శంబాల రివ్యూ- వెయ్యేళ్ల చరిత్రగల ఊరుకు పట్టిన బండ భూతం- ఆది సాయి కుమార్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ ఆకట్టుకుందా?
ఆది సాయి కుమార్ హీరోగా తెరకెక్కిన హారర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా ‘శంబాల’. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సీరియల్ నటుడు ఇంద్రనీల్ కీలక పాత్ర పోషించాడు. ఇవాళ (డిసెంబర్ 25) శంబాల థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి శంబాల రివ్యూలో తెలుసుకుందాం.
టైటిల్: శంబాల

నటీనటులు: ఆది సాయి కుమార్, అర్చన అయ్యర్, స్వాసిక విజయన్, మధు నందన్, ఇంద్రనీల్, రవివర్మ, మీసాల లక్ష్మణ్, షిజు మీనన్, హర్ష వర్ధన్ తదితరులు
దర్శకత్వం: యగంధర్ ముని
సంగీతం: శ్రీచరణ్ పాకాల
సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ కె బంగారి
ఎడిటింగ్: శ్రవణ్ కటికనేని
నిర్మాతలు: రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి
విడుదల తేది: 25 డిసెంబర్ 2025
మంచి హిట్ కోసం ట్రై చేస్తున్న టాలెంటెడ్ హీరో ఆది సాయి కుమార్. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాకు యుగంధర్ దర్శకత్వం వహించారు. హారర్, మిస్టరీ, థ్రిల్లర్, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన శంబాల ఇవాళ (డిసెంబర్ 25) ఇవాళ థియేటర్లలో విడుదల అయింది.
అయితే, థియేట్రికల్ రిలీజ్‌కు ముందు కంటెంట్‌పై నమ్మకంతో డిసెంబర్ 23, 24 తేదీల్లో శంబాల స్పెషల్ ప్రీమియర్ షోలు వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి శంబాల రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
శంబాల కథ 80వ దశకంలో జరుగుతుంది. వెయ్యేళ్ల చరిత్ర ఉన్న శంబాల గ్రామంలో ఓ ఉల్క పడటంతో పరిస్థితులన్నీ మారుతాయి. ఊరి జనం హత్యలు చేయడం, ఆత్మహత్యలు చేసుకోవడం మొదలుపెడతారు. దాంతో ఊరికి బండ భూతం పట్టిందని జనం అనుకుంటారు. రాము దగ్గర ఉన్న ఆవుకు పాలు పితికితే రక్తం వస్తుందని దాన్ని చంపాలనుకుంటారు ప్రజలు.
ఈ క్రమంలోనే ఉల్కని పరిశోధించేందుకు విక్రమ్ (ఆది)ని ప్రభుత్వం పంపిస్తుంది. విక్రమ్ ఊర్లోకి వచ్చిన తరువాత ఊరిని ఎదురించి ఆ ఆవుని రక్షిస్తాడు. కానీ, రాము అతి కిరాతకంగా మారి చాలా మందిని హత్యలు చేసి, ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా ఊరి జనం ఇలాగే చేస్తుంటారు.
అసలు ఊరి జనం ఎందుకు అలా ప్రవర్తిస్తుంటారు? వాటికి ఆ ఉల్క (బండ భూతానికి)కి సంబంధం ఉంటుందా? ఉల్క ఎలా పడింది? దాని నేపథ్యం ఏంటీ? విక్రమ్ ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తాడా? అసలు దేవి పాత్రకు ఆ ఊరికి ఉన్న సంబంధం ఏంటి? చివరకు శంబాల ఊరి సమస్య తీరుతుందా? లేదా? అసలు ఆ ఊరి నేపథ్యం ఏంటి? అనేది తెలియాలంటే శంబాల చూడాల్సిందే.
విశ్లేషణ:
హారర్ థ్రిల్లర్స్‌కు మంచి మిస్టరీని యాడ్ చేసి తెరకెక్కిస్తే ఆ సినిమాలు సూపర్ హిట్ అవుతాయి. శంబాల కూడా అదే ట్రాక్‌లోకి రూపొందిన సినిమా. ప్రథమార్ధం మొత్తం శంబాల గ్రామం, చరిత్ర, దాని పరిచయం, ఆ ఊరికి సమస్య రావడం, అనుకోని సంఘటనలు జరగడం వంటి అంశాలతో సాగుతుంది.
సీటులో కూర్చున్న ప్రేక్షకుడికి వెన్నులో వణుకు పుట్టించే సన్నివేశాలు, ఉత్కంఠభరితమైన ప్రీ-ఇంటర్వెల్, ఇంటర్వెల్ బ్లాక్‌లు సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయి. ఇంటర్వెల్ కార్డ్ అద్భుతంగా పడుతుంది.
ద్వితీయార్థం వేగంగా పరుగులు పెడుతుంది. సమస్య ఎక్కడ మొదలైందో కనుక్కోవడం, దానికి పరిష్కారం వెతకడం అనే అంశాల చుట్టూ హీరో ప్రయాణం సాగుతుంది. ఫస్ట్ హాఫ్‌లో రవి వర్మ, మీసాల లక్ష్మణ్ భయపెడితే సెకండాఫ్‌లో ఇంద్రనీల్ పాత్ర సన్నివేశాలు భయభ్రాంతులకు గురిచేస్తాయి.
క్లైమాక్స్ అలా
సినిమా నిండా దర్శకుడు హై మూమెంట్స్‌ను తెలివిగా పొందుపరిచారు. క్లైమాక్స్ వరకు కథను గాడి తప్పకుండా నడిపించడంలో డైరెక్టర్ ప్రతిభను మెచ్చుకోవచ్చు. అయితే, క్లైమాక్స్ పర్వాలేదనిపిస్తుంది. అప్పటివరకు అంత హై ఇచ్చిన సీన్లతో సాగడంతో క్లైమాక్స్ కాస్త బలహీనంగా అనిపిస్తుంది.
ఆది సాయి కుమార్ నటన
శంబాల చిత్రంలో ఆది సాయి కుమార్ నటన చాలా రోజుల తర్వాత ఓ కొత్త కోణంలో కనిపించింది. విక్రమ్ పాత్రలో ఆయన చూపించిన ఇంటెన్స్ లుక్, సెటిల్డ్ నటన మెప్పిస్తుంది. యాక్షన్, ఎమోషనల్ సీన్లలో ఆది ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపించి కథకు బలాన్నిచ్చారు. ఇక దేవి పాత్రలో అర్చనా ఐయ్యర్ సర్‌ప్రైజ్ పర్ఫామెన్స్ ఆకట్టుకుంది.
ఎవరెలా చేశారంటే
కథను మలుపు తిప్పే కీలక పాత్రల్లో రవి వర్మ, మీసాల లక్ష్మణ్, ఇంద్రనీల్ నటన, మేకోవర్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది. చిన్నారుల్లో బేబీ చైత్ర పాత్ర కూడా ప్రత్యేకంగా నిలుస్తుంది. స్వాసిక విజయన్ , హర్ష వర్దన్, మధు నందన్, శివ, ప్రియ వంటి ఇతర నటీనటుల పాత్రలు కూడా సినిమాలో బలంగా నిలబడ్డాయి. ఊరి సర్పంచ్ కొడుకు పాత్రలో శివ కార్తీక్ తన నటనతో ఆకట్టుకున్నాడు.
ఇక దర్శకుడు యుగంధర్ ముని ఎంచుకున్న కథ ప్రేక్షకుడి ఊహకు అందని విధంగానే సాగుతుంది. అలా గ్రిప్పింగ్ అండ్ ఎంగేజింగ్‌గా తెరకెక్కించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. బీజీఎమ్, విజువల్స్ అదిరిపోయాయి. రెండు భయపెట్టేందుకు ప్లస్ పాయింట్స్‌గా నిలిచాయి. కెమెరామెన్, సంగీత దర్శకుడు సినిమాకు హైలెట్.
ఓవరాల్‌గా చెప్పాలంటే
ఎడిటింగ్ బాగుంది. సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. సాంకేతిక నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే భయపెడుతూనే ఎంగేజ్ చేసే హారర్ మిస్టరీ థ్రిల్లర్ శంబాలను ఎంచక్కా చూసేయొచ్చు.
రేటింగ్: 3/5
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


