తెలుగు వాళ్లను అవమానిస్తారా.. నువ్వు తెలుగు మహిళవే కదా: పరాశక్తి మూవీపై నెటిజన్ల ఫైర్.. బ్యాన్ చేయాలని డిమాండ్
శివకార్తికేయన్ నటించిన పరాశక్తి మూవీపై తెలుగు నెటిజన్లు మండిపడుతున్నారు. సెన్సార్ బోర్డు సూచించిన కట్స్ లీక్ కావడం, అందులో తెలుగు వాళ్లను అవమానించే పదం వాడటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
శివకార్తికేయన్, శ్రీలీల జంటగా.. లేడీ డైరెక్టర్ సుధా కొంగర తెరకెక్కించిన పీరియాడికల్ డ్రామా ‘పరాశక్తి’. పొంగల్ రేసులో భాగంగా శనివారం (జనవరి 10) ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ.. విడుదలైన తొలి రోజే తీవ్ర వివాదంలో చిక్కుకుంది. సినిమా కంటెంట్ కంటే, బయటకు లీక్ అయిన సెన్సార్ సర్టిఫికేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ లిస్ట్‌లో తెలుగువారిని ఉద్దేశించి వాడిన ఒక పదం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.

అసలేంటి ఆ పదం? ఎందుకింత రచ్చ?
లీక్ అయిన సెన్సార్ కట్స్ జాబితా ప్రకారం.. సినిమాలో ‘గొల్టీ’ (Golty) అనే పదాన్ని సెన్సార్ బోర్డు మ్యూట్ చేసింది. సాధారణంగా తమిళనాట కొంతమంది తెలుగువారిని కించపరచడానికి లేదా ఎగతాళి చేయడానికి ఈ పదాన్ని వాడుతుంటారు. ‘తెలుగు’ ఇంగ్లిష్ పదాన్ని తిరగేస్తే (gulute) ఈ పదం వచ్చిందని కొందరు, ఇది వెనుకబాటుతనాన్ని సూచించే బూతు పదం అని మరికొందరు చెబుతుంటారు. ఏదేమైనా ఇది స్నేహపూర్వక పిలుపు మాత్రం కాదన్నది చాలామంది వాదన.
‘సుధా కొంగర గారూ.. ఇదేం న్యాయం?’
ఈ విషయం బయటకు రాగానే ‘ఎక్స్’, రెడిట్ వేదికగా తెలుగు నెటిజన్లు భగ్గుమన్నారు. ముఖ్యంగా దర్శకురాలు సుధా కొంగర స్వతహాగా తెలుగు ఆడబిడ్డ అయ్యి ఉండి.. సొంత జాతిని కించపరిచే పదాన్ని తన సినిమాలో ఎలా పెట్టారంటూ నిలదీస్తున్నారు.
“తమిళ వెర్షన్‌లో తెలుగువాళ్లను ‘గొల్టీ’ అని పిలుస్తారు.. అదే తెలుగు వెర్షన్‌కు వచ్చేసరికి ‘జై తెలుగు’ అని నినదిస్తారా? ఇదేం ద్వంద్వ వైఖరి? ఇది కళ కాదు.. పక్కా రాజకీయ హిపోక్రసీ” అంటూ ఒక నెటిజన్ ఘాటుగా స్పందించారు.
శివకార్తికేయన్‌పైనా ఆగ్రహం..
శివకార్తికేయన్‌కు తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. “తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్న హీరో అయ్యి ఉండి.. ఇలాంటి భాషను ఎలా ఒప్పుకున్నారు? చిత్ర బృందం దీనికి బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే” అని మరొకరు డిమాండ్ చేశారు. ‘బాయ్‌కాట్ పరాశక్తి’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా కొందరు ట్రెండ్ చేస్తున్నారు.
అది సరదాగా వాడిన పదం కావొచ్చా?
మరోవైపు చిత్ర బృందానికి మద్దతుగా కొందరు నిలుస్తున్నారు. ఈ సినిమాలో శ్రీలీల తెలుగు అమ్మాయిగా నటించింది. కాబట్టి ఆ పాత్రతో హీరో సరదాగా మాట్లాడే సందర్భంలో ఈ పదం వాడి ఉండొచ్చని, సినిమా చూడకుండానే బాయ్‌కాట్ చేయడం సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. నాని నటించిన ‘హిట్ 3’ తమిళ వెర్షన్‌లో కూడా ఈ పదం ఉందన్న విషయాన్ని మరికొందరు గుర్తు చేస్తున్నారు.
సినిమా నేపథ్యం ఇదీ..
‘సూరరై పోట్రు’ (ఆకాశం నీ హద్దురా) వంటి హిట్ తర్వాత సుధా కొంగర నుంచి వచ్చిన సినిమా ఇది. 1960ల నాటి మద్రాస్ నేపథ్యంలో, హిందీ భాషను బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ సాగే కథ ఇది. నిజానికి ఈ సినిమా విజయ్ నటించిన ‘జననాయగన్’తో పోటీ పడాల్సి ఉంది. కానీ సెన్సార్ ఇబ్బందుల వల్ల విజయ్ సినిమా వాయిదా పడటంతో ‘పరాశక్తి’ సోలోగా బరిలోకి దిగింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


