Ilaiyaraaja: సోనీతో ఇళయరాజా కాపీరైట్ వివాదం- సుప్రీంకోర్టులో మ్యాజిక్ మాస్ట్రోకి ఎదురుదెబ్బ- తీర్పు ఏంటంటే?

Supreme Court On Ilaiyaraaja Copyright Dispute With Sony: సుప్రసిద్ధ సంగీత దర్శకుడు ఇళయరాజాకు సంబంధించిన కాపీరైట్ వివాదంలో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. మద్రాస్ హైకోర్టులో ఉన్న ఈ కేసును బాంబే హైకోర్టుకు బదిలీ చేస్తూ సోనీ ఎంటర్టైన్‌మెంట్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు ఆమోదించింది.

Published on: Mar 24, 2026, 11:55:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సంగీత ప్రపంచంలో రారాజుగా వెలుగొందుతున్న ఇళయరాజాకు ఉన్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన మ్యూజిక్ సంస్థ 'ఇళయరాజా మ్యూజిక్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్'కు, సోనీ ఎంటర్టైన్‌మెంట్‌కు మధ్య జరుగుతున్న కాపీరైట్ పోరులో సుప్రీంకోర్టు సోనీ పక్షాన నిలిచింది.

సోనీతో ఇళయరాజా కాపీరైట్ వివాదం- సుప్రీంకోర్టులో మ్యాజిక్ మాస్ట్రోకి ఎదురుదెబ్బ- తీర్పు ఏంటంటే? (PTI)
సోనీతో ఇళయరాజా కాపీరైట్ వివాదం- సుప్రీంకోర్టులో మ్యాజిక్ మాస్ట్రోకి ఎదురుదెబ్బ- తీర్పు ఏంటంటే? (PTI)

అనుమతించిన సుప్రీంకోర్టు

మద్రాస్ హైకోర్టులో నడుస్తున్న ఈ కేసును బాంబే హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ సోనీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం (మార్చి 23) అనుమతించింది. జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ వినోద్ కె చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది.

న్యాయస్థానంలో వాదోపవాదాలు

సోనీ తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ వాదిస్తూ.. "ఈ వివాదానికి సంబంధించి మొదటి కేసు బాంబే హైకోర్టులోనే దాఖలైంది, కాబట్టి ప్రస్తుత కేసును కూడా అక్కడికే బదిలీ చేయడం సమంజసం" అని కోరారు. దీనిని ఇళయరాజా తరఫు న్యాయవాది కపిల్ సిబల్ తీవ్రంగా వ్యతిరేకించారు. బాంబే హైకోర్టుకు ఈ విషయంలో అధికార పరిధి లేదని ఆయన వాదించారు.

అయితే, బాంబే హైకోర్టులో కేసు దాఖలైనప్పుడు దానిని ఇళయరాజా సంస్థ అడ్డుకోలేదని, అందువల్ల ఈ కేసును కూడా అక్కడికే బదిలీ చేయడం సరైనదని జస్టిస్ కుమార్ అభిప్రాయపడ్డారు. గతేడాది జూలైలో కూడా ఇదే వివాదానికి సంబంధించి ఇళయరాజా దాఖలు చేసిన బదిలీ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడం గమనార్హం.

అసలు వివాదం ఏమిటి?

ఈ న్యాయపోరాటం 2022లో సోనీ మ్యూజిక్ ఎంటర్టైన్‌మెంట్ ఇండియా దాఖలు చేసిన దావాతో మొదలైంది. ఇళయరాజాకు చెందిన 536 సంగీత పనులను (Musical Works) ఉపయోగించకుండా ఆయన సంస్థను నిరోధించాలని సోనీ కోరుతోంది. ఈ హక్కులను తాము 'ఓరియంటల్ రికార్డ్స్', 'ఎకో రికార్డింగ్' సంస్థల నుంచి చట్టబద్ధంగా కొనుగోలు చేశామని సోనీ వాదిస్తోంది. ఈ హక్కుల విషయంలోనే ఇళయరాజా చాలా కాలంగా న్యాయపోరాటం చేస్తున్నారు.

క్రియేటివిటీపై ఇళయరాజా న్యాయం పోరాటం

ఇప్పటికే పరిష్కారమైన అంశాలను ఇళయరాజా సంస్థ మళ్లీ మద్రాస్ హైకోర్టులో లేవనెత్తుతోందని, అందుకే ఈ బదిలీ అనివార్యమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఐదు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో 1000కి పైగా చిత్రాలకు 7000కు పైగా పాటలు అందించిన ఇళయరాజాకు తన సొంత సృజనపై (క్రియేటివిటీ) హక్కుల కోసం సాగిస్తున్న ఈ పోరులో తాజా తీర్పు కొంత ఇబ్బందికరంగా మారింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More