Hansika Motwani: క్యాస్టింగ్ కౌచ్ ఉందా.. నాకైతే తెలియదు.. టాలెంట్ ఉన్న వాళ్లకు ఇలాంటివి జరగవు: హన్సిక కామెంట్స్ వివాదం
Hansika Motwani: సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌పై నటి హన్సిక మోత్వానీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. తనకి అనుభవం లేదంటూ ఆమె ఇచ్చిన సమాధానంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
Hansika Motwani: దేశముదురు సినిమాతో టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన హన్సిక మోత్వానీ.. తాజాగా ఒక ఇంటర్వ్యూ కారణంగా వార్తల్లో నిలిచింది. వ్యక్తిగత జీవితం నుంచి వృత్తిపరమైన విషయాల వరకు హన్సిక ఏది చేసినా అది చర్చనీయాంశంగానే మారుతోంది. సోహైల్ ఖతూరియాతో వివాహం, ఆ తర్వాత విడాకుల ప్రకటనతో అభిమానులను షాక్‌కు గురిచేసిన ఈ నటి.. తాజాగా గ్లామర్ ప్రపంచంలోని చీకటి కోణం 'కాస్టింగ్ కౌచ్'పై స్పందించింది. అయితే ఆమె చెప్పిన సమాధానం ఇప్పుడు కొత్త వివాదానికి తెరలేపింది.

అసలేం జరిగింది?
ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హన్సిక మాట్లాడింది. ఈ సందర్భంగా హోస్ట్ ఆమెను పరిశ్రమలో ఉన్న కాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్నించారు. "మీరు చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించడం వల్ల ఇలాంటి చేదు అనుభవాల నుంచి తప్పించుకున్నారా?" అని అడిగిన ప్రశ్నకు హన్సిక భిన్నంగా స్పందించింది.
"నిజానికి పని చేయాలని మనస్ఫూర్తిగా అనుకునే వారికి, నిజమైన టాలెంట్ ఉన్న వారికి ఇలాంటివి ఎదురవుతాయని నేను అనుకోను. నా విషయంలో మాత్రం ఎప్పుడూ ఇలా జరగలేదు" అని ఆమె బదులిచ్చింది.
నాకైతే తెలియదు మరి..
హన్సిక మాటలకు హోస్ట్ అడ్డుతగులుతూ.. "మీకు వ్యక్తిగతంగా అనుభవం లేకపోయినా, పరిశ్రమలో ఇలాంటివి జరుగుతున్నాయన్నది వాస్తవం కదా" అని గుర్తు చేశారు.
దీనికి హన్సిక స్పందిస్తూ.. "నిజం చెప్పాలంటే దీనిపై నేను ఎలాంటి కామెంట్ చేయలేను. ఎందుకంటే నాకు దాని గురించి తెలియదు. అవును, మనం దీన్ని విస్మరించలేం కానీ.. ఆ విషయంలో నాకు అవగాహన లేదు" అని దాటవేసింది.
నెటిజన్ల ఆగ్రహం
హన్సిక చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పరిశ్రమలో ఎంతోమంది నటీమణులు తమకు జరిగిన అన్యాయాల గురించి ధైర్యంగా గళమెత్తుతుంటే, హన్సిక మాత్రం అంతా బాగానే ఉంది అన్నట్లు మాట్లాడటం సరికాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
"మీకు డయాబెటిస్ లేనంత మాత్రాన, అసలు ఆ వ్యాధే లేదని చెప్పడం ఎంత మూర్ఖత్వమో.. మీ వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయి" అని ఒక యూజర్ ఘాటుగా విమర్శించారు.
"మీరు ఒక రక్షణ వలయంలో బతుకుతున్నారు మేడమ్.. బయట ఏం జరుగుతుందో చూడండి" అని మరొకరు ఎద్దేవా చేశారు. శ్రమించి పైకి రావాలనుకునే వారికి ఇలాంటి సమస్యలు ఉండవని అనడం ద్వారా, బాధితులను హన్సిక అవమానించారని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తన అదృష్టం బాగుండి ఇలాంటి ఇబ్బందులు ఎదురుకాకపోవచ్చు కానీ, వ్యవస్థలో ఉన్న లోపాన్ని కప్పిపుచ్చడం భావ్యం కాదని సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


