OTT: హత్రాస్ దారుణానికి ఆరేళ్లు- ఓటీటీలోకి ఇన్వెస్టిగేషన్ డాక్యుమెంటరీ- మనసు కలిచివేసే నిజాలు చెప్పిన జర్నలిస్ట్ తనుశ్రీ
Hathras 16 Days OTT Streaming Tanushree Pandey: భారతదేశాన్ని కుదిపేసిన హత్రాస్ ఘటన ఆధారంగా హత్రాస్ 16 డేస్ పేరుతో సరికొత్త డాక్యుమెంటరీ ఓటీటీ రిలీజ్ అయింది. ఆరేళ్ల తర్వాత కూడా బాధితురాలి కుటుంబం ఎదుర్కొంటున్న సామాజిక వివక్షను దర్శకుడు పాట్రిక్ గ్రాహం, జర్నలిస్ట్ తనుశ్రీ పాండే బయటపెట్టారు.
Hathras 16 Days OTT Streaming Tanushree Pandey: దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్ 'హత్రాస్' గ్యాంగ్ రేప్, హత్య ఉదంతాన్ని ఎవరూ అంత సులభంగా మరువలేరు. ఒక దళిత యువతిపై జరిగిన అమానుష దాడి, ఆపై అర్థరాత్రి పూట పోలీసులు శవాన్ని తగులబెట్టిన తీరు అప్పట్లో దేశవ్యాప్త నిరసనలకు దారితీసింది.

జీ5 ఓటీటీలో
ఈ ఘోరం జరిగి ఆరేళ్లు గడిచినా, బాధితురాలి కుటుంబ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు సరే కదా, వారి జీవితాలు మరింత దుర్భరంగా మారాయి. ఈ సామాజిక రుగ్మతను, కుల వివక్షను, బాధితుల ఆవేదనను కళ్లకు కడుతూ జీ5 (ZEE5) ఓటీటీలో 'హత్రాస్ 16 డేస్' (Hathras 16 Days) పేరుతో ఒక ఇన్వెస్టిగేటివ్ డాక్యుమెంటరీ విడుదలైంది.
ఈ డాక్యుమెంటరీని ప్రముఖ దర్శకుడు పాట్రిక్ గ్రాహం తెరకెక్కించగా, నాటి ఘటనను క్షేత్రస్థాయి నుంచి కవర్ చేసిన ధైర్యవంతమైన జర్నలిస్ట్ తనుశ్రీ పాండే ఇందులో కీలక విశ్లేషణలు అందించారు. ఈ సందర్భంగా హత్రాస్ కుటుంబ ప్రస్తుత పరిస్థితి, సమాజంలో ఇంకా పేరుకుపోయిన పితృస్వామ్య భావన గురించి వారు పంచుకున్న విషయాలను, మనసు కలచివేసే నిజాలు ఇక్కడ చూద్దాం.
తరం మారుతున్నా వీడని భయం, వివక్ష
ఆరేళ్ల తర్వాత మళ్లీ ఆ కుటుంబాన్ని కలిసినప్పుడు వారి పరిస్థితి మునుపటి కంటే దారుణంగా ఉందని తనుశ్రీ పాండే ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో కొంత పరిహారం అందించినప్పటికీ, ప్రస్తుత విపరీతమైన ద్రవ్యోల్బణం, పేదరికం కారణంగా వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. అంతకంటే దారుణం ఏంటంటే, ఆనాటి మానసిక క్షోభ ఇప్పుడు వారి తర్వాతి తరానికి కూడా శాపంగా మారింది.
బాధితురాలి మేనకోడళ్లు ప్రస్తుతం మూడు, నాలుగో తరగతి చదువుతున్నారు. వారిని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి వెళ్తే, అక్కడి ప్రధానోపాధ్యాయుడు ఒక వింత నిబంధన పెట్టారు. నిందితుల పిల్లలు కూడా అదే పాఠశాలలో చదువుతున్నారని, రేపు ఈ బాలికలకు ఏమైనా జరిగితే స్కూల్ యాజమాన్యానికి సంబంధం లేదని హామీ పత్రం రాసివ్వాలని కోరారు. లైంగిక దాడి అంటే ఏంటో కూడా తెలియని వయసులో ఆ చిన్నారులు ఈ వివక్ష నీడలో బతకాల్సి రావడం సమాజానికే సిగ్గుచేటు అని ఆమె అన్నారు.
నిజం చెబితే ట్రోలింగ్.. భయపెట్టే ఐటీ సెల్స్
క్షేత్రస్థాయి నుంచి ఈ వార్తను రిపోర్ట్ చేసినందుకు జర్నలిస్ట్ తనుశ్రీ పాండే ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. వ్యవస్థీకృత ఐటీ సెల్స్, కొన్ని వర్గాల నుంచి ఆమె తీవ్రమైన ట్రోలింగ్, బెదిరింపులను ఎదుర్కొన్నారు. "నిజాయితీగా మాట్లాడినందుకు ఒక దశలో నా కెరీర్ ముగిసిపోయిందని భావించాను. నా గురించి కంటే నా కుటుంబ రక్షణ గురించే ఎక్కువగా భయపడ్డాను" అని తనుశ్రీ తెలిపారు.
సమాజంలో భిన్నాభిప్రాయాలకు చోటు లేకుండా పోయిందని, ఎవరైనా పాలకులను ప్రశ్నిస్తే వారిపై దాడులు సమర్థనీయమనే ధోరణి పెరిగిపోయిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తనలాంటి మీడియా అండ, గుర్తింపు ఉన్న జర్నలిస్టే అంతలా భయపడితే, గ్రామీణ ప్రాంతాల్లోని సామాన్య మహిళలు నోరు విప్పితే ఎలాంటి నరకం అనుభవిస్తారో ఊహించుకోవడానికే భయమేస్తోందని ఆమె అన్నారు.
'అసలు రేప్ అనేదే లేదు'.. మధ్యయుగాల నాటి మైండ్‌సెట్
ఈ డాక్యుమెంటరీ చిత్రీకరణలో నిందితుల తండ్రి, వారి తరఫు న్యాయవాది మాట్లాడిన మాటలు వింటే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. అసలు అక్కడ రేప్ జరగలేదని, అంతా పరస్పర అంగీకారంతోనే జరిగిందని వారు వాదించడం దర్శకుడు పాట్రిక్ గ్రాహాన్ని షాక్‌కు గురిచేసింది.
"ఇలాంటి ఆలోచనలు మధ్యయుగాల నాటివి. ఆధునిక సమాజంలో వీటికి స్థానం లేదు. అమ్మాయిలే రేప్‌లను కోరుకుంటారనే వికృత మైండ్‌సెట్ ఉన్న పురుషులు ఇంకా మన మధ్యే ఉన్నారు" అని పాట్రిక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వందల ఏళ్లు వెనక్కి
భారతదేశం ప్రపంచ వేదికపై ఒక పెద్ద శక్తిగా ఎదుగుతోందని మనం గర్వపడుతున్నా, క్షేత్రస్థాయిలో మహిళల పరిస్థితి మాత్రం దారుణంగా ఉందని వారు గుర్తుచేశారు. హత్రాస్ వంటి ప్రాంతాల్లో చేతుల్లో స్మార్ట్‌ఫోన్లు వాడుతున్నారే తప్ప, ఆలోచనలు మాత్రం వందల ఏళ్లు వెనక్కి వెళ్లాయని, అక్కడ వీధుల్లో మహిళలు తిరిగే పరిస్థితి లేదని, తిరిగినా ముసుగులు వేసుకోవాల్సి వస్తోందని పాట్రిక్ ఆవేదన వ్యక్తం చేశారు.
జైలు శిక్ష పడిన ఆసారాం బాపు లాంటి వాళ్లు అనారోగ్య కారణాలతో బెయిల్ తెచ్చుకుని దర్జాగా తిరుగుతుంటే, బాధితులు మాత్రం సమాజానికి భయపడి ఇళ్లలోనే బందీలుగా మగ్గిపోతున్నారని తనుశ్రీ ఉదహరించారు. మన దేశంలో నేరస్థుల కంటే బాధితులపైనే ఎక్కువ ఆంక్షలు ఉంటున్నాయని ఆమె దుయ్యబట్టారు.
కన్నీరు పెట్టిన బాధితురాలి తల్లి
ఈ డాక్యుమెంటరీని ఇటీవల బాధితురాలి కుటుంబ సభ్యులకు చూపించారు. దీనిని చూస్తూ నాటి చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకుని బాధితురాలి తల్లి కన్నీరు మున్నీరైంది. తన కూతురు ఇంట్లో పనులు ఎలా చేసేదో, ఎంత బాగా వంట చేసేదో గుర్తుచేసుకుని రోదించారు.
అయితే, ఈ ఓటీటీ సినిమా చూసిన తర్వాత కొంతమంది అగ్రవర్ణాల వారు సైతం తమకు ఫోన్ చేసి, ఇలాంటి ఘోరాలు తమ ప్రాంతంలో జరగకుండా చూసుకుంటామని హామీ ఇవ్వడం ఒక సానుకూల మార్పు అని తనుశ్రీ పాండే ముగించారు. కాగా మే 15 నుంచి జీ5లో హత్రాస్ 16 డేస్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. 'హత్రాస్ 16 డేస్' డాక్యుమెంటరీ ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది?
ఈ సమగ్ర పరిశోధనాత్మక డాక్యుమెంటరీ జీ5 (ZEE5) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
2. హత్రాస్ కేసులో న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇచ్చింది?
2023లో ప్రత్యేక కోర్టు ముగ్గురు నిందితులను ఆధారాల లేమితో విముక్తి చేయగా, సందీప్ అనే నిందితుడికి ఎస్సీ/ఎస్టీ చట్టం కింద శిక్ష విధించింది. అయితే నలుగురు నిందితులపై రేప్ ఆరోపణలు రుజువు కాలేదు.
3. ఈ డాక్యుమెంటరీని ఎవరు దర్శకత్వం వహించారు?
దీనికి ప్రముఖ దర్శకుడు పాట్రిక్ గ్రాహం దర్శకత్వం వహించగా, నాటి ఘటనను గ్రౌండ్ లెవెల్ నుండి రిపోర్ట్ చేసిన జర్నలిస్ట్ తనుశ్రీ పాండే ఇందులో కీలక విశ్లేషణలు అందించారు.
4. ఆరేళ్ల తర్వాత కూడా బాధితురాలి కుటుంబం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏంటి?
తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో పాటు, సమాజంలో కుల వివక్ష కారణంగా బాధితురాలి మేనకోడళ్లకు పాఠశాలల్లో అడ్మిషన్లు లభించకపోవడం వంటి కొత్త రకమైన మానసిక క్షోభను వారు అనుభవిస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


