Gedela Raju Review: గేదెల రాజు రివ్యూ.. రౌడీ షీటర్‌గా సింగర్ రఘు కుంచె- విలేజ్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?

Gedela Raju Movie Review In Telugu: సింగర్ రఘు కుంచె ప్రధాన పాత్రలో నటించిన విలేజ్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా గేదెల రాజు కాకినాడ తాలూకా. చూస్తే ఒకటే నిజం, చూడకపోతే వంద అనుమానాలు అనేది సినిమా క్యాప్షన్. చైతన్య మోటూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందో నేటి గేదెల రాజు రివ్యూలో తెలుసుకుందాం.

Published on: Apr 25, 2026, 14:54:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Raghu Kunche Gedela Raju Review In Telugu: టాలీవుడ్‌లో సింగర్ రఘు కుంచెకు ఎంతో క్రేజ్ ఉంది. ఆయన సంగీతం అందించిన సినిమాలు సైతం ఉన్నాయి. ఇటీవలే దేవగుడి సినిమాతో నటుడిగా మెప్పించిన రఘు కుంచె మరో కీలక పాత్ర పోషించిన లేటెస్ట్ మూవీ గేదెల రాజు కాకినాడ తాలూకా. చూస్తే ఒకటే నిజం, చూడకపోతే వంద అనుమానాలు అనేది క్యాప్షన్.

గేదెల రాజు రివ్యూ.. రౌడీ షీటర్‌గా సింగర్ రఘు కుంచె- విలేజ్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
గేదెల రాజు రివ్యూ.. రౌడీ షీటర్‌గా సింగర్ రఘు కుంచె- విలేజ్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?

చైతన్య మోటూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా విలేజ్ పొలిటికల్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఈ మూవీలో రామచంద్రం పుణ్యమూర్తుల, వికాస్, టీనా శ్రావ్య, మౌనిక, రవి చిన్నిబిల్లి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. వాణి రవికుమార్ మోటూరి నిర్మించిన గేదెల రాజు మూవీ థియేటర్లలో ఏప్రిల్ 24న రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి గేదెల రాజు రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఈ కథ సాగుతుంది. గేదెల రాజు అలియాస్ భగవంత్ రాజు (రఘు కుంచె) ఆ ప్రాంతంలో ఒక పేరుమోసిన రౌడీ షీటర్. రాజకీయాల్లోకి ప్రవేశించి కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలనేది అతని ఆశయం. అయితే అదే సీటు కోసం దుర్గ (శ్రీకాంత్ అయ్యంగార్) కూడా గట్టిగా ప్రయత్నిస్తుంటాడు. స్థానిక ఎమ్మెల్యే వీళ్లిద్దరినీ కలిసి పని చేయమని చెప్పినా, మనస్పర్థల వల్ల ఇద్దరూ విడిపోతారు.

సరిగ్గా అదే రోజు రాత్రి గేదెల రాజు దారుణ హత్యకు గురవుతాడు. ఆ హత్య చేసింది ఎవరు? రాజకీయ శత్రుత్వమా లేక గేదెల రాజు బలహీనతలే అతని ప్రాణం తీశాయా? పోలీసుల విచారణలో ఏం తేలింది? రిచ్‌ (వికాస్‌), మీరా(మౌనిక), విజయ్‌ (రామచంద్రం), సత్య(టీనా శ్రావ్య)లతో గేదెల రాజుకు ఉన్న సంబంధం ఏంటి? వారి పాత్రలకున్న ప్రాధాన్యత ఏంటీ? అనేది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే.

విశ్లేషణ:

దర్శకుడు చైతన్య మోటూరి ఈ మర్డర్ మిస్టరీని నడిపించడానికి నాన్-లీనియర్ స్క్రీన్ ప్లే విధానాన్ని ఎంచుకున్నారు. అంటే కథ అటు ఇటుగా మారుతూ, అనుమానితుల ఫ్లాష్ బ్యాక్ ద్వారా సాగుతుంది. సినిమా ప్రారంభంలోనే హత్య జరగడం, ఆ వెంటనే పాత్రల పరిచయం ఆసక్తికరంగా సాగుతాయి.

శివయ్య (రవి ఆనంద్) అనే నాటక కళాకారుడు, రిచ్-మీరా అనే ప్రేమికులు, విజయ్-సత్య అనే మరో జంట.. ఇలా అందరినీ ఏదో ఒక సందర్భంలో గేదెల రాజు వేధించి ఉంటాడు. దీంతో ప్రతి పాత్రపై అనుమానం కలిగేలా దర్శకుడు కథను నడిపించడంలో సఫలమయ్యారు.

లోపించిన పట్టు.. గందరగోళం

సినిమాలో సస్పెన్స్ క్లైమాక్స్ వరకు కొనసాగినప్పటికీ, కథనంలో స్పష్టత లోపించింది. ప్రధాన కథకు సంబంధం లేని రెండు ప్రేమకథలు సినిమా వేగాన్ని తగ్గించాయి. ముఖ్యంగా ఒక క్రైమ్ థ్రిల్లర్‌లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్ర చాలా బలంగా ఉండాలి. కానీ, ఇందులో సీఐ పాత్ర అంతగా స్ట్రాంగ్‌గా అనిపించదు. అనుమానితుల మళ్లింపు ప్రక్రియ (Misdirection) ఎక్కువైపోవడంతో ప్రేక్షకులు కొంత గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం చాలా బాగుంది. దాన్ని ఇంకాస్తా ప్రభావితంగా చూపిస్తే మరింత హైప్ వచ్చేది.

రఘు కుంచె 'మాస్' పర్ఫార్మెన్స్

నటీనటుల విషయానికొస్తే.. ఈ సినిమాకు అతిపెద్ద బలం రఘు కుంచె. రౌడీ షీటర్ గేదెల రాజు పాత్రలో రఘు కుంచె పరకాయ ప్రవేశం చేశారు. ముఖ్యంగా కాకినాడ యాస, నడక, బాడీ లాంగ్వేజ్‌తో ఒక రియలిస్టిక్ రౌడీని కళ్లముందు ఉంచారు. నటుడిగా ఆయనకు ఇది ఒక మైలురాయి లాంటి పాత్ర అని చెప్పుకోవచ్చు.

ఇక శివయ్యగా నటించిన రవి చిన్నిబిలి తన సహజ నటనతో ఆకట్టుకున్నారు. శ్రీకాంత్ అయ్యంగార్ వంటి సీనియర్ నటుడికి సరైన స్కోప్ దక్కలేదు. యువ నటీనటులు తమ పరిధి మేరకు నటించారు.

సాంకేతిక విభాగం

రఘు కుంచె స్వయంగా అందించిన నేపథ్య సంగీతం సినిమా మూడ్‌ను బాగా ఎలివేట్ చేసింది. పాటలు పర్లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం థ్రిల్ ఇస్తుంది. కాకినాడ అందాలను, అక్కడి గల్లీలను కెమెరామెన్ చాలా సహజంగా చూపించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. చివరి వరకు సస్పెన్స్ మెయింటేన్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు.

ఫైనల్‌గా చెప్పాలంటే చిన్న సినిమాల సీజన్‌లో వచ్చిన గేదెల రాజు ఒక పక్కా విలేజ్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.

రేటింగ్ 2.75/5

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More