Mukesh Choudhary: తల్లి మరణంతో గుండెను పిండేసే బాధ..అయినా మైదానంలో వికెట్ల వేట..ముకేశ్ చౌదరి కన్నీటి గాథ..అండగా సీఎస్కే

Mukesh Choudhary: ఐపీఎల్ 2026లో గురువారం రాత్రి ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది. అయితే ఈ మ్యాచ్ లో బౌలింగ్ తో ఆకట్టుకున్న ముకేశ్ చౌదరి గుండెను పిండేసే బాధను దిగమింగి బరిలోకి దిగాడు. ఈ విజయాన్ని ముకేశ్ చౌదరికి కెప్టెన్ రుతురాజ్ అంకితమిచ్చాడు. 

Published on: Apr 24, 2026, 10:31:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ఘనవిజయం సాధించింది. అయితే ఈ గెలుపు వెనుక ఒక భావోద్వేగపూరితమైన కథ ఉంది. తన తల్లిని కోల్పోయిన పుట్టెడు దుఃఖంలో కూడా జట్టు అవసరాల కోసం మైదానంలోకి దిగిన పేసర్ ముకేశ్ చౌదరి నిబద్ధతను చూసి క్రికెట్ ప్రపంచం ఫిదా అవుతోంది.

ముకేశ్ చౌదరి (REUTERS)
ముకేశ్ చౌదరి (REUTERS)

ముకేశ్ చౌదరి తల్లి మరణం

గత కొన్ని రోజులుగా 29 ఏళ్ల ముకేశ్ చౌదరి వ్యక్తిగతంగా కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. అతని తల్లి ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. అమ్మ అంత్యక్రియల కోసం ముకేశ్ భిల్వారా వెళ్లాడు. అయితే గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన కీలక పోరులో అతను సీఎస్కేకు తిరిగి ఆడాడు.

గుండెను పిండేసే బాధ

తల్లి మరణంతో గుండెను పిండేసే బాధ ఉన్నా.. ఆట కోసం, టీమ్ కోసం ముకేశ్ చౌదరి మైదానంలోకి అడుగుపెట్టడం గొప్ప విషయం. కొండంత బాధను అతను దిగమింగి టీమ్ కోసం బౌలింగ్ చేశాడు. సీఎస్కే టీమ్ కూడా ముకేశ్ కు అండగా నిలిచింది. ముకేశ్ తల్లి మృతికి సంతాపంగా సీఎస్‌కే ఆటగాళ్లందరూ నల్ల బ్యాండ్లు ధరించి మైదానంలోకి దిగారు.

ముకేశ్‌కే అంకితం

ఐపీఎల్ 2026లో ముంబైపై 103 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన అనంతరం సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ ఈ గెలుపును ముకేశ్‌కు అంకితమిచ్చాడు.

"అతనికి (ముకేశ్) ఇది చాలా కష్టమైన సమయం. కచ్చితంగా ఈ విజయాన్ని ముకేశ్ చౌదరికే అంకితం చేస్తున్నా. అంతటి విషాదంలో ఉండి కూడా మానసికంగా దృఢంగా నిలబడి జట్టు కోసం తిరిగి రావడం అభినందనీయం. ఫ్రాంచైజీకి తన అవసరం ఉందని గుర్తించి అతను బాధ్యతగా వ్యవహరించాడు" అని రుతురాజ్ తెలిపాడు.

మ్యాచ్ ప్రారంభానికి ముందే ముకేశ్ కోసం ఈ మ్యాచ్ గెలవాలని జట్టు నిర్ణయించుకుందని, అందరూ సమిష్టిగా రాణించి అనుకున్నది సాధించారని రుతురాజ్ వెల్లడించాడు.

సుదీర్ఘ అనారోగ్యంతో

దైనిక్ భాస్కర్ కథనం ప్రకారం.. ముకేశ్ తల్లి గత ఏడాది కాలంగా అనారోగ్యంతో బాధపడ్డారు. టాటా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలిసిన వెంటనే ముకేశ్ ఇంటికి వెళ్లినప్పటికీ, మ్యాచ్ సమయానికి తిరిగి వచ్చి బౌలింగ్ బాధ్యతలు చేపట్టాడు.

సీఎస్కే అదుర్స్

ముంబయి ఇండియన్స్ పై చెన్నై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. సంజూ శాంసన్ 101 పరుగులతో అద్భుత సెంచరీ చేసి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సీఎస్కే 20 ఓవర్లలో 6 వికెట్లకు 207 పరుగులు చేసింది. అనంతరం బౌలింగ్‌లో అకీల్ హోస్సేన్ నాలుగు వికెట్లతో విరుచుకుపడటంతో ముంబై 104 పరుగులకే కుప్పకూలింది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

1. ముంబైతో మ్యాచ్ లో సీఎస్కే ఆటగాళ్లందరూ నల్ల బ్యాండ్లు ఎందుకు ధరించారు?

ముకేశ్ చౌదరి తల్లి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లందరూ నల్ల బ్యాండ్లు ధరించారు.

2. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఎంత తేడాతో గెలిచింది?

చెన్నై సూపర్ కింగ్స్ 103 పరుగుల భారీ తేడాతో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది.

3. ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు?

101 పరుగులతో సెంచరీ సాధించిన సంజూ శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More