Singer: నవరాత్రి వేడుకలకు సింగర్ షో- టికెట్ ధర 2 లక్షలు- వ్యాపారంగా మారిన పండుగ- ఫల్లు చాలా కాస్ట్‌లీ అయ్యావంటూ!

Falguni Pathak Navratri Utsav 2026 Ticket Prices: పాపులర్ సింగర్ ఫల్గుణి పాఠక్ దసరా నవరాత్రి ఉత్సవ్ 2026 టికెట్ల ధరలు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. రోజువారీ పాస్ రూ. 2,200 నుంచి ప్రారంభమై ఏకంగా రూ. 2.04 లక్షల వరకు ఉండటంతో అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Published on: Aug 14, 2026, 11:55:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Falguni Pathak Navratri Utsav 2026 Ticket Prices: దేశవ్యాప్తంగా నవరాత్రి వేడుకల సందడి అప్పుడే మొదలైంది. ముఖ్యంగా ముంబై నగరం దసరా పండక్కి గర్బా నృత్యాలతో రంగులమయంగా మారుతుంది. అయితే ఈ ఏడాది ముంబై నవరాత్రి ఉత్సవాల్లో ప్రముఖ సింగర్, 'గర్బా క్వీన్' ఫల్గుణి పాఠక్ నిర్వహించే ప్రదర్శన ఇప్పుడు సంగీత ప్రియుల మధ్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

నవరాత్రి వేడుకలకు సింగర్ షో- టికెట్ ధర 2 లక్షలు- వ్యాపారంగా మారిన పండుగ- ఫల్లు చాలా కాస్ట్‌లీ అయ్యావంటూ!
నవరాత్రి వేడుకలకు సింగర్ షో- టికెట్ ధర 2 లక్షలు- వ్యాపారంగా మారిన పండుగ- ఫల్లు చాలా కాస్ట్‌లీ అయ్యావంటూ!

జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో

ప్రతిష్టాత్మక జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 19 వరకు తొమ్మిది రోజుల పాటు ఈ 'నవరాత్రి ఉత్సవ్ 2026' వేడుకలు జరగనున్నాయి. అయితే ఈ షో టికెట్ల ధరలు చూసి అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు.

రూ.2,200 నుంచి ప్రారంభమై రూ.2.04 లక్షల దాకా!

ప్రముఖ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ 'బుక్‌మై షో'లో ఈ ఈవెంట్ టికెట్ ధరలు అందుబాటులోకి వచ్చాయి. సాధారణంగా అందరికీ అందుబాటులో ఉండేలా టికెట్లు ఉంటాయని భావించిన శ్రోతలకు నిర్వాహకులు గట్టి షాకే ఇచ్చారు. మొదటి విడతలో 9 రోజులకు సంబంధించి ఈజీ పాస్ రూ.16,000గా నిర్ణయించగా, రెండో విడతలో రూ.18,000కు పెంచారు.

ప్రస్తుతం తొమ్మిది రోజుల సీజన్ పాస్ ధర వ్యక్తికి రూ.20,000కు చేరింది. ఇక కేవలం ఒక్క రోజు మాత్రమే వెళ్లాలనుకునే వారికి ఒక్కో టికెట్ ధర రూ.2,200 నుంచి మొదలవుతోంది. వీటితో పాటు పన్నులు అదనం. ఇవన్నీ ఒకెత్తయితే, అత్యంత విలాసవంతమైన వీఐపీ 'పాడ్ పాకేజ్' (POD Package) ధర ఏకంగా రూ.2.04 లక్షలుగా నిర్ణయించారు.

12 మందికి మాత్రమే ఒక్క రోజు ప్రవేశం

ఈ పాస్‌పై కేవలం 12 మందికి మాత్రమే ఒక్క రోజు ప్రవేశం ఉంటుంది. ఇందులో రూ.10,000 విలువైన ఆహార, పానీయాల కూపన్లు ఇస్తారు. దీంతో గర్బా పండుగను కూడా ఇంత వ్యాపారాత్మకంగా మార్చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

'మధ్యతరగతికి దూరమైన పండుగ'.. అభిమానుల ఆవేదన

టికెట్ ధరలు ఆకాశాన్ని తాకడంతో ఫల్గుణి పాఠక్ అభిమానులు, సోషల్ మీడియా వినియోగదారులు నిర్వాహకులపై మండిపడుతున్నారు. భోరివలీ వంటి బహిరంగ మైదానాల్లో వేలాది మంది మధ్య జరిగే ఈ వేడుకను జియో కన్వెన్షన్ సెంటర్ వంటి ఖరీదైన ఏసీ హాలుకు మార్చడం వల్ల మధ్యతరగతి కుటుంబాలు దూరమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆర్థిక అసమానతలను చూపేలా ఉండకూడదు

"మేము ఏళ్ల తరబడి మీ పాటలకు డ్యాన్స్ చేయడానికి వేచి చూస్తాం ఫల్గుణి మేడమ్. కానీ జియో సెంటర్ లాంటి చోట పెట్టడం వల్ల సామాన్యులు ఈ పండుగకు దూరమవుతున్నారు. నవరాత్రి అనేది అందరినీ కలిపేదిగా ఉండాలి కానీ, ఆర్థిక అసమానతలను చూపేలా ఉండకూడదు" అని ఒక అభిమాని ఆవేదన వ్యక్తం చేశారు.

పాస్‌ల ధరలు కనీసం రూ.16,000 ఉంటే పార్కింగ్, ఫుడ్ ఖర్చులతో కలిపి ఎంత భారం అవుతుందో ఆలోచించాలని, టికెట్ ఏజెంట్లు వీటిని బ్లాక్ మార్కెట్ చేసుకునే ముప్పు ఉందని మరికొందరు కామెంట్ చేశారు.

90ల ఐకానిక్ సింగర్..

90ల కాలంలో 'చూడీ జో ఖంకీ హాథోన్ మే', 'మైనే పాయల్ హై ఛంకాయీ', 'యాద్ పియా కీ ఆనే లగీ', 'సావన్ మే' వంటి ఎవర్ గ్రీన్ ఆల్బమ్స్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఫల్గుణి పాఠక్, ముంబై నవరాత్రి ఉత్సవాలకు పర్యాయపదంగా మారిపోయారు.

'ఫల్లు' చాలా కాస్ట్‌లీ!

ప్రతీ ఏటా ఆమె గర్బా పాడే వేదికలు కిటకిటలాడుతాయి. కానీ ఈసారి 'ట్రైబ్‌వైబ్ ఎంటర్‌టైన్‌మెంట్', 'అల్ఫోన్సో స్టూడియోస్' సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ఈవెంట్‌లో ధరలు విపరీతంగా పెంచేయడంతో "ఫల్లు.. నువ్వు చాలా కాస్ట్‌లీ అయిపోయావ్" అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More