కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: స్పృహ‌లోకి సుమిత్ర‌- నీ కూతురినే అన్న దీప‌- చ‌నిపోయిన బాగుండేద‌న్న సుమిత్ర‌- జ్యోకు డౌట్

కార్తీక దీపం 2 టుడే అక్టోబర్ 20వ తేదీ ఎపిసోడ్ లో సుమిత్ర కళ్లు తెరుస్తుంది. బయటకు వెళ్లిపోవాలని చూస్తుంది. కానీ దీప, కాంచన అడ్డుపడతారు. మరోవైపు మామయ్య దశరథకు ధైర్యాన్ని ఇస్తాడు కార్తీక్. ఇంకా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇక్కడ చూసేయండి. 

Published on: Oct 20, 2025, 06:53:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 సీరియల్ టుడే అక్టోబర్ 20వ తేదీ ఎపిసోడ్ లో కార్తీక్ ఇంట్లో ఉన్న సుమిత్ర స్పృహ‌లోకి వచ్చి ఎక్కడున్నానని అనుకుంటుంది. గది నుంచి బయటకు వచ్చి ఇది కాంచన వదిన ఇల్లు, ఇక్కడికి దీపే తీసుకొచ్చి ఉంటుంది. ఇక్కడున్న సంగతి ఇంట్లో చెప్పేసే ఉంటుంది. వెళ్లిపోవాలని సుమిత్ర అనుకుంటుంది. శౌర్య ఆపినా సుమిత్ర వెళ్లిపోతుంది.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

ఎవరికీ చెప్పలేదు

ఎదురుగా వచ్చిన దీప ఆగండి, నేను కూడా వస్తానంటుంది. ఇంటికి వెళ్లడం చావుతో సమానం. అయినా ఇంటికి తీసుకొచ్చావంటే నీ ఉద్దేశం ఏంటో అర్థమవుతోంది దీప. ఇప్పటికే నేను ఇక్కడ ఉన్నాననే విషయం చెప్పే ఉంటావని సుమిత్ర అంటుంది. మేం చెప్పలేదని దీప, కాంచన చెప్తారు. ఎందుకు నా కోసం మీరంతా ఓ నిజాన్ని అబద్ధం చేయాలని ప్రయత్నిస్తున్నారని సుమిత్ర అడుగుతుంది.

గాయం తగ్గే వరకు

నా దారిన నన్ను పోనిచ్చారా? నా తలకు తగలాల్సిన దెబ్బ మీకు తగిలింది. గతంలో మీకు తగలాల్సిన దెబ్బ నాకు తగిలింది. ఆ రోజు మీరు నన్ను వదిలేశారా? వైద్యం చేయించి మీ ఇంటికి తీసుకెళ్లారు. ఈ రోజు నేను అదే పని చేస్తున్నా. గాయం తగ్గే వరకు మా ఇంట్లోనే ఉండాలి. మీ గురించి మాకు తప్పా వేరే ఎవరికీ తెలియనివ్వకుండా చూసే బాధ్యత మాది అని దీప అంటుంది.

నీ కూతురినే

నువ్వు నా కూతురివి అని నేరుగా ప్రశ్నిస్తుంది సుమిత్ర. అవునమ్మా, నేను నీ కూతురినే. ఒకప్పుడు తల్లిలా ఆదరించి అన్నం పెట్టారు. నా మనసులో అదే అభిప్రాయం ఉందని దీప కవర్ చేస్తుంది. మా నాన్న ఎంతలా బాధపడుతున్నాడో తెలుసా వదినా? మా అన్నయ్య గురించి ఆలోచించొచ్చు కదా. ఆ ఇంటికి వెళ్దాం పద వదిన. నువ్వు ఆ ఇంటి కోడలివి అని కాంచన అంటుంది. కానీ తిరిగి వెళ్లేందుకు సుమిత్ర ఒప్పుకోదు.

నా భర్తకే నా మీద నమ్మకం పోయిందన్నప్పుడు ఇంకా నాకు ఎవరి మీద నమ్మకం ఉంటుంది? నన్ను వెళ్లనివ్వండని సుమిత్ర పదే పదే అడుగుతుంది. మీరు వెళ్తే నా మీద ఒట్టే అని దీప అంటుంది. అయినా లెక్క చేయకుండా సుమిత్ర వెళ్లాలని ప్రయత్నించి కళ్లు తిరిగి పడబోతుంది. సుమిత్రను గదిలోకి తీసుకెళ్తుంది దీప.

సుమిత్ర ఎక్కడ?

సుమిత్ర అని సోఫాలో నుంచి ఉలిక్కి పడి లేస్తాడు దశరథ. దీంతో అందరూ పరుగెత్తుకుంటూ వస్తారు. ఇలా నిద్ర మాని ఎదురు చూస్తే మనుషులు వస్తారా? అని కార్తీక్ అడుగుతాడు. మీ అత్త గురించి తెలిసిందా? అని దశరథ, క్షేమంగానే ఉందని చెప్పావు కదా అని శివన్నారాయణ అడుగుతారు. అత్త గురించి చెప్పలేనని కార్తీక్ అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం కూడా ఇదే విషయం అడుగుతారు.

అత్తను తీసుకొస్తా

దీప మనం అర్థం చేసుకున్నంత చిన్న స్థాయి మనిషి కాదు. మనం అర్థం చేసుకోలేనంత ఉన్నత స్థాయి మనిషి అని దశరథ అంటాడు. ఎవరి బాధకు ఎవరు కారణమో అందరికీ తెలుసులే అని పారు అంటే, శివన్నారాయణ కోప్పడతాడు. కార్తీక్ ఏమిట్రా సుమిత్ర పరిస్థితి అని శివన్నారాయణ అడుగుతాడు. నా మీద నమ్మకంతో ఉండు తాత, అత్తకు ఏం కాదు. అత్తను నేనే ఇంటికి తీసుకొస్తానని కార్తీక్ చెప్తాడు. దీంతో అమ్మ ఎక్కడుందో బావకు తెలుసని జ్యో డౌట్ పడుతుంది.

కార్తీక్ మాటలు వింటుంటే సుమిత్రకు ఏం కాదనే ధైర్యం ఉంది నాన్న కానీ ఇంట్లో నుంచి వెళ్లిపోయేంత ధైర్యం చేసిందంటే ఏ అఘాయిత్యం చేసుకుంటుందోననే భయంగా ఉందని దశరథ అంటాడు. కార్తీక్ నమ్మకాన్ని మనమూ నమ్ముదాం. సుమిత్ర ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలని కోరుకుందామని శివన్నారాయణ అంటాడు.

దీప రిక్వెస్ట్

టిఫిన్ చేయమని సుమిత్రను అడుగుతుంది కాంచన. కోపం మనుషుల మీద చూపించాలి కానీ ఆకలి మీద కాదని ఒకప్పుడు మీరే చెప్పారని దీప అంటుంది. కోపం ఆకలి మీద కాదు తినబుద్ధి కావడం లేదంటుంది సుమిత్ర. మీరు బయటకు వెళ్లాలన్నా ఓపిక ఉండాలి కదా. టిఫిన్ తిని, టాబ్లెట్లు వేసుకుని రెస్ట్ తీసుకోమ్మని దీప రిక్వెస్ట్ చేస్తుంది.

నేను చచ్చిపోయినా

నా భర్త మాటలు విన్నాక నేను భార్య స్థానంలో లేనని అనిపించింది. ఆ బుల్లెట్ నాకు తగిలి చచ్చిపోయినా బాగుండనిపించింది అని సుమిత్ర ఫీల్ అవుతుంది. నీ సమస్య నాలాంటిది కాదు. బంగారం లాంటి సంసారం. తండ్రిలా చూసుకునే మామగారు. ఇంతకుమించి ఆడదానికి ఏం కావాలి వదినా? అని అడుగుతుంది కాంచన.

దీపకు రుణపడాలని

వీటిని పొందే అర్హత కోల్పోయాను వదిన. నా భర్తే నాతో మాట్లాడటానికి ఇబ్బంది పడుతూ బలవంతంగా భరిస్తున్నారని తెలిశాక ఎవరి కోసం ఉండాలి? మనసు చంపుకొని బతకలేను. నా భర్తకు ఎదురు పడగలనా? నా వల్ల నా భర్త ఎంతలా బాధ పడుతున్నారో స్వయంగా ఆయనే చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నా. అందుకే ఇంట్లో నుంచి వచ్చేశా. కానీ దీపకు రుణపడి పోవాలని భగవంతుడు అనుకున్నాడేమో అని సుమిత్ర అంటుంది.

ముందు తిని, టాబ్లెట్ వేసుకుని పడుకోండి. మీరు చెప్పినట్టే మేం వింటామని అంటున్నాం కదా. మీరు ఇక్కడ ఉన్నట్లు ఎవరికీ తెలియదని దీప అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More