TV: నెలకు లక్షన్నర అద్దె.. 4.25 లక్షలకు కొన్న భవనం ఇప్పుడు 450 కోట్లు.. రియల్ ఎస్టేట్ కింగ్స్‌గా టీవీ నిర్మాత కుటుంబం!

Ekta Kapoor Rents Juhu Property: బాలాజీ టెలిఫిలిమ్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, లేడి నిర్మాత ఏక్తా కపూర్ ముంబై జుహూలోని తన భవనంలో ఒక ఫ్లోర్‌ను రూ. 1.5 లక్షల నెలసరి అద్దెకు ఇచ్చారు. బాలీవుడ్‌లోనే రియల్ ఎస్టేట్ కింగ్స్‌గా ఈ లేడి ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ కుటుంబం మరోసారి నిలిచింది.

Published on: Aug 1, 2026, 06:13:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ekta Kapoor Family Net Worth In Real Estate: బాలీవుడ్ సీనియర్ నటుడు జితేంద్ర కుమార్తె, ప్రముఖ టీవీ సిరీయల్స్ నిర్మాత ఏక్తా కపూర్ ముంబై ప్రాపర్టీ మార్కెట్‌లో మరోసారి చర్చనీయాంశమయ్యారు. ముంబైలోని అత్యంత విలాసవంతమైన జుహూ ప్రాంతంలో ఉన్న తన 'ఏక్తా హౌస్' భవనంలోని ఒక ఫ్లోర్‌ను ఆమె నెలకు రూ. 1.5 లక్షల అద్దెకు ఇచ్చారు.

నెలకు లక్షన్నర అద్దె.. 4.25 లక్షలకు కొన్న భవనం ఇప్పుడు 450 కోట్లు.. రియల్ ఎస్టేట్ కింగ్స్‌గా టీవీ నిర్మాత కుటుంబం! (Instagram/Ekta Kapoor)
నెలకు లక్షన్నర అద్దె.. 4.25 లక్షలకు కొన్న భవనం ఇప్పుడు 450 కోట్లు.. రియల్ ఎస్టేట్ కింగ్స్‌గా టీవీ నిర్మాత కుటుంబం! (Instagram/Ekta Kapoor)

రెండేళ్ల కాల పరిమితితో ఒప్పందం

ఆస్తి నమోదు వివరాలను పర్యవేక్షించే 'క్రి మ్యాట్రిక్స్' (CRE Matrix) విడుదల చేసిన పత్రాల ఆధారంగా ఈ డీల్ సమాచారం బయటకు వచ్చింది. ఈ లీవ్ అండ్ లైసెన్స్ ఒప్పందం రెండేళ్ల కాల పరిమితితో జరిగింది. 2025 మార్చి 1 నుంచి ప్రారంభమైన ఈ అగ్రిమెంట్ 2027 ఫిబ్రవరి 28 వరకు అమల్లో ఉంటుంది.

ఈ అద్దె ఒప్పందం జులై 28న అధికారికంగా రిజిస్టర్ అయింది. నాలుగు అంతస్తుల ఈ భవనంలో అద్దెకు ఇచ్చిన ఫ్లోర్‌తో పాటు ఒక కార్ పార్కింగ్ సదుపాయం కూడా ఉంది. అద్దెదారుడు ఒప్పంద కాలానికి సంబంధించిన అన్ని పోస్ట్ డేటెడ్ చెక్కులను ముందే అందజేశారు.

మరొక ఫ్లోర్ అద్దెకు

జుహూలోని ఏక్తా హౌస్‌లో ఫ్లోర్‌ను అద్దెకు ఇవ్వడం లేడి నిర్మాత ఏక్తాకు ఇది మొదటిసారి కాదు. 2021లో కూడా ఇదే భవనంలో మరొక ఫ్లోర్‌ను నెలకు రూ. 2.7 లక్షల అద్దెకు ఇచ్చారు. అప్పట్లో రూ. 10 లక్షల సెక్యూరిటీ డిపాజిట్‌తో పాటు 12 నెలల లాక్-ఇన్ పీరియడ్‌తో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు.

కేవలం టీవీ కార్యక్రమాలు, సినిమాల నిర్మాణంలోనే కాకుండా స్థిరాస్తుల పెట్టుబడుల్లోనూ జితేంద్ర కుటుంబం బాలీవుడ్ వ్యాపార వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ముంబై వ్యాపార ప్రపంచంలో అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేసే ఇన్వెస్టర్లలో వీరు ముందు వరుసలో ఉన్నారు. గత ఏడాదిన్నర కాలంలోనే ఏక్తా కపూర్ కుటుంబం అనేక భారీ ప్రాపర్టీ డీల్స్ పూర్తి చేశారు.

బాలీవుడ్‌లోనే బిగ్గెస్ట్ రియల్ ఎస్టేట్ కింగ్స్!

2025 మే నెలలో జితేంద్ర కుటుంబం ఇండియన్ రియల్ ఎస్టేట్ రంగాన్ని షేక్ చేసే రికార్డు డీల్ కుదుర్చుకుంది. అంధేరీలోని 2.39 ఎకరాల స్థలాన్ని ఎన్‌టీటీ గ్లోబల్ డేటా సెంటర్స్‌కు ఏకంగా రూ. 855 కోట్లకు విక్రయించారు. వారి సొంత కంపెనీలైన ప్యాంథియాన్ బిల్‌కాన్, తుషార్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ద్వారా జరిగిన ఈ లావాదేవీ, ఆ సంవత్సరంలో ఒక బాలీవుడ్ కుటుంబం చేసిన అతిపెద్ద రియల్ ఎస్టేట్ డీల్‌గా నిలిచింది.

అక్కడ సుమారు 4.9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు భవనాలతో ఉన్న బాలాజీ ఐటీ పార్క్ ఉండేది. దీని తర్వాత జూన్ 2025లో వర్లీలోని ఓంకార్ 1973 టవర్‌లో ఉన్న 2,149 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ను రూ. 12.25 కోట్లకు అమ్మేశారు. అంటే చదరపు అడుగుకు దాదాపు రూ. 57,003 ధర పలికింది. 2021లో కూడా పూణేలోని ఒక ప్లాట్‌ను రూ. 20 కోట్లకు తమ సొంత కంపెనీలకు విక్రయించి స్థిరాస్తుల పోర్ట్‌ఫోలియోను సర్దుబాటు చేశారు.

రూ. 4 లక్షల భవనం.. నేడు రూ. 450 కోట్లు!

జితేంద్ర రియల్ ఎస్టేట్ దూరదృష్టి గురించి చిత్ర పరిశ్రమలో ప్రత్యేక కథనాలు చెప్పుకుంటారు. దశాబ్దాల క్రితం దివంగత నటుడు భరత్ భూషణ్ నుంచి ముంబైలోని పాలి హిల్ ప్రాంతంలో ఉన్న ఒక బంగ్లాను కేవలం రూ. 4.25 లక్షలకు జితేంద్ర కొనుగోలు చేశారు. నేడు ఆ ప్రాపర్టీ విలువ రూ. 450 కోట్లకు పైగానే ఉంటుందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

"ఆ బంగ్లాను పునర్నిర్మించే సమయంలో అందులోని బర్మా టీక్ కలపను అమ్మితేనే నాకు రూ. 11.5 లక్షలు వచ్చాయి" అని ఒక ఇంటర్వ్యూలో జితేంద్ర గుర్తుచేసుకున్నారు. ఆయన బంగ్లా కొన్న మొత్తం కంటే మూడు రెట్లు ఎక్కువ సొమ్ము కేవలం పాత కలప అమ్మకంతోనే తిరిగి రావడం ఆయన అదృష్టానికి, వ్యాపార సామర్థ్యానికి నిదర్శనం. ఇలా ముంబై ప్రాపర్టీ మార్కెట్‌లో కొనుగోళ్లు, లీజుల ద్వారా జితేంద్ర ఫ్యామిలీ తమ సామ్రాజ్యాన్ని నిరంతరం విస్తరిస్తోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More