Mani Ratnam Keerthy Suresh: కీర్తి సురేష్ బోల్డ్ మూవీ డోరతిపై దర్శకుడు మణిరత్నం ప్రశంసలు- నాకు అసూయ కలుగుతోందంటూ!
Mani Ratnam Praised Keerthy Suresh Dorothy Movie: కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన కీర్తి సురేష్ బోల్డ్ మూవీ'డోరతి'పై సినీ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకొని, స్వదేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న ఈ చిత్రంపై లెజెండరీ దర్శకుడు మణిరత్నం ప్రశంసల వర్షం కురిపించారు.
Mani Ratnam Praised Keerthy Suresh Bold Movie Dorothy: తమిళ డారెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త చిత్రం 'డోరతి' థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేసిన ఈ సినిమా ఇద్దరు మిత్రులు, ఒక యువతి చుట్టూ తిరిగే సాధారణ ప్రేమకథగా భావించిన ప్రేక్షకులకు.. ఇందులో ఎల్జీబీటీక్యూఐఏ+ (LGBTQIA+) కోణాన్ని స్పృశించడం ఊహించని చర్చకు దారితీసింది.

మణిరత్నం స్పెషల్ వీడియో
స్వదేశంలో ఈ కథాంశంపై కొంత ప్రతికూల స్పందన వ్యక్తమవుతుండగా, కెనడా వేదికగా జరిగిన గ్లోబల్ ప్రిమియర్‌లో అద్భుత టాక్ సొంతం చేసుకుంది డోరతి సినిమా. ఈ క్రమంలో భారతీయ సినిమా దిగ్గజ దర్శకుడు మణిరత్నం డోరతి చిత్రంపై ప్రత్యేకంగా స్పందిస్తూ చిత్ర బృందాన్ని ఆకాశానికెత్తేశారు.
నిర్మాతలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విట్టర్)లో పంచుకున్న ఒక ప్రత్యేక వీడియో సందేశంలో మణిరత్నం మహానటి కీర్తి సురేష్ ‘డోరతి’ చిత్రాన్ని, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌ను విపరీతంగా అభినందించారు.
"నాకు అసూయగా ఉంది!" - మణిరత్నం కామెంట్స్
"ప్రస్తుతం మన వద్ద ఎంతోమంది నూతన ఉత్సాహవంతులైన యువ దర్శకులు ఉన్నారు. వారిందరిలో కార్తీక్ అత్యంత ప్రత్యేకమైన ప్రతిభావంతుడు. అందరికీ నాయకత్వం వహిస్తూ ముందు వరుసలో నిలిచాడు. డోరతి చాలా ప్రత్యేకమైన చిత్రం" అని డైరెక్టర్ మణిరత్నం చెప్పారు.
సినిమా మేకింగ్ శైలిపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ.. "డోరతి టేకింగ్, సినిమా భాష చాలా బాగున్నాయి. కార్తీక్ కెమెరా షాట్స్, టెక్నిక్, విజువల్ లాంగ్వేజ్‌పై ఉన్న పట్టు చూస్తుంటే నాకు అసూయ కలుగుతోంది. ఇళయరాజా అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రాణం పోసింది" అని మణిరత్నం కొనియాడారు.
ఇళరాజాకు 1540వ చిత్రం
1990ల కాలం నాటి తమిళనాడు నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రంలో మానవ సంబంధాలు, కులం, పౌరుషం, భావోద్వేగాలను అత్యంత సమగ్రంగా ఆవిష్కరించారు. జియో స్టూడియోస్, సిఖ్య ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. ఇది ఆయన కెరీర్‌లో 1540వ చిత్రం కావడం విశేషం.
స్వదేశంలో మిశ్రమ స్పందన
ఇటీవలే ప్రతిష్టాత్మక టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో (TIFF) ప్రదర్శితమైన ఈ సినిమాకు అంతర్జాతీయ ప్రేక్షకుల నుంచి స్టాండింగ్ ఓవియేషన్ (నిలబడి కరతాళ ధ్వనులు) లభించింది. అయితే భారతీయ థియేటర్లలో విడుదలయ్యాక, సాంప్రదాయ కథనాలను ఆశించిన కొందరు ప్రేక్షకుల నుంచి విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ, ధైర్యవంతమైన కథాంశాన్ని ఎంచుకున్నందుకు సినీ విశ్లేషకులు, నెటిజన్లు కార్తీక్ సుబ్బరాజ్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.
నా మనసుకు దగ్గరైన కథ: కార్తీక్ సుబ్బరాజ్
ఈ చిత్రం గురించి దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ స్పందిస్తూ.. "డోరతి నా మనసులో చాలా కాలంగా ఉండిపోయిన కథ. నాకంటూ బాగా తెలిసిన ప్రపంచం నుంచి ఈ కథ పుట్టుకొచ్చింది. మైత్రికి ఆశ్రయంగా నిలిచే చోటు, నిశ్శబ్దంలోనూ బతికే ప్రేమ, కఠినమైన పరిస్థితుల్లో సైతం ఉద్భవించే ఆప్యాయతలను ఇందులో చూపించాలనుకున్నాను" అని తెలిపారు.
"కేవలం వినోదం కోసమే కాకుండా గుర్తింపు, కులం, మగతనం, కరుణ వంటి అంశాలను హృదయపూర్వక పాత్రల ద్వారా చర్చించాను. ఈ కథ తమిళనాడు సంస్కృతిలో ముడిపడి ఉన్నప్పటికీ, ఇందులో ఉన్న భావోద్వేగాలు ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి" అని కార్తీక్ సుబ్బరాజ్ వివరించారు.
కొండంత బలం
దశాబ్దాలుగా భారతీయ సినిమాలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన నాయకన్, దళపతి, కన్నత్తిల్ ముత్తమిట్టాల్, పొన్నియిన్ సెల్వన్ వంటి కళాఖండాలను అందించిన మణిరత్నం లాంటి దర్శకుడి నుంచి ప్రశంసలు రావడం డోరతి చిత్ర బృందానికి కొండంత బలాన్నిచ్చింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


