...
...
Next Story

Premalu OTT: ఓటీటీ నుంచి బ్లాక్‌బస్టర్ ప్రేమలు ఔట్.. హిందీ రీమేక్ రానున్న వేళ షాకింగ్ నిర్ణయం.. తెలుగు వెర్షన్ సంగతేంటి?

Premalu OTT: మలయాళ బ్లాక్‌బస్టర్ మూవీ ప్రేమలు హిందీ రీమేక్ రిలీజ్ కాబోతోంది. అయితే దాని కంటే ముందు ఈ ఒరిజినల్ వెర్షన్ ను జియోహాట్‌స్టార్ ఓటీటీ నుంచి తొలగించడం వివాదానికి కారణమైంది. రీమేక్ రీలీజ్ అవుతుంటే ఒరిజినల్ తీసేయడం ఎందుకంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

Published on: Aug 18, 2026, 14:07:11 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Premalu OTT: మలయాళంలో సంచలన విజయం సాధించిన లవ్, కామెడీ ఎంటర్‌టైనర్ 'ప్రేమలు' (Premalu) మూవీ ప్రియులకు బిగ్ షాక్ తగిలింది. ఈ సినిమా హిందీ రీమేక్ 'ప్రేమ్ కీటాను' (Prem Keetanu) ట్రైలర్ రిలీజైన కొద్ది గంటల్లోనే ఒరిజినల్ వర్షన్‌ను ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి సడన్‌గా తొలగించారు. దీంతో నెటిజన్లు, సినీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రీమేక్ దెబ్బకు ఒరిజినల్ మాయం

Premalu OTT: ఓటీటీ నుంచి బ్లాక్‌బస్టర్ ప్రేమలు ఔట్.. హిందీ రీమేక్ రానున్న వేళ షాకింగ్ నిర్ణయం.. తెలుగు వెర్షన్ సంగతేంటి?
Premalu OTT: ఓటీటీ నుంచి బ్లాక్‌బస్టర్ ప్రేమలు ఔట్.. హిందీ రీమేక్ రానున్న వేళ షాకింగ్ నిర్ణయం.. తెలుగు వెర్షన్ సంగతేంటి?

బాలీవుడ్‌లో వీర్ పహారియా హీరోగా 'ప్రేమ్ కీటాను' పేరుతో ప్రేమలు మూవీ రీమేక్ నిర్మించారు. అపూర్వ్ సింగ్ కర్కీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. అయితే ఈ ట్రైలర్ నెటిజన్లను అస్సలు ఆకట్టుకోలేకపోయింది. అసలు కథలోని సోల్‌ను పక్కన పెట్టేసి రీమేక్ పేరుతో రూపురేఖలు మార్చేశారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇది చాలదన్నట్లు, ట్రైలర్ వచ్చిన వెంటే జియోహాట్‌స్టార్ (JioHotstar) నుంచి మలయాళం, తమిళం, హిందీ భాషల్లో ఉన్న ఒరిజినల్ 'ప్రేమలు' సినిమాను డిలీట్ చేశారు. దీంతో నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా మేకర్స్‌పై విరుచుకుపడుతున్నారు. "హిందీ రీమేక్ ప్రమోషన్స్ కోసం ఒరిజినల్ క్లాసిక్ సినిమాను డిలీట్ చేయడం ఏంటి? ఇది చాలా దారుణం" అని ఎక్స్ వేదికగా మండిపడుతున్నారు.

నెటిజన్ల ఫైర్.. ఎక్స్‌లో విమర్శల వర్షం

సినిమా విశ్లేషకుడు సిద్ధార్థ్ శ్రీనివాస్ పోస్ట్ చేస్తూ.. "మీరు రీమేక్ తీసుకోండి, లేదంటే సినిమాను చెడగొట్టుకోండి. కానీ ఈ కారణంతో ఒరిజినల్ వర్షన్‌ను ఓటీటీ నుంచి తీసేయడం అస్సలు బాలేదు" అని రాసుకొచ్చారు.

నిజానికి మలయాళం ఒరిజినల్ తోపాటు హిందీ, తమిళ వెర్షన్ల హక్కులు జియోహాట్‌స్టార్ దక్కించుకోవడంతో ఆ భాషల వెర్షన్లు ఇప్పుడు అందుబాటులో లేకుండా పోయాయి. కానీ తెలుగు వెర్షన్ మాత్రం ఇప్పటికీ అందుబాటులో ఉంది. ఎందుకంటే ఇది ఆహా వీడియో ఓటీటీలో ఉంది కాబట్టి.

గతంలో తెలుగు వెర్షన్ హక్కులను ఈ ఓటీటీ దక్కించుకోవడంతో తెలుగు ప్రేక్షకులకు ఇప్పుడు కూడా ప్రేమలు మూవీ అందుబాటులో ఉంది.మిగతా ప్రధాన భాషల్లో హాట్‌స్టార్ నుంచి ఈ సినిమాను తీసేయడంపై వివాదం ముదురుతోంది.

'ప్రేమలు' సృష్టించిన సునామీ ఎలాంటిది?

2024 ఆరంభంలో గిరీష్ ఏడీ దర్శకత్వంలో వచ్చిన 'ప్రేమలు' బాక్సాఫీస్ దగ్గర పెద్ద సంచలనం సృష్టించింది. భావనా స్టూడియోస్, ఫహద్ ఫాజిల్ కాంబినేషన్‌లో కేవలం రూ. 3 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా రూ. 130 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి రికార్డులు తిరగరాసింది.

హైదరాబాద్‌లోని కోచింగ్ సెంటర్లు, కేఫ్‌ల బ్యాక్‌డ్రాప్‌లో నస్లేన్, మమితా బైజు జంటగా నటించిన ఈ యూత్‌ఫుల్ లవ్ కామెడీ కుర్రాళ్లను బాగా ఆకట్టుకుంది. ఎలాంటి అనవసరమైన డ్రామా లేకుండా కేవలం క్లీన్ కామెడీతో వచ్చిన ఈ సినిమా భారీ హిట్ కొట్టింది. తెలుగులో రాజమౌళి కుమారుడు కార్తికేయ రిలీజ్ చేయగా ఇక్కడ కూడా కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమా సీక్వెల్ కూడా ప్రకటన వచ్చినప్పటికీ తర్వాత పక్కన పెట్టేశారు.

రీమేక్‌లో మార్పులు.. అక్టోబర్ 2న రిలీజ్

ఇప్పుడు హిందీలో వస్తున్న 'ప్రేమ్ కీటాను' సినిమాలో కొన్ని మార్పులు చేశారు. ఒరిజినల్ కథలో హీరో హీరోయిన్లు ఉద్యోగాలు, కోచింగ్ కోసం హైదరాబాద్ వచ్చినట్లు చూపిస్తే.. హిందీలో మాత్రం కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌కి మార్చారు.

అపర్‌శక్తి ఖురానా, రాకేష్ బేడీ, నిఖిల్ విజయ్ లాంటి నటులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా ఒరిజినల్ 'ప్రేమలు'ను ఓటీటీ నుంచి తొలగించడం ద్వారా హిందీ మేకర్స్ అనవసరమైన నెగెటివిటీని మూటగట్టుకున్నారని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks