రజనీకాంత్.. నువ్వో నకిలీ దాత.. యూనిఫామ్ వేసుకుంటేనే గుర్తు పడతావా.. వాళ్లు నిరసన తెలుపుతుంటే ఏం చేశావ్: డైరెక్టర్ ట్వీట్
చెన్నైలో నిజాయితీ చాటుకున్న పారిశుధ్య కార్మికురాలికి సూపర్ స్టార్ రజనీకాంత్ బంగారు గొలుసు బహుమతిగా ఇవ్వడం అందరి ప్రశంసలు పొందింది. అయితే దీనిపై తమిళ దర్శకుడు లెనిన్ భారతి సంచలన విమర్శలు చేశాడు. కార్మికుల హక్కుల కోసం పోరాటం జరిగినప్పుడు రజనీకాంత్ ఎక్కడున్నారని ప్రశ్నించాడు.
సూపర్ స్టార్ రజనీకాంత్ పై తమిళ డైరెక్టర్ లెనిన్ భారతి చేసిన కామెంట్స్ షాకింగ్ కు గురి చేస్తున్నాయి. రజనీ ఓ నకిలీ దాత అంటూ అతడు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఈమధ్యే రజనీకాంత్ చేసిన ఓ సాయంపై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తుంటే.. లెనిన్ మాత్రం విమర్శలు చేయడం గమనార్హం. ఇంతకీ ఏం జరిగిందో చూడండి.

"అప్పుడు ఎక్కడున్నావ్ రజనీ?"
ఇటీవల చెన్నైకి చెందిన పద్మ అనే పారిశుధ్య కార్మికురాలు.. తన విధి నిర్వహణలో దొరికిన 45 సవర్ల బంగారాన్ని నిజాయతీగా పోలీసులకు అప్పగించి అందరి మన్ననలు పొందిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్.. ఆమెను తన పోయెస్ గార్డెన్ ఇంటికి పిలిపించుకుని సత్కరించి, ఓ బంగారు గొలుసును బహుమతిగా ఇచ్చాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
దీనిపై అందరూ రజనీని మెచ్చుకుంటుంటే.. ‘మెర్కు తొడర్చి మలై’ సినిమా దర్శకుడు లెనిన్ భారతి మాత్రం రజనీకాంత్‌పై విరుచుకుపడ్డాడు. ఎక్స్ వేదికగా అతడు స్పందిస్తూ.. "రిప్పన్ బిల్డింగ్ (చెన్నై కార్పొరేషన్ ఆఫీస్) ముందు పారిశుధ్య కార్మికులు తమ హక్కుల కోసం నిరసనలు చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావ్ రజనీకాంత్? కేవలం నీ దాతృత్వాన్ని ప్రదర్శించుకోవడానికి మాత్రమే యూనిఫాంలో ఉన్న వారిని గుర్తిస్తావా? నువ్వొక ఫేక్ ఫిలాంత్రోపిస్ట్ (నకిలీ దాత)" అని తమిళంలో ఘాటుగా రాసుకొచ్చాడు.
సోషల్ మీడియాలో వార్..
లెనిన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతోంది. నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. దీనిపై రజనీకాంత్ ఫ్యాన్స్ మొదట స్పందించారు. "ప్రతిదానికీ తప్పులు వెతకడం సరికాదు" అని కొందరు అంటే.. "కార్మికుల సమస్యలు తీర్చాల్సింది ప్రభుత్వం, రజనీకాంత్ కాదు" అని మరికొందరు సమర్థిస్తున్నారు.
లెనిన్ వాదనను సమర్థిస్తూ.. "నిజమైన కార్మికుల హక్కుల గురించి మాట్లాడని వ్యక్తి, కేవలం ఫొటోషూట్‌ల కోసం ఇలా చేయడం సరికాదు" అని కామెంట్స్ చేస్తున్నారు.
ఎవరీ లెనిన్ భారతి?
లెనిన్ భారతి సామాజిక స్పృహ ఉన్న చిత్రాలకు పెట్టింది పేరు. విజయ్ సేతుపతి నిర్మించిన 'మెర్కు తొడర్చి మలై' (2018) సినిమాతో అతడు దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా భూమి లేని నిరుపేద కూలీల జీవితాల చుట్టూ తిరుగుతుంది.
ఏది ఏమైనా ఒక మంచి పని వివాదానికి దారి తీయడం ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. రజనీకాంత్ గతేడాది లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో 'కూలీ' చిత్రంలో నటించారు. త్వరలో 'జైలర్ 2' సెట్స్ పైకి వెళ్లనున్నాడు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


