...
...
Next Story

Singeetham Srinivasa Rao: ఆయన రూటే వేరు.. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి లెజెండరీ వరకు.. సింగీతం శ్రీనివాసరావు కేరాఫ్ సినిమా

Singeetham Srinivasa Rao: మన పుట్టుక ఎలా అయినా ఉండొచ్చు, కానీ చావు మాత్రం చరిత్ర సృష్టించేదిగా ఉండాలని గొప్పవాళ్లు చెప్పారు. అలాంటి చరిత్ర సృష్టించిన, సినీ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే దిగ్గజం సింగీతం శ్రీనివాస రావు. ఆయన కన్నుమూయొచ్చు కానీ ఆయన సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకుల కన్నులలోనే ఉంటాయి.

Published on: Oct 4, 2026, 06:02:46 IST
Advertisement

Singeetham Srinivasa Rao: ఇండియన్ సినిమాలకు వినూత్న ప్రయోగాల రూపురేఖలు అద్దిన మహోన్నత సృష్టికర్త సింగీతం శ్రీనివాసరావు (94). ఈ లెజెండరీ డైరెక్టర్ వయోభారంతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో కన్నుమూశారు. ‘సినిమాకు ఒక ఫార్ములా అంటూ ఏమీ లేదు.. ప్రయోగాలే దాని ఆయువు పట్టు’ అని నమ్మిన ఒక లెజెండ్ ప్రస్థానం ముగిసింది. ఆయన భౌతికంగా మనల్ని విడిచివెళ్లినా, వెండితెరపై ఆయన లిఖించిన అద్భుతాలు ఎప్పటికీ అమరమే.

కేవీ రెడ్డి స్కూల్ నుంచి నాగ్ అశ్విన్ జనరేషన్ వరకు

ఆయన రూటే వేరు.. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి లెజెండరీ వరకు.. సింగీతం శ్రీనివాసరావు కేరాఫ్ సినిమా (x/shreyasgroup)
ఆయన రూటే వేరు.. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి లెజెండరీ వరకు.. సింగీతం శ్రీనివాసరావు కేరాఫ్ సినిమా (x/shreyasgroup)

మహానటులు ఎన్టీఆర్ నటించిన క్లాసిక్ సినిమా ‘మాయాబజార్’కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించారు సింగీతం శ్రీనివాసరావు. లెజెండరీ దర్శకుడు కె.వి. రెడ్డి వద్ద నేర్చుకున్న మెళకువలతో సింగీతం సరికొత్త సినిమా ప్రపంచాన్ని సృష్టించారు. ఏడేళ్ల క్రితం ‘కల్కి 2898 AD’ కోసం నాగ్ అశ్విన్ స్క్రిప్ట్ చర్చల్లో పాల్గొన్న సింగీతం.. 2026లో తన 94 ఏళ్ల వయసులో అదే నాగ్ అశ్విన్ నిర్మాణంలో 'సింగ్ గీతం' అనే పూర్తి స్థాయి మ్యూజికల్ ఫాంటసీ చిత్రానికి దర్శకత్వం వహించి, చివరి శ్వాస వరకు తానేంటో నిరూపించుకున్నారు.

మాటలు లేని పుష్పక విమానం

టాకీ సినిమాలు రాజ్యమేలుతున్న రోజుల్లో, అస్సలు ఒక్క ముక్క కూడా డైలాగ్ లేకుండా సినిమా తీస్తానంటే అందరూ పిచ్చి అనుకున్నారు. కానీ విశ్వనటుడు కమల్ హాసన్‌తో కలిసి సింగీతం సృష్టించిన విజువల్ వండర్ పుష్పక విమానం. మాటల్లేవు.. కేవలం ఎక్స్ ప్రెషన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించారు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇదొక ఎవర్‌గ్రీన్ సిలబస్!

టైమ్ ట్రావెల్ ఆదిత్య 369

కమల్ హాసన్ - సింగీతం కాంబో అంటేనే థియేటర్లలో ఒక అద్భుతం. ఆధునిక కంప్యూటర్ గ్రాఫిక్స్ (VFX) అందుబాటులో లేని కాలంలోనే కేవలం లెన్స్ ట్రిక్స్, కెమెరా యాంగిల్స్‌తో ‘అపూర్వ సహోదరులు’ చిత్రంలో పొట్టి కమల్‌ను సృష్టించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. అలాగే ‘మైఖేల్ మదన కామరాజు’ సినిమాలో నలుగురు కమల్ హాసన్‌ల కన్ఫ్యూజన్ కామెడీని హ్యాండిల్ చేసిన తీరు నేటి తరం దర్శకులకు ఒక పాఠం.

సెంటిమెంట్ టు సోషియో ఫాంటసీ

ప్రమాదంలో కాలు కోల్పోయినా పట్టుదల వీడకుండా నర్తకిగా మారిన సుధాచంద్రన్ నిజ జీవిత కథతో సింగీతం తీసిన ‘మయూరి’ ఒక ఎమోషనల్ మాస్టర్‌పీస్. అదే చేత్తో బాలకృష్ణతో ‘భైరవద్వీపం’ లాంటి జానపద బ్రహ్మాండ చిత్రాన్ని తెరకెక్కించి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశారు. ఇటు కన్నీళ్లు పెట్టించాలన్నా, అటు పాతాళ భైరవి లాంటి మాయా ప్రపంచంలోకి తీసుకెళ్లాలన్నా అది ఒక్క సింగీతానికే సాధ్యమైంది.

సెలవు లెజెండ్.. మీ ప్రయోగాలు అమరం

కేవలం తెలుగులోనే కాదు తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 60కి పైగా చిత్రాలు తీసిన ఆల్‌రౌండర్ సింగీతం. ఆయన టచ్ చేయని జోనర్ లేదు. దర్శకుడిగానే కాకుండా స్క్రిప్ట్ రైటర్‌గా, సంగీత దర్శకుడిగా, గేయ రచయితగా, నటుడిగా బహుముఖ ప్రజ్ఞ చాటారు. సినిమానే ఊపిరిగా బతికిన ఈ ‘ప్రయోగాల అభినవ బ్రహ్మ’కు ఇండియన్ సినిమా కన్నీటి వీడ్కోలు పలుకుతోంది.

మా చిన్నతనాన్ని మీ సినిమాలతో ఇంత అందంగా మార్చినందుకు.. థ్యాంక్యూ సింగీతం గారు!

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks