...
...
Next Story

Phule Telugu: 200 ఏళ్ల నాటి చరిత్రతో తెలుగు డబ్బింగ్ హిందీ సినిమా ఫూలే- వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు!

Pratik Gandhi Phule Movie In Telugu Release: మహిళల విద్యకు బాటలు వేసిన ఫూలే దంపతుల సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. ప్రతీక్ గాంధీ, పత్రలేఖ ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ సినిమాను తెలుగులో డబ్ చేస్తున్నారు. ఇప్పటికే ఫూలే సినిమాను వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు మెచ్చుకున్నారు.

Published on: Nov 24, 2026, 17:14:30 IST
Advertisement

Mahatma Jyotiba Phule Biopic Phule In Telugu: సామాజిక సంస్కరణల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహనీయులు మహాత్మా జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే. కులవివక్ష, అంటరానితనం, సామాజిక అసమానతలు, మహిళలపై వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతూ విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఈ మహనీయుల జీవిత ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం.

మహిళా విద్యకు మార్గం

200 ఏళ్ల నాటి చరిత్రతో తెలుగు డబ్బింగ్ హిందీ సినిమా ఫూలే- వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు!
200 ఏళ్ల నాటి చరిత్రతో తెలుగు డబ్బింగ్ హిందీ సినిమా ఫూలే- వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు!

ముఖ్యంగా మహిళా విద్యకు మార్గం చూపుతూ, అణగారిన వర్గాల హక్కుల కోసం వారు సాగించిన పోరాటాన్ని వెండితెరపై ఆవిష్కరించిన చిత్రమే ‘ఫూలే’. ప్రముఖ దర్శకుడు అనంత్ మహదేవన్ తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ వెర్షన్ నవంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది. ఏషియన్ సినిమాస్ ద్వారా సునీల్ నారంగ్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

ప్రతీక్ గాంధీ మహాత్మా జ్యోతిరావ్ ఫూలే పాత్రలో, పత్రలేఖ సావిత్రిబాయి ఫూలే పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సుపదా క్రియేషన్స్ నిర్మించింది. డా. పొన్నం రవిచంద్ర నిర్మాతగా వ్యవహరించారు. తెలుగు వెర్షన్‌కు చేతన్ కత్తి మాటలు అందించారు.

వర్ధంతి సందర్భంగా మహనీయుడి జీవితానికి నివాళి!

నవంబర్ 28, 2026 మహాత్మా జ్యోతిరావ్ ఫూలే 136వ వర్ధంతి సందర్భంగా ఆయన జీవితం, ఆశయాలు, సమాజం కోసం సాగించిన పోరాటాన్ని మరింతమంది ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఫూలే దంపతులు ఎదుర్కొన్న అవమానాలు, అడ్డంకులు, చేసిన త్యాగాలు, విద్య మరియు సమానత్వం కోసం వారు వెలిగించిన ఆశయ జ్యోతి ఈ సినిమాలో ప్రధానంగా కనిపించనున్నాయి.

ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రత్యేకంగా ఈ చిత్రాన్ని వీక్షించారు. సినిమా చూసిన అనంతరం ఫూలే దంపతులు కులవివక్ష నిర్మూలన కోసం, మహిళా విద్య కోసం చేసిన పోరాటం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని ఉప ముఖ్యమంత్రి కొనియాడారు. వారి సామాజిక సేవ, జీవితాలు నేటి సమాజానికి ఎంతో అవసరమైన సందేశాన్ని అందిస్తాయని అభిప్రాయపడ్డారు.

ఈ సినిమా విడుదల నేపథ్యంలో మంగళవారం (నవంబర్ 24) హైదరాబాద్‌లోని ఫిల్మ్ చాంబర్‌లో ఫూలే మూవీ యూనిట్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సోషల్ యాక్టివిస్ట్ విమలక్క, టీఎఫ్‌సీసీ చైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్, ప్రముఖ రచయిత పసునూరి రవీందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

హౌస్‌ఫుల్ కలెక్షన్స్ రావాలి

ఈ సందర్భంగా పసునూరి రవీందర్ మాట్లాడుతూ.. ‘‘హిందీలో వచ్చిన ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న పొన్నం రవిచంద్ర గారికి ధన్యవాదాలు. మహాత్మా జ్యోతిరావ్ ఫూలే గారి జీవితం అందరికీ ఆదర్శనీయం. అలాంటి గొప్ప వ్యక్తి జీవితాన్ని తెరపైకి తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.

సోషల్ యాక్టివిస్ట్ విమలక్క మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు ఆడపిల్లలు ఎన్నో రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారంటే అందుకు సావిత్రిబాయి ఫూలే గారు వేసిన పునాదులు ఎంతో ముఖ్యమైనవి. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందుతారు. సినిమా విడుదలయ్యే అన్ని థియేటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్లు రావాలని కోరుకుంటున్నాను’’ అని ఆకాంక్షించారు.

విభిన్నమైన జోనర్‌లో

డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. ‘‘జ్యోతిరావ్ ఫూలే జీవితాన్ని తెరపైకి తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి గొప్ప సందేశాత్మక చిత్రాలు మరిన్ని రావాలి. ఇకపై ఆయన జయంతి సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.

చిత్ర నిర్మాత డా. పొన్నం రవిచంద్ర మాట్లాడుతూ.. "ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న సునీల్ నారంగ్ గారికి, ఆడియోను విడుదల చేస్తున్న మధుర ఆడియో వారికి ధన్యవాదాలు. ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. నవంబర్ 27న ఎన్ని సినిమాలు విడుదలైనా, ‘ఫూలే’ ఒక విభిన్నమైన జోనర్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది" అని అన్నారు.

200 ఏళ్లనాటి చరిత్ర

"సుమారు 200 ఏళ్ల క్రితం జరిగిన చరిత్రను నేటి ప్రజలు, ముఖ్యంగా మహిళలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే జీవిత చరిత్రను తెలుగులోకి తీసుకురావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. నవంబర్ 26న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి సినిమాలో మహాత్మా ఫూలే పాత్రలో నటించిన ప్రతీక్ గాంధీ గారు హాజరవుతారు" ప్రొడ్యూసర్ పొన్నం రవిచందర్ తెలిపారు.

 

ABOUT THE AUTHOR

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks