Matka King Review: మట్కా కింగ్ రివ్యూ.. ఇవాళ ఓటీటీలోకి వచ్చిన మాఫియా థ్రిల్లర్ సిరీస్ ఎలా ఉందంటే? ఎపిసోడ్‌కు ఓ ట్విస్ట్

Matka King Review: ముంబై మాఫియా, జూదం నేపథ్యంలో నాగరాజ్ మంజులే తెరకెక్కించిన 'మట్కా కింగ్' వెబ్ సిరీస్ ఎలా ఉంది? విజయ్ వర్మ నటన ఈ సిరీస్‌ను కాపాడిందా? ఓటీటీలో రొటీన్ ఫార్ములాకు ఈ కథ బలైందా? పూర్తి రివ్యూ మీకోసం.

Published on: Apr 17, 2026, 13:50:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Matka King Review:

మట్కా కింగ్ సిరీస్ లో  విజయ్ వర్మ
మట్కా కింగ్ సిరీస్ లో విజయ్ వర్మ

సిరీస్ పేరు: మట్కా కింగ్

డైరెక్టర్ : నాగరాజ్ మంజులె

నటీనటులు : విజయ్ వర్మ, క్రితికా కామ్రా, గుల్షన్ గ్రోవర్, సిద్ధార్థ్ జాదవ్ తదితరులు

ఓటీటీ : ప్రైమ్ వీడియో

రిలీజ్ డేట్ : ఏప్రిల్ 17, 2026

ఎపిసోడ్లు : 8

ముంబై నగరం అంటేనే ఒక అంతుచిక్కని మాయాజాలం. అరవయ్యో దశకంలో మిల్లు కార్మికుల కలలు, పేదవాడి ఆశలు, ధనవంతుల విలాసాల మధ్య అల్లుకున్న ఒక చీకటి సామ్రాజ్యం 'మట్కా'. ఈ నేపథ్యంలో దర్శకుడు నాగరాజ్ మంజులే తెరకెక్కించిన తాజా వెబ్ సిరీస్ 'మట్కా కింగ్'. విజయ్ వర్మ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ సిరీస్ ఇవాళ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. ఈ సిరీస్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? జూదం నేపథ్యంలో వచ్చిన ఇతర కథల కంటే ఇది భిన్నంగా ఉందా? అనేది మట్కా కింగ్ రివ్యూలో చూద్దాం.

మట్కా కింగ్ స్టోరీ

ఈ మట్కా కింగ్ సిరీస్ ను ముంబైకి చెందిన రియల్ మట్కా కింగ్‌లు రతన్ ఖత్రీ, కళ్యాణ్ జీ భగత్ జీవితాల నుంచి ప్రేరణ పొంది తెరకెక్కించారు. ఈ సిరీస్ కథలో బ్రిజ్ భట్టి (విజయ్ వర్మ) ఒక సాధారణ వ్యక్తి నుంచి మట్కా సామ్రాజ్యానికి అధిపతిగా ఎలా ఎదిగాడు అనేది ప్రధానాంశం. తన బాస్ లాల్‌జీ భాయ్ (గుల్షన్ గ్రోవర్) నీడ నుంచి బయటకు వచ్చి, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును బ్రిజ్ సంపాదించుకుంటాడు.

లాల్‌జీకి నీతి నియమాలు లేకపోయినా, బ్రిజ్ మాత్రం జూదంలో కూడా 'నిజాయతీ' ఉండాలని నమ్ముతాడు. పేదవారి ఆశలకు ప్రతిరూపంగా మారుతూనే, వ్యవస్థను ఎదిరించి తన సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడు అన్నదే మిగతా కథ.

పాత సీసాలో కొత్త మద్యం

సిరీస్ ప్రారంభం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 1960ల నాటి బొంబాయి వాతావరణాన్ని, మిల్లు కార్మికుల ఆందోళనలను, దక్షిణ ముంబైలోని ధనవంతుల జీవనశైలిని దర్శకుడు అద్భుతంగా చూపించాడు. అయితే, కథ ముందుకు సాగే కొద్దీ ఇది మనకు ఇప్పటికే పరిచయమున్న 'స్కామ్ 1992' వంటి షోలను గుర్తుకు తెస్తుంది.

కొన్ని చోట్ల విజయ్ వర్మ డైలాగులు హర్షద్ మెహతాను తలపిస్తాయి. ఇండియన్ ఓటీటీ ల్లో ఇటీవల కాలంలో ఒకే తరహా 'టెంప్లేట్' కథలు వస్తున్నాయని, 'మట్కా కింగ్' కూడా ఆ ఫార్ములాకు బలైందని అనిపిస్తుంది. నాగరాజ్ మంజులే వంటి ప్రతిభావంతుడైన దర్శకుడు కూడా ఈ రొటీన్ ఫార్ములా నుంచి బయటపడలేకపోవడం నిరాశ కలిగిస్తుంది.

క్రితిక కమ్రా
క్రితిక కమ్రా

విశ్లేషణ

విజయ్ వర్మ మరోసారి అద్భుతమైన నటనను కనబరిచాడు. ఒక సాధారణ యువకుడి నుంచి 'భట్టి సేథ్'గా అతని పరిణామం చాలా సహజంగా ఉంది. ఇక జర్నలిస్ట్ టీపీ పాత్రలో గిరీష్ కులకర్ణి అదరగొట్టాడు. సాయి తంహంకర్, క్రితిక కమ్రా తమ పాత్రలకు న్యాయం చేశారు. అయితే, మహిళా పాత్రల చిత్రణలో దర్శకుడు కొంత తడబడ్డాడు. తన భార్య (సాయి తంహంకర్)కు అన్యాయం చేస్తూ గుల్రుఖ్ (క్రితికా కమ్రా)తో సంబంధం పెట్టుకున్న హీరోను ఎక్కడా ప్రశ్నించకపోవడం ఆశ్చర్యకరం. హీరో ఏం చేసినా అది కరెక్ట్ అన్నట్లుగా చూపించడం వల్ల అతని పాత్రలో సహజత్వం లోపించింది.

సాంకేతిక విభాగం

ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ డైరెక్షన్ అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. 60వ దశకం నాటి ముంబైని కళ్లకు కట్టినట్లు చూపించారు. కథనంలో వేగం ఉంది. ప్రతి ఎపిసోడ్ చివరలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుడిని నెక్ట్స్ ఎపిసోడ్ చూసేలా చేస్తాయి. కానీ, ఊహించదగ్గ మలుపులు ఉండటం వల్ల ఆ ఉత్కంఠ ఎక్కువసేపు నిలవదు.

ఫైనల్ గా

మొత్తంగా చెప్పాలంటే, 'మట్కా కింగ్' ఒక పక్కా కమర్షియల్ వెబ్ సిరీస్. నటీనటుల ప్రతిభ, అద్భుతమైన మేకింగ్ కోసం ఈ సిరీస్‌ను ఒకసారి చూడొచ్చు. కానీ, జూదం నేపథ్యంలో ఒక వినూత్నమైన కథను ఆశించే వారికి మాత్రం ఇది కొంత నిరాశ కలిగించవచ్చు. రిస్క్ తీసుకోవడం గురించి గొప్పగా చెప్పే ఈ సిరీస్ మేకర్లు, కథ విషయంలో మాత్రం రిస్క్ తీసుకోకుండా సేఫ్ జోన్‌లోనే ఉండిపోయారు.

రేటింగ్ : 2.5/5

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More