Nagabandham Review: నాగబంధం రివ్యూ- బ్రహ్మకమలం కోసం పోరాటం, గ్రాండ్ విజువల్స్- విరాట్ కర్ణ, నభా నటేష్ సినిమా ఎలా ఉందంటే?
Nagabandham Movie Review And Rating In Telugu: పెదకాపు ఫేమ్ విరాట్ కర్ణ, నభా నటేష్ ప్రధాన పాత్రల్లో అభిషేక్ నామా తెరకెక్కించిన పీరియాడిక్ సోషియో ఫాంటసీ చిత్రం 'నాగబంధం'. భారీ విజువల్ వండర్‌గా రూపొందిన ఈ సినిమా నేడు థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి నాగబంధం రివ్యూలో తెలుసుకుందాం.
Nagabandham Review In Telugu And Rating: విరాట్ కర్న, నభా నటేష్ హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ సోషియో ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా నాగబంధం. నిర్మాత అభిషేక్ నామా కథ, దర్శకత్వం అందించిన ఈ సినిమా ఇవాళ (జూలై 3) థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి నాగబంధం రివ్యూలో తెలుసుకుందాం.

టైటిల్ : నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్
నటీనటులు: విరాట్ కర్ణ, నభా నటేశ్, ఐశ్వర్య మీనన్, జగపతి బాబు, దక్ష నగర్కర్, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సాహ్నీ, మురళీ శర్మ తదితరులు
కథ, దర్శకత్వం: అభిషేక్ నామా
సంగీతం: జునైద్ కుమార్- అబే
సినిమాటోగ్రఫీ: సుందర్ రాజన్ ఎస్
ఎడిటింగ్: ఆర్‌సీ ప్రణవ్
నిర్మాతలు: కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి
నిర్మాణ సంస్థలు:ఎన్‌ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్
విడుదల తేది: జూలై 3, 2026
కథ:
నాగబంధం కథ 1960ల నేపథ్యంలో ప్రారంభమవుతుంది. పురావస్తు శాస్త్రవేత్త ప్రభాకర్ (జగపతి బాబు) ఆధ్వర్యంలో పరిశోధనలు చేసే ఇద్దరు స్కాలర్లు అబ్దాలీ (రిషబ్ సాహ్నీ), టెస్లా హిమాలయాల్లో నాగబంధం విముక్తికి సంబంధించిన ఒక రహస్య పుస్తకాన్ని కనుగొంటారు. ఆ పుస్తకాన్ని ప్రభుత్వానికి అప్పగించాలని టెస్లా భావిస్తే, అబ్దాలీ మాత్రం దాన్ని సొంతం చేసుకుని ప్రపంచాన్ని శాసించాలనుకుంటాడు.
ఈ క్రమంలో శ్రీరంగనాథ స్వామి నాభిపై ఉండే బ్రహ్మకమలం ఈ నాగబంధం విముక్తికి కీలకమని అబ్దాలీ తెలుసుకుంటాడు. కాలవృక్షంలో బందీగా ఉన్న భైరాగి (గరుడ రామ్) సహాయంతో బ్రహ్మాండాన్ని లొంగదీసుకోవడానికి అబ్దాలీ ఎన్నో అరాచకాలకు తెగబడతాడు. ఆ ప్రయత్నంలో ఒక గూడెంలో నివసించే రుద్ర (విరాట్ కర్ణ) కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాడు.
మరి నాగబంధానికి రుద్రకు కుటుంబానికి సంబంధం ఏంటీ? ఆ కుటుంబాన్ని అబ్దాలీ గ్యాంగ్ ఎందుకు హతమార్చింది? తన కుటుంబాన్ని చంపిన రాక్షసులపై రుద్ర ఎలా పగ తీర్చుకున్నాడు? 17వ శతాబ్దానికి చెందిన నాగసాధువు శివకీ, రుద్రకు ఉన్న సంబంధం ఏంటి? ఈ పోరాటంలో పార్వతి (నభా నటేష్) పాత్ర ఏంటీ? అబ్దాలీ అనుకుంది జరిగిందా? అనేది తెలియాలంటే నాగబంధం చూడాల్సిందే.
విశ్లేషణ:
కథ, కంటెంట్ బాగుంటే ఎలాంటి సినిమాను అయిన హిట్ చేస్తామన్న ధోరణిలో ఆడియెన్స్ మైండ్ సెట్ మారిపోయింది. అందుకే స్టార్ హీరోలు, హీరోయిన్లను చూడట్లేదు. ఇలాంటి సమయంలోనే ట్రైలర్, టీజర్‌తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమా నాగబంధం. విజువల్స్, సీన్స్‌తో నాగబంధంపై భారీ అంచనాలు పెరిగాయి.
వాటికి అనుగుణంగానే నాగబంధం సినిమా సాగింది. విజువల్స్, యాక్షన్ సీన్స్‌తో కట్టిపడేస్తుంది నాగబంధం సినిమా. అయితే, సనాతన ధర్మం విశిష్టత, పురాణాలు, అబ్బురపరిచే విజువల్స్.. వంటి అంశాలన్నింటినీ ఒక జాబితాగా రాసుకుని, వాటి చుట్టూ అల్లిన కథే నాగబంధం సినిమా.
నాగబంధం మూవీ ప్రారంభం నుంచే దర్శకుడు ప్రేక్షకులను ఒక సరికొత్త లోకంలోకి తీసుకెళ్లాడు. ప్రతి ఐదు పది నిమిషాలకు అదిరిపోయే విజువల్స్‌తో తెరపై కనిపిస్తూ కనువిందు చేస్తుంది మూవీ. సౌందర్ రాజన్ కెమెరా పనితనం, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) సినిమాకు అతిపెద్ద బలంగా నిలిచాయి. యాక్షన్ సీక్వెన్సులు కూడా అద్భుతంగా డిజైన్ చేశారు.
హిమాలయాల సీన్లు
అయితే, కథ చాలా సింపుల్‌గా అనిపిస్తుంది. నాగబంధం విముక్తి, అందుకు బ్రహ్మకమలం సాగించే వేట వంటి అంశాలు ఇంట్రెస్టింగ్‌గా అనిపించేవే. కానీ, ఇలాంటి కథలు తెలుగు వెండితెరపై చాలా వరకు వచ్చాయి. కథ ఎలా ఉన్నా టేకింగ్ బాగుంటే ఆడియెన్స్ మెప్పుపొందినట్లే. కానీ, అందులో కాస్తా తడబడినట్లుగా అనిపించింది.
కథలో బలం, పాత్రల మధ్య బలమైన భావోద్వేగాలు సరిగ్గా పండలేదు. ఫస్ట్ హాఫ్‌లో హిమాలయాల సీన్లు, హీరో ఎంట్రీ, ఫ్యామిలీ డ్రామా చాలా బాగున్నా.. సెకండాఫ్‌కు వచ్చేసరికి కథనం నెమ్మదించింది. భైరవకోనకు వెళ్లి హీరో సాహసాలు చేయడం వంటివి ఇంపాక్ట్ తగ్గించాయి. అలా హీరో చేయడానికి బలమైన కారణాన్ని చూపించలేదు.
అదిరిపోయే ఇంటర్వెల్
ఇంటర్వెల్ ఫైట్ అదిరిపోతుంది. ఇక ద్వితీయార్థంలో హీరోయిన్ చెప్పే స్టోరీ బాగుంటుంది. ఆ తర్వాత కథ హఠాత్తుగా 17వ శతాబ్దంలోకి వెళ్లినా, అక్కడ కూడా అదే విలన్, అవే అరాచకాలు చూపించడంతో కొత్తదనం లోపించింది. నాగబంధం విముక్తి చెందితే ఏం జరుగుతుందనే విషయాన్ని మరింత లోతుగా చూపించాల్సింది.
క్లైమాక్స్ బాగున్నా చివర్లో రెండో భాగం ఉందంటూ కథను తేల్చేయడం రొటీన్‌గా అనిపిస్తుంది. ఇటీవల ప్రతి సినిమాకు ఒక సీక్వెల్‌ను ప్రకటించడం పట్ల ప్రేక్షకులు పెదవి విరుస్తున్న విషయం తెలిసిందే.
విరాట్, నభా నటన ఎలా ఉందంటే?
విరాట్ కర్ణ రెండు భిన్నమైన కాలాల పాత్రల్లో చక్కగా ఒదిగిపోయాడు. రెండు పాత్రల మధ్య పెద్దగా వైవిధ్యం లేకపోయినా, అతని లుక్స్, గెటప్స్ బాగా కుదిరాయి. ముఖ్యంగా యాక్షన్ సీన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్‌లో విరాట్ నటన ఆకట్టుకుంటుంది.
హీరోయిన్ నభా నటేష్‌కు ఈ సినిమాలో చాలా ప్రాధాన్యమున్న పాత్ర దక్కింది. కథను మలుపు తిప్పే 'పార్వతి' పాత్రలో ఆమె అద్భుతమైన నటన కనబరిచింది. మిగిలిన హీరోయిన్లు దక్ష, ఐశ్వర్య మేనన్ పాత్రల పరిధి చాలా తక్కువ. అయితే, కనిపించినంత వరకు మెప్పించారు.
విలన్‌గా రిషబ్ సాహ్నీ క్రూరత్వాన్ని బాగా పండించాడు. భైరాగిగా గరుడ రామ్ గెటప్ భయపెడుతుంది. జగపతి బాబు, మురళీ శర్మ, మహేష్ మంజ్రేకర్ తమ పాత్రలకు న్యాయం చేశారు. అనసూయ, సోనియా సింగ్ మెరిశారు. సాంకేతికంగా శ్రీరంగపురం ఆలయం, విరాటపురుషాలయం సెట్స్ అద్భుతంగా నిర్మించారు.
ఫైనల్‌గా చెప్పాలంటే
ఆర్ట్ డైరెక్టర్ అశోక్ ప్రతిభ అడుగడుగునా కనిపిస్తుంది. జునైద్ కుమార్, అభి అందించిన సంగీతం, నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. కథలో ఇంకాస్త పదును, బలమైన సెంటిమెంట్ ఉండి ఉంటే ఈ 'నాగబంధం' మరో రేంజ్‌లో ఉండేది. ఫైనల్‌గా చెప్పాలంటే గ్రాండ్ విజువల్స్, యాక్షన్ చిత్రాలను ఇష్టపడే వారు థియేటర్లలో ఒకసారి నాగబంధాన్ని చూడవచ్చు.
రేటింగ్: 3/5
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


