Mahesh Bhatt Alia: నాకంటే తెలివైన వారు, ఈ సమాజమే వారికి పాఠాలు నేర్పుతుంది- అలియా భట్ ఆన్‌లైన్ దాడులపై తండ్రి మహేష్ భట్

Mahesh Bhatt On Alia Bhatt Criticism: స్టార్ హీరోయిన్ అలియా భట్ సోషల్ మీడియాలో ఎదుర్కొంటున్న తీవ్రమైన నెగిటివిటీ, ఆన్‌లైన్ దాడులపై ఆమె తండ్రి, ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ స్పందించారు. స్టార్‌డమ్‌కు ఉండే పర్యవసానాలపై, పిల్లల వ్యక్తిగత విషయాల్లో తానేందుకు జోక్యం చేసుకోడో ఒక తండ్రిగా వివరించారు.

Published on: Jul 3, 2026, 11:51:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Mahesh Bhatt On Alia Bhatt Criticism: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఐదు దశాబ్దాలుగా దర్శకుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేసిన వ్యక్తి మహేష్ భట్. ఆయన తెరకెక్కించిన సినిమాలు ఎంత సంచలనం సృష్టించాయో, సెట్స్ వెలుపల ఆయన మాట్లాడే మాటలు కూడా అంతే వివాదాలకు, విమర్శలకు దారితీస్తుంటాయి.

నాకంటే తెలివైన వారు, ఈ సమాజమే వారికి పాఠాలు నేర్పుతుంది- అలియా భట్ ఆన్‌లైన్ దాడులపై తండ్రి మహేష్ భట్
నాకంటే తెలివైన వారు, ఈ సమాజమే వారికి పాఠాలు నేర్పుతుంది- అలియా భట్ ఆన్‌లైన్ దాడులపై తండ్రి మహేష్ భట్

ఆన్‌లైన్ దాడుల పట్ల

ఇప్పుడు ఆయన వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసి, దేశంలోనే అగ్ర హీరోయిన్‌గా దూసుకుపోతున్న అలియా భట్ సైతం తండ్రి లాగే తరచూ సోషల్ మీడియాలో తీవ్రమైన నెగిటివిటీని, గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ద్వేషాన్ని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో, తన కూతురిపై వచ్చే ఆన్‌లైన్ దాడుల పట్ల ఒక తండ్రిగా తానెలా స్పందిస్తాడనే విషయాలను మహేష్ భట్ పంచుకున్నారు.

నా పిల్లలకు నేను సలహాలు ఇవ్వను

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో అలియా భట్‌కు లభించే ప్రశంసల కంటే ఎక్కువగా విమర్శలు, హేట్ కామెంట్స్ కనిపిస్తుంటాయి. మరి ఇలాంటి సమయంలో ఒక తండ్రిగా ఆమెకు ఏమైనా సలహాలు ఇస్తారా అని ప్రశ్నించగా మహేష్ భట్ భిన్నమైన శైలిలో సమాధానమిచ్చారు.

"నేను నా పిల్లలకు ఎప్పుడూ సలహాలు ఇవ్వను. నా కంటే నా పిల్లలే చాలా తెలివైనవాళ్లు. నేటి తరం పరిస్థితులు, ఇక్కడి వాతావరణం వారికి బాగా తెలుసు. అనుభవాల నుంచే వారు స్వయంగా అన్నీ నేర్చుకుంటారు. ఈ సమాజమే వారికి పాఠాలు నేర్పుతుంది. జీవితాన్ని మించిన గురువు మరొకటి లేదు" అని మహేష్ భట్ స్పష్టం చేశారు.

పిల్లలను ఆన్‌లైన్ విమర్శల నుంచి అతిగా వెనకేసుకు రావడం లేదా ఎల్లప్పుడూ కాపాడాలని అనుకోవడం వారి సహజ ఎదుగుదలను దెబ్బతీస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. "అతిగా ప్రొటెక్ట్ చేస్తే పిల్లలు అసమర్థులుగా మారిపోతారు. వాళ్లను కూడా ఎండ తీవ్రతను చూడనివ్వండి, అందరిలాగే ఆ మంటల్లో కాలి అనుభవాన్ని పొందనివ్వండి" అని ఒక తండ్రిగా తన ఫిలాసఫికల్ ధోరణిని బయటపెట్టారు.

కీర్తి వెనుక ఉండే డార్క్ నిజం

సినిమా రంగంలో ఉండే సెలబ్రిటీలపై వచ్చే విమర్శలను ఆయన వృత్తిపరమైన ఇబ్బందులుగా (Occupational Hazard) అభివర్ణించారు. 77 ఏళ్ల ఈ సీనియర్ దర్శకుడు స్టార్‌డమ్ గురించి మాట్లాడుతూ ఎండ, వడదెబ్బ ఉదాహరణను తెరపైకి తెచ్చారు.

"కీర్తి ప్రతిష్టలు ఊరికే రావు, వాటికి భారీ మూల్యం చెల్లించాలి. ఎండలో నిలబడితే కచ్చితంగా వడదెబ్బ తగులుతుంది. జీవితమే అన్నిటికంటే పెద్ద పాఠం చెపుతుంది. అందుకే నా జీవిత అనుభవాలను నా పిల్లలకు చెప్పి, వాటి ఆధారంగా వాళ్ల జీవిత ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోమని నేను చెప్పను. అలా కోరుకోవడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ల జీవితాలు వేరు, ఈ కాలం వేరు, వాళ్ల ప్రయాణం వేరు" అని మహేష్ భట్ వివరించారు.

తల్లిదండ్రులకు ఒక చిన్న సూచన

ఈ సందర్భంగా నేటి తరం తల్లిదండ్రులకు ఆయన ఒక చిన్న సూచన చేశారు. పిల్లలు పెద్దయ్యాక వారి నిర్ణయాలను వారికే వదిలేయాలని, ఒకానొక దశలో పిల్లల విషయంలో తల్లిదండ్రులు వెనక్కి తగ్గడం (Let go) నేర్చుకోవాలని చెప్పారు.

"తాము నేర్చుకున్న జీవిత పాఠాలను పిల్లలు తమ జీవితాల్లో అక్షరాలా పాటిస్తారని తల్లిదండ్రులు ఆశించకూడదు. ఎందుకంటే కాలం మారుతూ ఉంటుంది. నది ప్రవహించే కొద్దీ దాని స్వరూపం మారిపోతుంది. ఒకే నదిని మనం రెండుసార్లు ఒకేలా దాటలేము కదా" అని చెప్పుకొచ్చారు మహేష్ భట్.

నేడే థియేటర్లలో రిలీజ్

ఇదిలా ఉంటే, అలియా భట్ నటించిన సరికొత్త స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా' (Alpha) నేడే (జూలై 3) థియేటర్లలో విడుదలైంది. యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) ప్రతిష్టాత్మక స్పై యూనివర్స్‌లో భాగంగా శివ్ రావల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో అలియాతో పాటు శార్వరి వాఘ్ ప్రధాన పాత్ర పోషించింది. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More