...
...
Next Story

Keerthy Suresh: ఆమెలాగా నేను తక్కువ చేసి మాట్లాడను.. మొదట అర్థం కాలేదు: రాధికా ఆప్టే వివాదంపై కీర్తి సురేష్ రియాక్షన్

Keerthy Suresh: నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ 'అక్క' (Akka) ప్రమోషన్లలో భాగంగా నటి రాధిక ఆప్టే దక్షిణాది మేనమామ వివాహ సంప్రదాయంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కీర్తి సురేష్ ఎట్టకేలకు స్పందించారు. తాను దక్షిణాది నటినని, ఎట్టి పరిస్థితుల్లోనూ మన సంస్కృతిని, సంప్రదాయాలను కించపరచబోనని స్పష్టం చేశారు.

Published on: Nov 19, 2026, 15:28:58 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Keerthy Suresh on Radhika Apte: ఇటీవల నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ 'అక్క' (Akka) ప్రమోషన్ల సందర్భంగా బాలీవుడ్ నటి రాధిక ఆప్టే తెలుగు సినిమాలు, దక్షిణాది సంప్రదాయాలపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఇంటర్వ్యూలో రాధిక పక్కనే ఉన్న నటి కీర్తి సురేష్ నవ్వుతూ స్పందించిన తీరుపై తెలుగు, తమిళ నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Keerthy Suresh: ఆమెలాగా నేను తక్కువ చేసి మాట్లాడను.. మొదట అర్థం కాలేదు: రాధికా ఆప్టే వివాదంపై కీర్తి సురేష్ రియాక్షన్
Keerthy Suresh: ఆమెలాగా నేను తక్కువ చేసి మాట్లాడను.. మొదట అర్థం కాలేదు: రాధికా ఆప్టే వివాదంపై కీర్తి సురేష్ రియాక్షన్

తాజాగా ఈ వివాదంపై కీర్తి సురేష్ మౌనం వీడారు. తన తదుపరి చిత్రం 'సత్యవాన్ సావిత్రి' ప్రమోషనల్ ప్రెస్ మీట్‌లో విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో రాధిక ఏం మాట్లాడుతుందో తనకు మొదట అర్థం కాలేదని, తర్వాత కేవలం మన ఆచారం గురించి సమాచారం మాత్రమే ఇచ్చానని వివరణ ఇచ్చారు.

అసలు వివాదం ఏంటి? రాధిక ఆప్టే ఏమన్నారు?

నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ 'అక్క' ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రాధిక ఆప్టే తన గత తెలుగు సినిమా అనుభవాలను గుర్తుచేసుకుంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

“నేను నటించిన ఒక తెలుగు సినిమాలో (నందమూరి బాలకృష్ణ 'లెజెండ్' చిత్రాన్ని ఉద్దేశిస్తూ) నా మేనమామను పెళ్లి చేసుకునే పాత్ర చేశాను. అది నాకు అత్యంత కష్టమైన సినిమా. అందులోని ప్రతి అంశాన్ని నేను అసహ్యించుకున్నాను. నాకంటే చాలా పెద్ద వయసున్న హీరోతో రొమాన్స్ చేయడం, పితృస్వామ్య వాతావరణం నాకు అస్సలు నచ్చలేదు” అని రాధిక వ్యాఖ్యానించారు.

నవంబర్ 20న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానున్న 'సత్యవాన్ సావిత్రి' ప్రెస్ మీట్‌లో ఈ వివాదంపై కీర్తి సురేష్ స్పష్టతనిచ్చారు.

“నిజాయితీగా చెప్పాలంటే, రాధిక 'నా అంకుల్‌తో రొమాన్స్ చేయాల్సి వచ్చింది' అన్నప్పుడు నాకు మొదట ఆమె ఏం మాట్లాడుతుందో అర్థం కాలేదు. ఆ తర్వాత ఆమె మన మేనరికం (మేనమామ వివాహ) సంప్రదాయం గురించి చెబుతోందని గ్రహించాను. మన ఆచారం గురించి తెలియని వ్యక్తికి దానిని వివరించే ప్రయత్నం మాత్రమే చేశాను” అని కీర్తి తెలిపారు.

కేరళలో ఈ ఆచారం ఉండదు కదా అని విలేకరి ప్రస్తావించగా.. *"అవును, నేను అదే చెప్పాను. కేరళ సంస్కృతిలో ఈ పద్ధతి లేదు, నాకు కర్ణాటక గురించి తెలియదు. కానీ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో ఇది ఒక సంప్రదాయంగా ఉందని కేవలం సమాచారం రూపంలో చెప్పాను. మన సంప్రదాయాన్ని వాళ్లకు నిరూపించలేం కదా, అందుకే అర్థమయ్యేలా చెప్పాను" అన్నారు.

“పూర్తి గౌరవంతో చెబుతున్నాను.. నేను ఒక దక్షిణాది నటిని. ఉత్తరాదిలో గానీ, మరెక్కడైనా గానీ మన సంస్కృతిని, సంప్రదాయాలను నేనెప్పుడూ తక్కువ చేసి మాట్లాడను” అని కీర్తి సురేష్ స్పష్టం చేశారు.

కీర్తి సురేష్ ఇచ్చిన ఈ హుందా అయిన వివరణ పట్ల తెలుగు, తమిళ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనవసర వివాదాలకు తావివ్వకుండా, మన ఆచారాల వెనుక ఉన్న నేపథ్యాన్ని ఆమె స్పష్టంగా వివరించారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కాగా కీర్తి సురేష్ లాయర్ పాత్రలో, దర్శకుడు మిస్కిన్ కీలక పాత్రలో నటించిన 'సత్యవాన్ సావిత్రి' శుక్రవారం (నవంబర్ 20) ప్రేక్షకుల ముందుకు రానుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks