ఈ సినిమా పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఏమీ లేదు.. ఓ పాకిస్థానీయే తీశాడేమో అనిపించింది: ధురంధర్‌పై పాకిస్థానీ రివ్యూ వైరల్
ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ నటించిన స్పై థ్రిల్లర్ 'ధురంధర్' మూవీపై ఓ పాకిస్థానీ ఇచ్చిన రివ్యూ వైరల్ అవుతోంది. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన తర్వాత పాకిస్థాన్‌లోనూ నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా చూసిన ఓ కరాచీ వాసి సోషల్ మీడియాలో తన రివ్యూ షేర్ చేశాడు.
ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రూ. 1300 కోట్లకు పైగా వసూలు చేసి ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన మూవీ 'ధురంధర్'. రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్ వంటి స్టార్లతో ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ మూవీ జనవరి 30న నెట్‌ఫ్లిక్స్‌లోకి అడుగుపెట్టింది. విశేషమేమిటంటే ఈ సినిమాను పాకిస్థాన్ థియేటర్లలో విడుదల కాకుండా నిషేధించారు. కానీ ఓటీటీలో విడుదలైన వెంటనే పాకిస్థానీయులు ఈ సినిమాను ఎగబడి చూస్తున్నారు. అలాగే ఓ కరాచీకి చెందిన ఓ వ్యక్తి మూవీ రివ్యూని షేర్ చేశాడు.

కరాచీ వాసిని ఆకట్టుకున్న 'ధురంధర్'
ధురంధర్ సినిమా చూసిన తర్వాత కరాచీలో పుట్టి పెరిగిన ఓ పాకిస్థానీ రెడిట్ (Reddit) యూజర్ రాసిన నోట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో చర్చనీయాంశమైంది. సాధారణంగా ఇండియన్ స్పై సినిమాలపై పాకిస్థాన్‌లో వ్యతిరేకత ఉంటుంది. కానీ ఈ సినిమా తనను ఎంతగానో ఆకట్టుకుందని సదరు యూజర్ పేర్కొన్నాడు.
"నేను కరాచీలో పుట్టి పెరిగాను. ఈ సినిమాను థియేటర్లో మిస్ అయినందుకు ఇప్పుడు బాధపడుతున్నాను. ఇందులో చూపించిన కరాచీ వాతావరణం, ఉర్దూ భాష వినియోగం చూసి నేను ఆశ్చర్యపోయాను. చాలా చోట్ల అచ్చం పాకిస్థాన్ వాళ్లే తీసినంత సహజంగా ఉంది (కేవలం ఆదాబ్ చెప్పే విధానం తప్ప). ఆటోల మీద ఇమ్రాన్ ఖాన్ బొమ్మలు, 'హమారా కప్తాన్ ఇమ్రాన్' వంటి చిన్న చిన్న వివరాలు కూడా దర్శకుడు మిస్ కాలేదు" అని ఆ యూజర్ ప్రశంసించారు.
ఇది పాకిస్థాన్‌కు వ్యతిరేకం కాదు
దర్శకుడు ఆదిత్య ధర్ చేసిన రీసెర్చ్‌ను ఆ యూజర్ ప్రత్యేకంగా అభినందించారు. "సినిమాలో చూపించిన 'కరాచీ రోజ్‌నామా' అనే న్యూస్ ఛానల్ నిజానికి లేదు. కానీ ఆ చిన్న ఉర్దూ వివరాలు చూస్తుంటే ముచ్చటేసింది. ఒక ఉర్దూ సాహిత్యకారుడిగా చెబుతున్నా.. ఇందులో భాష చాలా స్పష్టంగా, కచ్చితంగా ఉంది. నిజం చెప్పాలంటే, ఓ పాకిస్థానీగా నాకైతే ఈ సినిమా 'యాంటీ-పాకిస్థాన్' (పాకిస్థాన్‌కు వ్యతిరేకం) అని అస్సలు అనిపించలేదు. దర్శకుడి లోతైన పరిశోధనను కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే" అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
రికార్డుల మోత.. త్వరలో సీక్వెల్
పాకిస్థాన్‌లోని లియారీ ప్రాంతంలో ఉన్న నేర సామ్రాజ్యాన్ని అంతమొందించడానికి వెళ్ళిన భారతీయ గూఢచారి కథే 'ధురంధర్'. వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్న ఈ కల్పిత కథలో సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ కూడా కీలక పాత్రలు పోషించారు. డొమెస్టిక్ బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్లు దాటిన తొలి బాలీవుడ్ మూవీగా ఇది చరిత్ర సృష్టించింది.
ఓటీటీలోనూ అదే జోరు చూపిస్తూ 'తేరే ఇష్క్ మే', 'హక్' వంటి చిత్రాలను వెనక్కి నెట్టి పాకిస్థాన్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పుడు అందరి కళ్లు దీని సీక్వెల్ 'ధురంధర్: ది రివెంజ్' పైనే ఉన్నాయి. మార్చి 19న ఈ సీక్వెల్ థియేటర్లలో విడుదల కానుంది. రణ్‌వీర్ సింగ్ ఇప్పటికే తన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో అంచనాలు పెంచేశారు. అయితే టీజరే కాస్త అసంతృప్తికి గురి చేసింది.

E-Paper












