Gunde Ninda Gudi Gantalu Today Episode: మీనాకు రూ.10 లక్షల ఆర్డర్.. చింతామణి ఉచ్చు.. బాలుకి భారీ ‘ఇంగ్లిష్’ ట్రిప్..
Gunde Ninda Gudi Gantalu Serial July 15th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ జులై 15 ఎపిసోడ్ లో మీనాకు ఏకంగా రూ.10 లక్షల ఆర్డర్ వస్తుంది. అయితే అది చింతామణి వేసిన ఉచ్చు కావడంతో ఆమె పరిస్థితి ఏమవుతుందో అన్న ఆసక్తి తాజా ఎపిసోడ్ లో నెలకొంది.
Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ఇటు మీనాకు, అటు బాలుకి పెద్ద పెద్ద ఆర్డర్లు వస్తాయి. దీంతో ఇద్దరూ చాలా సంతోషంగా ఉంటారు. వాళ్లను చూసి ఇంట్లోని మూడు గ్రహాలు ప్రభావతి, మనోజ్, రోహిణి ముఖాలు మాడిపోతాయి.

బాలుని సపోర్ట్ చేసిన రవి
శృతి తల్లి ఇచ్చిన చెక్కును బాలు చించేశాడని ప్రభావతి ఆవేశంగా రవికి చెప్పే సీన్ తో సీరియల్ మంగళవారం (జులై 15) ఎపిసోడ్ మొదలైంది. అయితే వద్దని చెబితే పోయేదానికి చించడం ఎందుకు అని శృతి అంటుంది. కానీ రవి మాత్రం బాలుకి సపోర్ట్ చేస్తాడు. అత్తవారింటి డబ్బులతో నేను రెస్టారెంట్ పెట్టను.. నా సొంత కాళ్లపై నేను నిలబడతాను.. వాళ్ల డబ్బుతో పెడితే రేపు శృతితో గొడవ జరిగినా మా ముష్టిపై ఆధారపడి బతుకుతున్నావని తక్కువ చేసి మాట్లాడతారు అని రవి అంటాడు.
బాలు కూడా అది నిజమేనంటాడు. అంతేకాదు తమ తండ్రిని కూడా తక్కువ చేసి చూస్తారని అంటాడు. ఎప్పటికైనా ఆస్తి శృతిదే కదా.. తీసుకుంటే తప్పేముంది అంటూ ప్రభావతి, మనోజ్, రోహిణి వాదిస్తారు. కానీ రవి మాత్రం అవేవీ వినకుండా వెళ్లిపోతాడు. దీంతో శృతి కూడా ఆవేశంగా వెళ్లిపోతుంది.
రవికి అన్నల సలహా
ఆ తర్వాత డాబా మీదికి వెళ్లిన అన్నదమ్ములు ఇదే విషయంపై మాట్లాడుకుంటారు. రవికి ఇద్దరు అన్నలు సలహాలు ఇస్తారు. మనోజ్ తనదైన స్టైల్లో అత్తారింటి డబ్బు తీసుకుంటే తప్పేంటి.. ఆవిడ ఇస్తానంటే ఎందుకు తీసుకోవు.. నేనైతే ఎప్పుడో తీసుకునేవాడిని అని అంటాడు. అది విని బాలు లక్షలు మింగినోడికి క్లాస్ పీకుతాడు. అదే సమయంలో రవికి అండగా నిలుస్తాడు.
నువ్వు నీ కాళ్ల మీద నిలబడతానడంలో తప్పు లేదు.. నేను నీకు సాయం చేస్తాను అని చెబుతాడు. నీకే లేదు.. వాడికేం చేస్తావని మనోజ్ అంటాడు. అయితే నాన్న రూ.45 లక్షలతో ఫర్నీచర్ షాపు పెట్టాడు కదా.. అందులో నీ వాటాగా రూ.15 లక్షలు వస్తాయి.. అవి అమ్ముకొని తీసుకుందామని బాలు అనడంతో మనోజ్ మెల్లగా అక్కడి నుంచి జారుకుంటాడు.
రోహిణికి క్లాస్ పీకిన మీనా, శృతి
ఇటు కింద రోహిణి, మీనా, శృతి కూడా అదే విషయం గురించి మాట్లాడుకుంటారు. రోహిణి కూడా అచ్చూ మనోజ్ లాగే మాట్లాడుతుంది. శృతి వాళ్ల అమ్మ ఇస్తానంటే తీసుకుంటే తప్పేంటి అని అడుగుతుంది. కానీ మనోజ్ పేరు ఎత్తకుండా రోహిణికి మీనా గట్టిగానే క్లాస్ పీకుతుంది.
మరొకరి డబ్బులకు ఆశపడే మనస్తత్వం రవికి లేదు.. సొంత కాళ్లపై నిలబడాలని అనుకుంటున్నాడు.. మరొకరి డబ్బుతో ఫర్నీచరు షాపులు, విల్లాలు కొనాలనుకోవడం లేదు అని మీనా అనడంతో రోహిణికి మండుతుంది. శృతి కూడా మీనాకే సపోర్ట్ చేయడంతో.. మీ ఇద్దరూ ఒకేటే.. మీకు సలహా ఇవ్వడం కోసం వచ్చాను చూడు నన్ను నేను అనుకోవాలి అంటూ రోహిణి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
రవి, శృతి గురించి బాలు, మీనా చర్చ
ఆ తర్వాత బాలు, మీనా మధ్య కూడా రవి, శృతి గురించిన చర్చే నడుస్తుంది. ఇద్దరూ రవికే సపోర్ట్ చేసి మాట్లాడుకుంటారు. రవి చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడని, సొంతం ఎదగాలనుకోవడం మంచిదే అని ఇద్దరూ అనుకుంటారు.
మీనాకు చాలా పెద్ద ఆర్దర్.. లక్ష అడ్వాన్స్
మరుసటి రోజు ఓ ఈవెంట్ మేనేజర్ నుంచి మీనాకు ఫోన్ వస్తే అక్కడికి వెళ్తుంది. ఇది చాలా పెద్ద ఆర్డర్ అని, మీరు గతంలో చేసిన డెకరేషన్ల ఫొటోలు వాళ్లకు చూపిస్తే బాగా నచ్చాయని అంటాడు. ఈ ఆర్డర్ విలువ ఏకంగా రూ.10 లక్షలు అని చెప్పడంతో మీనా ఆశ్చర్యపోతుంది. చేయగలవా అని అడిగితే చేస్తానని అంటుంది. అడ్వాన్సు లక్ష ఇస్తాడు. పెద్ద ఆర్డర్ కదా.. కనీసం సగమైనా ఇవ్వండని మీనా అడిగినా అతడు కుదరదని అంటాడు.
ఇక అగ్రీమెంట్ పై సంతకం చేయాలని చెబుతాడు. అదంతా ఇంగ్లీషులో ఉంటుంది. తాను ఇంత ఇంగ్లీషు చదవలేనని, ఇంటికి వెళ్లి మా మరిదితో చదివించుకొని సంతకం పెడతానని అంటుంది. కానీ అంత టైమ్ లేదని ఆ వ్యక్తి చెప్పడంతో సరే ఇక్కడే సంతకం పెడతానంటూ సంతకం పెట్టేస్తుంది. అంత పెద్ద ఆర్డర్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పి వెళ్లిపోతుంది.
చింతామణి ఉచ్చులో పడిన మీనా
మీనా వెళ్లిపోయిన వెంటనే చింతామణి అక్కడికి వస్తుంది. నేను చెప్పినట్లే చేశావు కదా అని ఈవెంట్ మేనేజర్ ను అడుగుతుంది. చేశాను మేడమ్.. అయినా ఇంత పెద్ద ఆర్డర్ మీనాకు ఇస్తే మీకు మరింత పోటీగా వస్తుంది కదా.. ఎందుకు ఆమెకు ఇవ్వమన్నారు అని అడుగుతాడు. అది తర్వాత మీకే తెలుస్తుంది.. ఈ అగ్రీమెంట్ ను మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకో.. ఇది పనికొస్తుంది.. నీకు ఇచ్చే కమీషన్ కంటే కూడా ఈసారి ఐదు రెట్లు ఎక్కువిస్తాను అని చింతామణి చెప్పి వెళ్లిపోతుంది. దీంతో మీనా ఆమె ఉచ్చులో పడినట్లే కనిపిస్తుంది.
బాలుకి పెద్ద ఆర్డర్ వచ్చిన విషయం చెప్పిన మీనా
ఇటు ఇంటికి రాగానే తనకు వచ్చిన పెద్ద ఆర్డర్ గురించి బాలుకి చెబుతుంది మీనా.. దీంతో బాలు సంతోషంతో ఆమెను ఎత్తుకొని తిరుగుతాడు. కానీ పెద్దగా అడ్వాన్స్ ఇవ్వలేదని చెప్పడంతో ఫర్వాలేదులే.. ఇంత పెద్ద ఆర్డర్ మనం చేయగలమని మార్కెట్ లో తెలిసింది కదా అంటాడు.
అప్పుడే ఇంట్లో వాళ్లందరూ వస్తారు. వాళ్లిద్దరూ సంతోషంగా ఉండటం చూసి ఏమైందని అడుగుతాడరు. మీనాకు రూ.10 లక్షల ఆర్డర్ వచ్చిందని అనడంతో ఆ ముగ్గురు తప్ప మిగిలిన అందరూ సంతోషిస్తారు. ప్రభావతి దెప్పి పొడవగా.. మనోజ్ మాత్రం ఆప్టరాల్ రూ.10 లక్షలు అని అంటాడు.
మనోజ్‌ను డబ్బులు అడిగిన బాలు
దీంతో బాలుకి మండుతుంది. ఆఫ్టరాల్ పది లక్షలా.. నేను నీకు హాస్పిటల్లో పెట్టిన రూ.2 లక్షలు ఇవ్వు.. నా భార్యకు ఇప్పుడు అవసరం ఉంది అని అంటాడు. దీంతో మనోజ్, రోహిణి షాక్ తింటారు. ఇంత సడెన్ గా అడిగితే ఎలా అని రోహిణి అంటుంది. ఆ మాట మీ ఆయన నోరు జారక ముందు చెప్పాలి అని బాలు అంటాడు. చేతిలో వంద లేని సన్నాసివి ఆఫ్టరాల్ పది లక్షలని ఎలా అంటావని సత్యం కూడా అతనికి క్లాస్ పీకుతాడు. బాలు అతన్ని మరోసారి శపించబోతాడు. ప్రభావతి అడ్డుకుంటుంది. వీళ్లతో మనకెందుకు అని బాలు, మీనా వెళ్లిపోతారు.
బాలుకి పెద్ద ట్రిప్
బయటకు వెళ్లిన బాలుకి రాజేష్ ఓ పెద్ద ఆఫర్ ఇస్తాడు. విదేశాల నుంచి వచ్చారని, వాళ్లకు రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో తిప్పి గుళ్లూగోపురాలు చూపించాలని అంటాడు. నువ్వే వెళ్లొచ్చు కదా అని బాలు అంటే.. నాకు తెలుగు తప్ప మరో భాష రాదు.. నువ్వు ఇంగ్లిష్ లో ఏదో ఒకటి మేనేజ్ చేస్తావు కదా అని రాజేష్ అంటాడు.
అప్పుడే వాళ్లు ఫోన్ చేస్తే.. బాలు వచ్చీ రాని ఇంగ్లిష్ లో వాళ్లతో మాట్లాడుతాడు. మొత్తం ట్రిప్ కు రూ.90 వేలు అవుతుందని చెబుతాడు. బాలు ఇంగ్లిష్ చూసి మీనా మురిసిపోతుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


