ఓటీటీలోకి బోల్డ్ వెబ్ సిరీస్ చివరి సీజన్ వచ్చేస్తోంది.. హీటెక్కించే పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
ఓటీటీలోకి బోల్డ్ వెబ్ సిరీస్ చివరిదైన నాలుగో సీజన్ వచ్చేస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో శుక్రవారం ఈ కొత్త సీజన్ స్ట్రీమింగ్ తేదీని అనౌన్స్ చేసింది. డిసెంబర్ 19 నుంచి దీనిని చూడొచ్చంటూ ఓ హీటెక్కించే పోస్టర్ రిలీజ్ చేసింది.
ఇండియన్ ఓటీటీ స్పేస్ లో వచ్చిన అత్యంత బోల్డ్ వెబ్ సిరీస్ లలో ఒకటి ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ (Four More Shots Please). ఎప్పుడో 2019లో తొలి సీజన్ రాగా.. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు చివరిదైన నాలుగో సీజన్ కూడా రాబోతోంది.

ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ నాలుగో సీజన్
అమెజాన్ ప్రైమ్ వీడియోలోని బోల్డ్ వెబ్ సిరీస్ ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్. ఈ సిరీస్ చివరి సీజన్ డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ శుక్రవారం (డిసెంబర్ 5) సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు.
“ఓజీ గ్యాంగ్ మీటప్ కు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ చివరి సీజన్ డిసెంబర్ 19 నుంచి” అనే క్యాప్షన్ తో ప్రైమ్ వీడియో ట్వీట్ చేసింది. దీనికి ఓ బోల్డ్ ఫొటోను కూడా పోస్ట్ చేసింది. ఇందులో సిరీస్ లోని లీడ్ క్యాస్ట్ ఓ బీచ్ లో ఎంజాయ్ చేస్తూ వెళ్తుండటం చూడొచ్చు.
ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ వెబ్ సిరీస్ గురించి..
అమెజాన్ ప్రైమ్ వీడియోలో అత్యంత పాపులర్ వెబ్ సిరీస్‌లలో ఒకటి ‘ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్’. ఇది కేవలం వినోదాన్ని పంచడమే కాకుండా ఆధునిక మహిళల ఆలోచనా ధోరణిని, వారి స్నేహ బంధాన్ని కొత్త కోణంలో ఆవిష్కరించింది. 2019లో ప్రారంభమైన ఈ సిరీస్.. మూడు సీజన్లుగా విజయవంతంగా కొనసాగుతూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది.
ఈ షో దామిని, అంజన, ఉమంగ్, సిద్ధి అనే నలుగురు అమ్మాయిల చుట్టూ తిరుగుతుంది. వీరు తమ జీవితాలను తమకు నచ్చినట్లుగా బతకాలను అనుకుంటూ ఉంటారు. తమ బలహీనతలను, తప్పులను నిర్మొహమాటంగా అంగీకరిస్తూ తమదైన శైలిలో జీవించే అమ్మాయిలు వీళ్లు.
ఆధునిక ముంబై మహానగరంలో స్నేహం, ప్రేమ, కెరీర్, తమకంటూ ఒక గుర్తింపు కోసం వారు చేసే ప్రయాణమే ఈ వెబ్ సిరీస్. ఎన్ని కష్టాలు వచ్చినా ఒకరికొకరు తోడుగా నిలిచే వారి స్నేహ బంధం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.
ఇండియన్ 'సెక్స్ అండ్ ది సిటీ'
ప్రముఖ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ 'సెక్స్ అండ్ ది సిటీ' (Sex and the City)కి ఇండియన్ వెర్షన్ గా ఈ షోను తరచుగా చెబుతుంటారు. మితిమీరిన శృంగారంతో కూడిన బోల్డ్ సీన్స్ కూడా ఆశ్చర్యపరిచాయి. ఇదే తీవ్ర విమర్శలు రావడానికి కూడా కారణమైంది. సమాజం కట్టుబాట్లను ప్రశ్నిస్తూ.. నలుగురు అమ్మాయిల కోణంలో ఈ కథను నడిపించడం మాత్రం కొందరికి బాగా నచ్చింది.
రంగితా ప్రీతిష్ నంది ఈ సిరీస్‌ను రూపొందించారు. ఒక్కో సీజన్‌కు ఒక్కో మహిళా దర్శకురాలు పనిచేశారు. సీజన్ 1కు అనూ మీనన్, సీజన్ 2కు నుపూర్ ఆస్థానా, సీజన్ 3కి జోయితా పట్పటియా దర్శకులుగా ఉన్నారు. ఈ సిరీస్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్‌లో 'బెస్ట్ కామెడీ సిరీస్' విభాగంలో నామినేట్ కావడం విశేషం.














