370 Biryani: రూ. 370 బిర్యానీ డేటింగ్ వివాదం, ఊడిన యువకుడి ఉద్యోగం- కమెడియన్ షో బ్యాన్ చేయాలన్న సీరియల్ నటి రష్మీ దేశాయ్

TV Actress Rashami Desai On 370 Biryani Controversy: కామెడీ షోలో అమ్మాయితో డేటింగ్‌, రూ. 370 బిర్యానీ ఖర్చుపై ఒక యువకుడు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. ఈ వివాదంతో సదరు యువకుడు ఉద్యోగం కోల్పోగా, కమెడియన్‌ షోలను బ్యాన్ చేయాలని సీరియల్ నటి రష్మీ దేశాయ్ డిమాండ్ చేశారు.

Published on: Jun 11, 2026, 10:20:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Serial Actress Rashami Desai On 370 Biryani Controversy: సోషల్ మీడియాలో వ్యూస్ కోసం, కాసేపు నవ్వుల కోసం కమెడియన్లు చేసే 'క్రౌడ్ వర్క్' (ప్రేక్షకులతో మాట్లాడటం) షోలు ఒక్కోసారి హద్దులు దాటుతుంటాయి. తాజాగా రూ. 370 చికెన్ బిర్యానీ చుట్టూ ముసురుకున్న వివాదం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

రూ. 370 బిర్యానీ డేటింగ్ వివాదం, ఊడిన యువకుడి ఉద్యోగం- కమెడియన్ షో బ్యాన్ చేయాలన్న సీరియల్ నటి రష్మీ దేశాయ్
రూ. 370 బిర్యానీ డేటింగ్ వివాదం, ఊడిన యువకుడి ఉద్యోగం- కమెడియన్ షో బ్యాన్ చేయాలన్న సీరియల్ నటి రష్మీ దేశాయ్

370 రూపాయల బిర్యానీ

ఒక అమ్మాయితో డేటింగ్‌కు వెళ్లి 370 రూపాయల బిర్యానీ తినిపించినందుకు, ఆ డబ్బును వసూలు చేసుకునేందుకు ఆమెను బలవంతంగా చీకటి పార్కుకు తీసుకెళ్లానంటూ ఓ యువకుడు నవ్వుతూ చెప్పిన మాటలు దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారితీశాయి. మహిళల భద్రతను, వారి అంగీకారాన్ని హేళన చేసేలా సాగిన ఈ ఉదంతం తీవ్ర రూపం దాల్చడంతో సదరు యువకుడు తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు.

అసలు షోలో ఏం జరిగింది?

గుర్గావ్‌కు చెందిన 23 ఏళ్ల హిమాన్షు జంగ్రా అనే యువకుడు ప్రముఖ కమెడియన్ ప్రణీత్ మోరే నిర్వహించిన స్టాండప్ కామెడీ షోకి హాజరయ్యాడు. షో మధ్యలో కమెడియన్ ప్రణీత్ ప్రేక్షకులతో మాట్లాడుతుండగా హిమాన్షు మైక్ తీసుకుని తన డేటింగ్ అనుభవాన్ని పంచుకున్నాడు.

తాను ఒక అమ్మాయితో డేటింగ్‌కు వెళ్లానని, అక్కడ ఒక ప్లేట్ చికెన్ బిర్యానీ కోసం రూ. 370 ఖర్చు పెట్టానని చెప్పాడు. అంత డబ్బు పెట్టినందుకు తగిన 'రిటర్న్' (ప్రతిఫలం) ఆశించడంలో తప్పులేదంటూ వ్యాఖ్యానించాడు.

ఎలాగైనా వసూలు చేసుకోవాలని

బిర్యానీ తిన్న తర్వాత ఆ అమ్మాయి తనను ఇంటి దగ్గర దించమని అడిగిందని, కానీ తాను మాత్రం రూ. 370 ఖర్చు పెట్టాను కాబట్టి ఎలాగైనా వసూలు చేసుకోవాలని డిసైడ్ అయ్యానని హిమాన్షు చెప్పుకొచ్చాడు.

ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఒక చీకటి పార్కుకు తీసుకెళ్లి, రాత్రి అయ్యేంతవరకు అక్కడే తనతో గడిపానని నవ్వుతూ వివరించాడు. ఈ దారుణమైన విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సింది పోయి, కమెడియన్ ప్రణీత్ మోరే స్టేజ్ మీద నవ్వుతూ దానికి మరింత పబ్లిసిటీ ఇచ్చాడు.

ప్రణీత్ మోరే షోలను బ్యాన్ చేయాలి: రష్మీ దేశాయ్

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రముఖ బుల్లితెర సీరియల్ నటి, బిగ్ బాస్ బ్యూటీ రష్మీ దేశాయ్ ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఈ వీడియోను షేర్ చేస్తూ ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

"ఇది అస్సలు సమంజసం కాదని, ఇందులో ఎలాంటి కంటెంట్ లేదు, క్రియేటివిటీ లేదు. ప్రణీత్ అసలు ఆర్టిస్టే కాదు, కమెడియన్ అంతకన్నా కాదు" అని రష్మీ దేశాయ్ దుయ్యబట్టారు.

ఇలాంటి వారి వల్ల నిజమైన కళాకారులకు చెడ్డ పేరు వస్తోందని రష్మీ దేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. సదరు గుర్గావ్ అబ్బాయి తన ఉద్యోగాన్ని కోల్పోయాడని, దాంతో పాటు కమెడియన్ ప్రణీత్ షోలను కూడా వెంటనే బ్యాన్ చేయాలని రష్మీ డిమాండ్ చేశారు. రష్మీతో పాటు కుషా కపిల, ఎల్విష్ యాదవ్ వంటి ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా ప్రణీత్ మోరే తీరును తీవ్రంగా తప్పుపట్టారు.

ఉద్యోగం ఊడింది.. అకౌంట్లు క్లోజ్ అయ్యాయి

వివాదం ముదరడంతో హిమాన్షు జంగ్రా పనిచేస్తున్న 'స్టార్విక్ డిజైన్' (Starvik Design) సంస్థ తక్షణమే స్పందించింది. మహిళల పట్ల అగౌరవంగా నడుచుకునే ఇలాంటి వ్యక్తులను తాము సమర్థించబోమని స్పష్టం చేస్తూ, హిమాన్షును ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు సదరు సంస్థ వ్యవస్థాపకుడు వివేక్ విశ్వకర్మ ప్రకటించారు.

పరిస్థితి చేయి దాటిపోవడంతో హిమాన్షు సోషల్ మీడియాలో క్షమాపణలు చెప్పి తన అకౌంట్లన్నింటినీ డిలీట్ చేసుకున్నాడు. మరోవైపు కమెడియన్ ప్రణీత్ మోరే సైతం నెటిజన్ల ట్రోలింగ్ తట్టుకోలేక తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేశాడు.

అది నా వైఫల్యమే, నన్ను క్షమించండి

అంతకుముందు అతడు సోషల్ మీడియాలో క్షమాపణలు చెబుతూ నోట్ రిలీజ్ చేశాడు. "ఆ ప్రేక్షకుడు చేసిన వ్యాఖ్యలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ సమయంలో నవ్వి వదిలేయకుండా అతడిని ప్రశ్నించి ఉండాల్సింది. అది నా వైఫల్యమే, నన్ను క్షమించండి" అని ప్రణీత్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ఉదంతం డిజిటల్ మీడియాలో 'టాక్సిక్ డేటింగ్ కల్చర్'పై సరికొత్త చర్చకు దారితీసింది.

రష్మీ దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ
రష్మీ దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. కమెడియన్ ప్రణీత్ మోరే షోలో జరిగిన రూ. 370 బిర్యానీ వివాదం ఏంటి?

యువకుడు హిమాన్షు జంగ్రా ఒక అమ్మాయితో డేటింగ్‌కు వెళ్లి రూ. 370 బిర్యానీ కొనిచ్చినందుకు, ఆ డబ్బు వసూలు చేసుకోవడానికి ఆమె ఇష్టం లేకపోయినా చీకటి పార్కుకు తీసుకెళ్లానని కామెడీ షోలో చెప్పడం వివాదంగా మారింది.

2. ఈ వివాదం కారణంగా హిమాన్షు జంగ్రాపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు?

హిమాన్షు వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో, అతడు పనిచేస్తున్న 'స్టార్విక్ డిజైన్' సంస్థ అతడిని ఉద్యోగం నుంచి తక్షణమే తొలగించింది.

3. ప్రణీత్ మోరే వివాదంపై నటి రష్మీ దేశాయ్ ఏమని స్పందించారు?

ఇది కామెడీ కాదని, ప్రణీత్ అసలు కమెడియనే కాదని రష్మీ దేశాయ్ విమర్శించారు. సదరు యువకుడితో పాటు కమెడియన్ ప్రణీత్ షోలను కూడా బ్యాన్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More