Manchu Manoj: ఐదుగురు పిల్లలను దత్తత తీసుకున్న మంచు మనోజ్- భార్య మౌనికతో కలిసి ఐక్య ధైర్య సేన సమితి సేవా సంస్థ ప్రారంభం

Manchu Manoj Mounika Bhuma Launched Aikya Dhairya Sena Samithi Trust: మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఐదుగురు పిల్లలను దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా భార్య మౌనిక భూమా మంచుతో కలిసి ఐక్య ధైర్య సేన సమితి సంస్థను ప్రారంభించారు. ఈ వేడుకకు ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అతిథిగా హాజరయ్యారు.

Published on: May 17, 2026, 19:38:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Manchu Manoj Adopted Five Children And Trust Launch: తన పుట్టినరోజు సందర్భంగా ‘రా కింగ్’ మంచు మనోజ్, ఆయన భార్య మౌనిక భూమా మంచు కలిసి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో రక్తదాన శిబిరం, ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగానే తమ కొత్త సామాజిక సేవా సంస్థ “ఐక్య ధైర్య సేన సమితి”ను అధికారికంగా ప్రారంభించారు.

ఐదుగురు పిల్లలను దత్తత తీసుకున్న మంచు మనోజ్- భార్య మౌనికతో కలిసి ఐక్య ధైర్య సేన సమితి సేవా సంస్థ ప్రారంభం
ఐదుగురు పిల్లలను దత్తత తీసుకున్న మంచు మనోజ్- భార్య మౌనికతో కలిసి ఐక్య ధైర్య సేన సమితి సేవా సంస్థ ప్రారంభం

అతిథిగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్

“Unity, Courage, Service, Impact” అనే నినాదంతో ప్రారంభమైన ఈ సంస్థ ఆవిష్కరణ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, అభిమానులు, వాలంటీర్లు హాజరయ్యారు. ఈ వేడుకలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

సభను ఉద్దేశించి మాట్లాడిన రా కింగ్ స్టార్ మంచు మనోజ్ భావోద్వేగంతో అందరికీ స్వాగతం పలుకుతూ, తాము చిన్నప్పటి నుంచి సేవాభావాన్ని కుటుంబ సభ్యుల నుంచి నేర్చుకున్నామని తెలిపారు. ఈ సంస్థ ఆలోచన ఎలా వచ్చిందో వివరిస్తూ, సమాజానికి సేవ చేయాలనే ఆలోచన కలిగిన వారందరికీ ఒక వేదికను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈ ట్రస్ట్‌ను ప్రారంభించామన్నారు.

పెద్దల నుంచి నేర్చుకున్న విలువలు

“అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. సమాజానికి అండగా నిలబడటం, సేవ చేయడం అనేది నేను, నా భార్య మౌనిక మా పెద్దల నుంచి నేర్చుకున్న విలువలు. ఇంతకుముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం. కానీ, అదే ఆలోచన కలిగిన వారందరికీ ఒక వేదిక ఉండాలని భావించి ఈ సంస్థను ప్రారంభిస్తున్నాం. ఈ సంస్థ పేరును మా సోదరుడు, సన్నిహితుడు ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ప్రకటిస్తారు” అని మంచు మనోజ్ అన్నారు.

“అయితే ముందుగా ఈ ఆలోచనకు మూలమైన మౌనిక భూమా మంచు కొన్ని మాటలు మాట్లాడాలి. ఈ ఆలోచన నిజంగా ఆమె నుంచే వచ్చింది. రక్తదాన శిబిరంతో పాటు, ఈరోజు నుంచే ఐదుగురు పిల్లలను దత్తత తీసుకుని వారి విద్యకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాం. ఇది ఇక్కడితో ఆగదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి పట్టణం, ప్రతి గ్రామానికి ఈ సేవా కార్యక్రమాలను తీసుకెళ్తాం. ఈ సంస్థ ద్వారా ఎవరికైనా నిజమైన సహాయం అందితే, అదే మా జీవితంలో గొప్ప విజయంగా భావిస్తాం” అని మంచు మనోజ్ పేర్కొన్నారు.

నమస్తే వరల్డ్ సంస్థను కూడా

ఈ సందర్భంగా మాట్లాడిన మౌనిక భూమా మంచు.. “అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. మంచి ఉద్దేశంతో, మంచి ఆలోచనతో నేను, మనోజ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇది మా తల్లిదండ్రుల ఆశీర్వాదాల వల్లే సాధ్యమైంది. వారు మాకు మాత్రమే కాదు, మా పిల్లలు కూడా అనుసరించాల్సిన మార్గాన్ని చూపించారు” అని తెలిపారు.

“ఈ ట్రస్ట్ కేవలం రక్తదాన కార్యక్రమాలకే పరిమితం కాదు. మహిళా సాధికారత, ఉపాధి కల్పన కోసం కూడా పని చేస్తుంది. ‘నమస్తే వరల్డ్’ అనే సంస్థను కూడా ప్రారంభించాం. దాని ద్వారా టాయ్ మేకింగ్ కోర్సుల సహకారంతో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. సమాజానికి సేవ చేయడానికి ఇంకా ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి. మీ అందరి ఆశీర్వాదాలు మాకు కావాలి. ఇప్పుడు ఈ ట్రస్ట్‌ను ప్రారంభించాల్సిందిగా నవీన్ అన్నను కోరుతున్నాను” అని మంచు మౌనిక భూమా వెల్లడించారు.

30 ఏళ్లకుపైగా అనుబంధం

అనంతరం ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అధికారికంగా “ఐక్య ధైర్య సేన సమితి” పేరును ప్రకటించి, సామాజిక సేవ కోసం ఈ ప్రత్యేక నిర్ణయం తీసుకున్న మనోజ్, మౌనికలను అభినందించారు. “ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మనోజ్ మంచు అన్న అభిమానులకు ప్రత్యేక అభినందనలు. మా కుటుంబం, మనోజ్ అన్న కుటుంబానికి 30 ఏళ్లకు పైగా అనుబంధం ఉంది. చిన్నప్పటి నుంచే ఆయనలో సేవా భావం ఉంది” అని నవీన్ యాదవ్ అన్నారు.

“పుట్టినరోజు సందర్భంగా మౌనిక భూమా మంచు గారి ఆలోచనతో ఈ ట్రస్ట్‌ను ప్రారంభించడం ఎంతో అభినందనీయం. ఈ ట్రస్ట్ పేరు ‘ఐక్య ధైర్య సేన సమితి’ — దీని నినాదం Unity, Courage, Service, Impact. ఆ పేరు వాళ్ల ఆలోచన, సేవా భావాన్ని ప్రతిబింబిస్తుంది. పిల్లలను దత్తత తీసుకోవడం, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి నిర్ణయాలు ఎంతో గొప్పవి. ఈ కార్యక్రమాలను తెలుగు రాష్ట్రాల అంతటా తీసుకెళ్లేందుకు మనోజ్ అన్నకు నా పూర్తి సహకారం ఉంటుంది. ఈ సంస్థలో పనిచేసే ప్రతి వాలంటీర్‌కు నా శుభాకాంక్షలు” అని నవీన్ యాదవ్ పేర్కొన్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More