...
...
Next Story

పెళ్లయిన 5 నెలలకే అత్తింట్లో మాజీ మిస్ పూణే మృతి- కట్నం కోసమే చంపేశారని జడ్డ్ కుటుంబంపై ఆరోపణలు- సీఎం ఇంటిముందు నిరసన!

Twisha Sharma Family Protest At CM Home Over Dowry Death: మాజీ మిస్ పూణే ట్విషా శర్మ తన అత్తవారింట్లో ఉరివేసుకుని మృతి చెందారు. ఆమె మరణంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు.. భర్త, మాజీ న్యాయమూర్తి అయిన అత్తపై హత్య, వరకట్న వేధింపుల ఆరోపణలు చేశారు. సీఎం ఇంటిముందు నిరసన చేపట్టారు.

Published on: May 18, 2026, 12:20:22 IST
Advertisement

Twisha Sharma Family Protest At CM Home Over Dowry Death: మాజీ మిస్ పుణె, నోయిడాకు చెందిన ట్విషా శర్మ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని తన అత్తవారింట్లో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. మే 12న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ట్విషా శర్మ మరణం వెనుక అత్తమామల వరకట్న వేధింపులు, దారుణమైన హత్య కోణం ఉన్నాయని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

డేటింగ్ యాప్ ద్వారా

మోడలింగ్ రంగంలో రాణించిన ట్విషా శర్మకు 2024లో ఒక డేటింగ్ యాప్ ద్వారా భోపాల్‌కు చెందిన లాయర్ సమర్థ్ సింగ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి, 2025 డిసెంబర్‌లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లయిన 5 నెలలకే ఆమె జీవితం నరకప్రాయంగా మారింది. సమర్థ్ సింగ్ తల్లి గిరిబాల సింగ్ గతంలో న్యాయమూర్తిగా పనిచేశారు. చట్టాన్ని గౌరవించాల్సిన పెద్దల ఇంట్లోనే ఒక నిండు ప్రాణం బలికావడం స్థానికంగా కలకలం రేపుతోంది.

ఆఖరి ఫోన్ కాల్.. ఆ 10 నిమిషాల్లో ఏం జరిగింది?

ప్రమాదం జరిగిన రోజు రాత్రి ట్విషా శర్మ జీవితంలో ఏం జరిగిందో ఆమె సోదరుడు, భారత సైన్యంలో మేజర్‌గా పనిచేస్తున్న హర్షిత్ శర్మ వివరించారు. మే 12 రాత్రి 10:05 గంటలకు ట్విషా తన తల్లికి ఫోన్ చేసి అత్తవారింట్లో జరుగుతున్న నరకయాతన గురించి ఏడుస్తూ చెప్పింది. "ఆమెతో మాట్లాడుతుండగానే, భర్త గదిలోకి రావడంతో ఫోన్ అకస్మాత్తుగా కట్ అయిపోయింది" అని మేజర్ హర్షిత్ శర్మ తెలిపారు.

ఆసుపత్రి కేవలం పది నిమిషాల దూరంలోనే ఉన్నప్పటికీ, రాత్రి 11:30 గంటల వరకు ట్విషాను ఆసుపత్రికి తీసుకెళ్లలేదని, కావాలనే ఆలస్యం చేసి చంపేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రికి తీసుకువచ్చే సరికే ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

పోస్టుమార్టం నివేదికలో షాకింగ్ నిజాలు

ఈ కేసును విచారించడానికి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రజనీష్ కశ్యప్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS) కింద వరకట్న మరణం, వేధింపుల కేసులు నమోదు చేశారు. ప్రాథమిక పోస్టుమార్టం నివేదిక ప్రకారం, ట్విషా శర్మ ఉరి వల్లే చనిపోయిందని తేలింది. అయితే, ఆమె శరీరంపై అనేక చోట్ల గాయాలు, కమిలిన గుర్తులు ఉన్నాయి.

అంతేకాకుండా, మరణించడానికి కేవలం వారం రోజుల ముందే ఆమెకు గర్భస్రావం (Medical termination of pregnancy) జరిగినట్లు వైద్యులు గుర్తించారు. ఫోరెన్సిక్ నిబంధనల ప్రకారం ఉరివేసుకోడానికి వాడిన తాడును వైద్యులకు అందించాల్సి ఉండగా, నిందితులు సాక్ష్యాలను నాశనం చేసేందుకు దాన్ని దాచేశారని పోలీసులు అనుమానిస్తున్నారు.

సీఎం నివాసం ముందు కుటుంబ సభ్యుల ఆందోళన

ట్విషా తండ్రి నవనిధి శర్మ, ఇతర బంధువులు న్యాయం కోసం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అధికారిక నివాసం వెలుపల భారీ నిరసన చేపట్టారు. గత ఐదు రోజులుగా భోపాల్ ఎయిమ్స్ మార్చురీలోనే ఉన్న ట్విషా మృతదేహానికి ఢిల్లీ ఎయిమ్స్‌లో తిరిగి రెండోసారి పోస్టుమార్టం నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.

సీఎం కార్యాలయ అధికారులు వారికి స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ కేసు విచారణను మధ్యప్రదేశ్ వెలుపలి కోర్టుకు బదిలీ చేయాలని బాధితురాలి తండ్రి కోరుతున్నారు. కాగా, ఈ కేసులో నిందితురాలైన మాజీ జడ్జి గిరిబాల సింగ్‌కు స్థానిక కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయగా, భర్త సమర్థ్ సింగ్ బెయిల్ పిటిషన్‌పై మే 18న విచారణ జరగనుంది. ప్రస్తుతం పరారీలో ఉన్న భర్త కోసం పోలీసులు గాలిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe