దేవగుడి రివ్యూ- ఫ్యాక్షనిస్ట్‌గా సింగర్ రఘు కంచె- కుల వ్యవస్థను ప్రశ్నించే సినిమా ఎలా ఉందంటే?

సింగర్ రఘు కుంచె, అభినవ్ శౌర్య, నరసింహా, అనుశ్రీ ప్రధాన పాత్రలు పోషించిన లేటెస్ట్ తెలుగు యాక్షన్ అడ్వెంచర్ రొమాంటిక్ డ్రామా చిత్రం దేవగుడి. బెల్లం రామకృష్ణా రెడ్డి నిర్మాతగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇవాళ థియేటర్లలో విడుదలైంది. మరి ఈ మూవీ ఎలా ఉందో నేటి దేవగుడి రివ్యూలో తెలుసుకుందాం.

Published on: Jan 30, 2026, 15:26:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టైటిల్: దేవగుడి

దేవగుడి రివ్యూ- ఫ్యాక్షనిస్ట్‌గా సింగర్ రఘు కంచె- కుల వ్యవస్థను ప్రశ్నించే సినిమా ఎలా ఉందంటే?
దేవగుడి రివ్యూ- ఫ్యాక్షనిస్ట్‌గా సింగర్ రఘు కంచె- కుల వ్యవస్థను ప్రశ్నించే సినిమా ఎలా ఉందంటే?

నటీనటులు: అభినవ్ శౌర్య, అనుశ్రీ, నరసింహా తోషి, రఘు కుంచె, రాజశ్రీ నాయర్, రఘుబాబు, లక్ష్మణ్ మీసాల, రాకేట్ రాఘవ, అన్నపూర్ణమ్మ, జబర్దస్త్ ఇమ్మాన్యూయెల్ తదితరులు

కథ, నిర్మాత, దర్శకత్వం: బెల్లం రామకృష్ణా రెడ్డి

సంగీతం: మదీన్ ఎస్‌కే

సినిమాటోగ్రఫీ: లక్ష్మీకాంత్ కనికే

ఎడిటింగ్: వీ నాగిరెడ్డి

విడుదల తేది: జనవరి 30, 2026

రచయితగా, నిర్మాతగా, డైరెక్టర్‌గా బెల్లం రామకృష్ణా రెడ్డి తెరకెక్కిన లేటెస్ట్ తెలుగు మూవీ దేవగుడి. యాక్షన్ అడ్వెంచర్ రొమాంటిక్ డ్రామాగా రూపొందిన దేవగుడి సినిమా ఇవాళ (జనవరి 30) థియేటర్లలో విడుదల అయింది. ఫ్యాక్షనిస్ట్‌గా సింగర్ రఘు కుంచె నటించిన ఈ సినిమా ఎలా ఉందో? ప్రేక్షకులను ఆకట్టుకుందా? వంటి వివరాలను నేటి దేవగుడి రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

దేవగుడికి చెందిన వీరారెడ్డి (రఘు కుంచె) ఒక ఫ్యాక్షన్ లీడర్. ప్రజలందరినీ బాగా చూసుకునే అతను తన అనుచరులలో ఒకరి కొడుకు అయిన ధర్మ (అభినవ్ శౌర్య), తన కుమారుడితో (నరసింహ) స్నేహంగా ఉండడాన్ని మాత్రం సహించడు.

అలాంటి ధర్మతో కూతురు శ్వేత (అనుశ్రీ) ప్రేమలో ఉందని తెలిసి అతన్ని ఊరి నుంచి గెంటేస్తాడు వీరారెడ్డి. ఈ క్రమంలో వీరారెడ్డి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఇద్దరు అనుచరులను ప్రత్యర్థులు చంపేస్తారు. మరోవైపు శ్వేత మిస్ అవుతుంది.

ఇంతకీ శ్వేత ఏమైంది? తన స్నేహితుడి చెల్లెలితో ధర్మ నిజంగానే ప్రేమలో పడ్డాడా? ధర్మ, శ్వేత ప్రేమ ఎక్కడ మొదలైంది? ఇద్దరు ఒక్కటయ్యారా? చివరికి వీరారెడ్డి ఏం చేశాడు? వంటి విషయాలు తెలియాలంటే దేవగుడి చూడాల్సిందే.

విశ్లేషణ:

కుల వ్యవస్థపై ఇప్పటికీ ఎన్నో సినిమాలు వచ్చాయి. ప్రధానంగా కులం చుట్టూ తిరిగే కథలో వచ్చే సినిమాల్లో కోర్ పాయింట్ తెలిసేలా ఉంటుంది. అయితే, తెలిసిన విషయాన్ని ఎంత గ్రిప్పింగ్‌గా తెరకెక్కిస్తే ప్రేక్షకుడికి అంత కనెక్ట్ అవుతుంది. ఆ విషయంలో దేవగుడి సక్సెస్ అయిందనే చెప్పొచ్చు.

సమాజంలో ప్రధాన సమస్యలలో ఒకటైన కుల వ్యవస్థను ప్రశ్నిస్తూనే ఈ సినిమా ప్రారంభమవుతుంది. చిన్నప్పుడే అన్నాచెల్లెళ్లు, తండ్రి అనుచరుడిగా పనిచేసే వ్యక్తి కుమారుడితో చాలా క్లోజ్ బాండింగ్ ఏర్పరచుకుంటారు. వయసుతో పాటు ఆ బంధం పెరుగుతూ వస్తుంది.

రెగ్యులర్ టెంప్లేట్

అబ్బాయిలు ఇద్దరూ స్నేహితులుగా సరదాగా తిరుగుతుంటే, అమ్మాయి మాత్రం ఆ కుర్రాడి మీద మనసు పడటం, తక్కువ కులానికి చెందిన అతన్ని ప్రేమించడం నచ్చని హీరోయిన్ తండ్రి, అతన్ని బయటకు గెంటేయడం, ఆ తర్వాత ఏం జరిగింది అనే అంశాలతోనే కథ సాగుతుంది.

రెగ్యులర్‌గా తెలుగు సినిమాల్లో వచ్చిన టెంప్లెట్‌తోనే ఈ సినిమా వచ్చింది. కానీ, రాయలసీమలోని దేవగుడి అనే ఒక గ్రామం నేపథ్యంలో కథ అంతా సాగుతుంది. రాయలసీమ టచ్‌తో సినిమా కాస్తా ఆసక్తికరంగా సాగుతుంది.

ఇలాంటి సంఘటనలు

మనిషి టెక్నాలజీ పరంగా ఎంత ఎదిగినా పెళ్లి, చావు విషయంలో మాత్రం కులాల ప్రస్తావన కచ్చితంగా వస్తోన్న సంఘటనలు ఇప్పటికీ చూస్తున్నాం. ఈ అంశంతోనే సినిమాను ఎక్కడా బోర్ తెప్పించకుండా తెరకెక్కించడంలో డైరెక్టర్ రామకృష్ణారెడ్డి సక్సెస్ అయ్యారు.

సినిమా ఆద్యంతం ఆకట్టుకునేలానే సాగిన కథను ప్రేక్షకులు ముందుగానే ఊహించేస్తారు. అయితే, ఉన్న బడ్జెట్‌లో సినిమాని ఎక్కడా చుట్టేసినట్లు కాకుండా, చాలా రిచ్ విజువల్స్‌తో, మంచి పాటలు, ఫైట్స్ కంపోజ్ చేసి ఒక మంచి కమర్షియల్ సినిమా ఫీల్ తీసుకురావడంలో డైరెక్టర్ విజయం సాధించారు.

నటీనటుల పర్ఫామెన్స్

ఇక దేవగుడి నటీనటుల విషయానికి వస్తే.. హీరోగా చేసిన అభినవ్ శౌర్యతో పాటు హీరోయిన్‌ అనుశ్రీ నటనతో ఆకట్టుకున్నారు. అలాగే హీరోయిన్ సోదరుడి పాత్రలో నటించిన నరసింహ సైతం మెప్పించారు. వీరందరూ కొత్త ముఖాలైనప్పటికీ చాలా ఈజ్‌తో నటించారు.

ఇక సింగర్ రఘు కుంచె దేవగుడి వీరారెడ్డి అనే పాత్రలో జీవించేశారు. అలానే ఈ సినిమాలో నటించిన మీసాల లక్ష్మణ్, రఘుబాబు, రాకెట్ రాఘవ వంటి వాళ్లు ఉన్నంతలో నవ్వించే ప్రయత్నం చేశారు.

కుల వ్యవస్థను ప్రశ్నించే సినిమా

ఇక మదిన్ అందించిన సంగీతం బాగుంది. కొన్ని పాటలు వినడానికి బాగున్నాయి. అలాగే తెరమీద కూడా అంతే చక్కగా వాటిని తీసుకురావడంలో టీమ్ సక్సెస్ అయింది. నేపథ్య సంగీతం సినిమాకి తగ్గట్టుగా సరిపోయింది. నిడివి కూడా ఎక్కువ లేకుండా జాగ్రత్తలు తీసుకుంది చిత్ర బృందం. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఫైనల్‌గా చెప్పాలంటే కుల వ్యవస్థను ప్రశ్నించే మరో తెలుగు సినిమానే దేవగుడి.

రేటింగ్: 3/5

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More