Singer: ఇలాగే తింటే 6 నెలల్లో చస్తావ్- తండ్రి ముందే డాక్టర్ వార్నింగ్-230 నుంచి 120 కేజీల బరువు తగ్గిన స్టార్ సింగర్
Adnan Sami 120 KG Weight Loss Journey: స్టార్ సింగర్ అద్నాన్ సమీ తన జీవితంలో ఎదురైన అత్యంత కఠినమైన రోజులను గుర్తుచేసుకున్నారు. ఒకప్పుడు 230 కేజీల బరువుతో మంచానికే పరిమితమైన తానూ, వైద్యుల హెచ్చరికలతో తండ్రి కన్నీళ్లు చూసి ఎలా 120 కేజీల బరువు తగ్గారో పూర్తి వివరంగా వెల్లడించారు.
Adnan Sami 120 KG Weight Loss Journey: భారతీయ సంగీత ప్రపంచంలో తన విలక్షణమైన గొంతుతో, పియానో మీటలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ సింగర్ అద్నాన్ సమీ. 'లిఫ్ట్ కరాడే', 'తేరా చెహ్రా', 'భర్ దో ఝోలీ మేరీ' వంటి ఎన్నో సూపర్ హిట్ పాటలతో అలరించిన ఈ పద్మశ్రీ గ్రహీత జీవితంలో ఒక దారుణమైన ఘట్టం ఉంది.

ఒకానొక సమయంలో అద్నాన్ సమీ బరువు ఏకంగా 230 కేజీలకు చేరుకుంది. నిలబడటం కాదు కదా, కనీసం పడుకుని నిద్రపోవడం కూడా ఆయనకు నరకంగా మారిన రోజులు అవి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన అద్నాన్ సమీ తాను చావు అంచుల వరకు వెళ్లి ఎలా తిరిగి వచ్చారో వివరిస్తూ అత్యంత భావోద్వేగానికి గురయ్యారు.
"మీ అబ్బాయి ఆరు నెలల్లో చనిపోతాడు"
బాగా బరువు పెరిగిపోయి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో అద్నాన్ సమీ వైద్యులను సంప్రదించారు. ఆ సమయంలో అద్నాన్ సమీ పక్కనే ఆయన తండ్రి కూడా ఉన్నారు. పరీక్షలు చేసిన డాక్టర్ నేరుగా అద్నాన్ ముందే.. "నువ్వు ఇలాగే తింటూ, బరువు తగ్గకపోతే మరో ఆరు నెలల్లో నీ శవాన్ని మీ తల్లిదండ్రులు చూడాల్సి వస్తుంది" అని నిర్దాక్షిణ్యంగా తేల్చి చెప్పారు.
"ఆ మాట వినగానే నా గుండె ఆగిపోయినంత పనైంది. డాక్టర్ ఆ నిజం చెప్పినందుకు కాదు, నా పక్కనే ఉన్న నా తండ్రి ముందు ఆ మాట అన్నందుకు నేను బాగా కుంగిపోయాను. మనకంటే మనల్ని ప్రాణంగా ప్రేమించే మన వాళ్లే ఇలాంటి మాటలు వింటే ఎక్కువ నరకం అనుభవిస్తారు" అని అద్నాన్ ఆ క్షణాన్ని గుర్తు చేసుకున్నారు.
మొదట్లో డాక్టర్ ఏదో భయపెట్టడానికి అలా అంటున్నారని అద్నాన్ సమీ కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. కానీ, ఆ రాత్రి ఆయన తండ్రి ఏడుస్తూ.. "కళ్ల ముందే బిడ్డను కోల్పోయే నరకాన్ని మాకు చూపించకురా నాయనా" అని కాళ్లావేళ్లా పడటంతో అద్నాన్ మనసు పూర్తిగా మారిపోయింది. తండ్రి కన్నీళ్లే ఆయన జీవితంలో అతిపెద్ద మలుపుగా మారాయి.
120 కేజీలు తగ్గడం వెనుక కఠోర శ్రమ.. సర్జరీ ప్రచారానికి చెక్!
తండ్రికి ఇచ్చిన మాట కోసం అద్నాన్ క్రమశిక్షణతో కూడిన డైట్ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. లైపోసక్షన్ లేదా బరియాట్రిక్ సర్జరీలు చేయించుకుని బరువు తగ్గారని అప్పట్లో వచ్చిన పుకార్లను ఆయన తీవ్రంగా ఖండించారు.
జెలసీ ఉన్నవాళ్లు పడే కష్టాన్ని చూడకుండా ఏదో ఒక సాకు వెతుకుతారని మండిపడ్డారు. తాను ఎలాంటి శస్త్రచికిత్సలు చేయించుకోలేదని, కేవలం కఠినమైన డైట్, నిపుణుల సమక్షంలో చేసిన వర్కౌట్ల వల్లనే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు అద్నాన్ సమీ.
కేవలం అర కేజీ మాత్రమే
"వారం అంతా తిండి మానేసి, చెమటోడ్చి కష్టపడితే వారం చివర్లో కేవలం అర కేజీ మాత్రమే బరువు తగ్గేవాడిని. అంత కష్టపడితే అర కేజీయేనా తగ్గిందని అనిపించి తీవ్ర నిరాశ కలిగేది. కానీ పట్టువదలకుండా కష్టపడితేనే ఫలితం ఉంటుందని నన్ను నేను ప్రోత్సహించుకున్నాను" అని అద్నాన్ సమీ చెప్పారు.
కార్బోహైడ్రేట్లు తగ్గించి, హై-ప్రొటీన్ ఆహారాన్ని మాత్రమే తీసుకున్నారు. మైదా, అన్నం, మద్యం, పంచదార, నూనె పదార్థాలను పూర్తిగా పక్కన పెట్టేశారు. బరువు ఎక్కువగా ఉండటం వల్ల ఆయన ఊపిరితిత్తులపై తీవ్ర ఒత్తిడి పడి పడుకుని నిద్రపోవడానికి కూడా వీలుండేది కాదు. లింఫెడెమా వంటి సమస్యలతోనూ బాధపడ్డారు. వీటన్నింటినీ అధిగమించి ఏకంగా 230లో 120 కేజీలు తగ్గి 110 కిలోల బరువుకు చేరుకుని తగ్గి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు.
మూడు దశాబ్దాల సంగీత ప్రయాణం!
లండన్‌లో జన్మించిన అద్నాన్ సమీ 2016లో భారత పౌరసత్వాన్ని స్వీకరించారు. భారతీయ సంగీత రంగానికి ఆయన చేసిన సేవలకుగానూ 2020లో కేంద్ర ప్రభుత్వం ఆయనను 'పద్మశ్రీ' పురస్కారంతో గౌరవించింది.
ప్రస్తుతం కూడా సరికొత్త పాటలతో అలరిస్తున్న అద్నాన్ సమీ, ఇటీవల 'ఇష్క్ తమాషా' అనే నూతన గీతాన్ని విడుదల చేసి శ్రోతలను ఆకట్టుకుంటున్నారు. చావు అంచుల దాకా వెళ్లినా, కేవలం ఆత్మస్థైర్యంతో జీవితాన్ని మళ్లీ గెలుచుకోవచ్చనడానికి అద్నాన్ సమీ ప్రయాణమే ఒక గొప్ప నిదర్శనం.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


