్ ఆరవ్, బిగ్ బాస్ ఫేమ్, నటుడు కిరీటి దామరాజు, రేవతి నాథ్, అక్షయ్ సత్యనారాయణ, మల్లేశ్వరి తదితరులు కీలక పాత్రలు పోషించారు. కిరీటి దామరాజు మార్క్ టైమింగ్ ఈ సినిమాకు అదనపు బలంగా నిలిచింది. కాలనీ సర్కస్ సినిమా ఒక కలర్ టీవీ చుట్టూ సాగుతుంది. గౌరవం కోసం కలర్ టీవీ కొని తీసుకొచ్చిన ఇంట్లో న్యూస్ వర్సెస్ సీరియల్ వర్సెస్ క్రికెట్ అనే పోటీ మొదలవుతుంది.

మధ్యతరగతి జ్ఞాపకాలు.. రిమోట్ కోసం పోరాటం

ఈ కథ 1999 కాలం నాటి ఒక ప్రభుత్వ కాలనీ (గవర్నమెంట్ క్వార్టర్స్) నేపథ్యంలో సాగుతుంది. సమాజంలో ఎంతో గౌరవప్రదమైన వృత్తిలో ఉండి కూడా, కాలనీలో ఆశించిన గుర్తింపు లేక ఇబ్బంది పడే ఒక లెక్కల మాస్టారు చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. తన సామాజిక హోదాను పెంచుకోవడానికి, కాలనీ వాసుల దృష్టిలో పడటానికి ఆయన ఎంతో కష్టపడి ఒక కొత్త కలర్ టీవీని కొనుగోలు చేస్తారు. ఆ కలర్ టీవీ ఆయన ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనేదే అసలు కథాంశం.

టీవీ వచ్చిన ఆనందం ఎంతోసేపు నిలవదు. ఆ టీవీ రిమోట్ ఎవరి చేతిలో ఉండాలనే విషయంపై ఇంట్లో, కాలనీలో ఒక పెద్ద గందరగోళమే మొదలవుతుంది. చివరకు అది ఒక చిన్నపాటి ఎన్నికల యుద్ధంగా మారుతుంది. ఈ క్రమంలో వచ్చే హాస్యభరిత సన్నివేశాలు, భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. చివరకు ఆ లెక్కల మాస్టారు తన అహాన్ని పక్కన పెట్టి, తన చుట్టూ ఉన్న మనుషులను, సమాజాన్ని ఎలా గెలుచుకున్నారనే అంశాన్ని దర్శకుడు ఎంతో హృద్యంగా ఆవిష్కరించారు.

తెర వెనుక ప్రతిభావంతులు వీరే..

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ నిర్వాహకులు రాహుల్ తమడ, సాయిదీప్ రెడ్డి బొర్రా సంయుక్తంగా నిర్మించారు. శశాంక్ పోసింశెట్టి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జె.వి. సుధాంశు అందించిన సంగీతం 90ల నాటి కాలానికి తగ్గట్టుగా ఆహ్లాదకరంగా సాగుతుంది. శ్రీవత్స గొర్ల కెమెరా బాధ్యతలను నిర్వహించగా, సృజన్ శర్మ కపిల ఎడిటింగ్ పనులను పూర్తి చేశారు.

సకుటుంబంగా కలిసి కూర్చుని చూసేందుకు, పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయేందుకు ఒక మంచి నాస్టాల్జిక్ ఎంటర్‌టైనర్ కోసం ఎదురుచూసే ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఈ సినిమా బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి కాలనీ సర్కస్ ఓటీటీలోకి ఇవాళ (మే 24) వచ్చేసింది.

ఈటీవీ విన్ ఓటీటీలో

ప్రముఖ తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో మే 24న కాలనీ సర్కస్ ఓటీటీ రిలీజ్ అయింది. కేవలం 39 నిమిషాల రన్‌టైమ్‌తో కాలనీ సర్కస్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రతి వారంలాగే ఈటీవీ విన్ ఓటీటీ వీక్లీ సిరీస్ కథా సుధాలో భాగంగానే కాలనీ సర్కస్ డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌తోపాటు 90స్ కాలాన్ని ఇష్టపడేవారు ఈటీవీ విన్ ఓటీటీలోని కాలనీ సర్కస్ మూవీని ఎంచక్కా చూసేయొచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More