Karuppu BO: తొలి రోజే త్రిష కరుప్పు సినిమాకు 20 కోట్లు- కానీ, సూర్య డిజాస్టర్ మూవీ కలెక్షన్స్ దాటలేకపోయిన వీరభద్రుడు!

Suriya Trisha Karuppu Day 1 Box Office Collection Worldwide: తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, ఆఖరి నిమిషం అడ్డంకులను దాటుకుని థియేటర్లలోకి వచ్చిన సూర్య 'కరుప్పు' (తెలుగులో వీరభద్రుడు) చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే ఓపెనింగ్స్ రాబట్టింది. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 20 కోట్లకు కలెక్షన్స్ రాబట్టింది.

Published on: May 16, 2026, 14:19:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Veerabhadrudu Day 1 Box Office Collection Worldwide: స్టార్ హీరో సూర్య, స్టార్ హీరోయిన్ త్రిష కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం 'కరుప్పు' బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. రిలీజ్‌కు ముందు అనేక ఆర్థిక ఇబ్బందులు, చివరి నిమిషంలో షోలు రద్దు కావడం వంటి అనేక ఆటంకాలు ఎదురైనప్పటికీ, థియేటర్లలోకి వచ్చాక ఈ సినిమా దుమ్మురేపుతోంది.

తొలి రోజే త్రిష కరుప్పు సినిమాకు 20 కోట్లు- కానీ, సూర్య డిజాస్టర్ మూవీ కలెక్షన్స్ దాటలేకపోయిన వీరభద్రుడు!
తొలి రోజే త్రిష కరుప్పు సినిమాకు 20 కోట్లు- కానీ, సూర్య డిజాస్టర్ మూవీ కలెక్షన్స్ దాటలేకపోయిన వీరభద్రుడు!

తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్

మే 15న విడుదలైన ఈ యాక్షన్ డ్రామా కరుప్పుకు తమిళనాడుతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రేక్షకులు మంచి కలెక్షన్స్ అందిస్తున్నారు. సూర్యకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. 'గజినీ', 'సింగం' చిత్రాల నుంచి ఆయన ప్రతి సినిమా ఇక్కడ భారీ ఎత్తున విడుదలవుతుంది.

ఈ క్రమంలోనే 'కరుప్పు' చిత్రాన్ని తెలుగులో 'వీరభద్రుడు' పేరుతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. 2005లో వచ్చిన బ్లాక్‌ బస్టర్ చిత్రం 'ఆరు' తర్వాత దాదాపు రెండు దశాబ్దాల విరామం అనంతరం సూర్య, త్రిష జంటగా నటించిన సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వేట

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, 'కరుప్పు' చిత్రం మొదటి రోజే ఇండియాలో రూ. 14.40 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. దేశవ్యాప్తంగా మొత్తం 4,891 షోలలో ఈ సినిమా ప్రదర్శితమవగా, సగటున 50.35 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఉదయం షోలకు ఆక్యుపెన్సీ కొంత నెమ్మదిగా (24.54 శాతం) ప్రారంభమైనప్పటికీ, టాక్ పాజిటివ్‌గా రావడంతో మధ్యాహ్నం నుంచి థియేటర్లు కళకళలాడాయి.

మధ్యాహ్నం షోలకు 45.92 శాతం, సాయంత్రం షోలకు 53.31 శాతం, ఇక నైట్ షోలకైతే ఏకంగా 75.15 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు హౌస్‌ఫుల్ అయ్యాయి. ఓవర్సీస్ (విదేశాల్లో) కూడా సూర్య హవా నడిచింది. ఓవర్సీస్‌లో కరుప్పు సినిమాకు రూ. 4.00 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

'కంగువ' రికార్డు చెక్కుచెదరలేదు

దీంతో మొదటి రోజున కరుప్పు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా రూ. 20.66 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి. అయితే, తొలి రోజు వసూళ్లు అద్భుతంగా ఉన్నప్పటికీ, సూర్య కెరీర్ బెస్ట్ ఓపెనర్ 'కంగువ' రికార్డును మాత్రం ఈ కరుప్పు దాటలేకపోయింది.

2024 నవంబర్‌లో విడుదలైన 'కంగువ' తొలిరోజే ఇండియాలో రూ. 22 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టి రికార్డు సృష్టించింది. సూర్య కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచిన కంగువ కలెక్షన్స్‌ను కరుప్పు దాటకపోవడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. అయితే, సూర్య కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచిన 'సింగం 2' సాధించిన రూ. 12 కోట్ల ఓపెనింగ్స్ రికార్డును మాత్రం 'కరుప్పు' సునాయాసంగా అధిగమించింది.

ఆటంకాలను దాటి.. అభిమానుల అండతో..

నిజానికి కరుప్పు సినిమా విడుదల కావడం వెనుక పెద్ద డ్రామానే నడిచింది. మే 14న రాత్రి వేయాల్సిన ప్రీమియర్ షోలు, తెల్లవారుజామున పడాల్సిన బెనిఫిట్ షోలన్నీ అకస్మాత్తుగా రద్దయ్యాయి. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాత ఎస్ఆర్. ప్రభు ఎదుర్కొన్న ఆర్థిక సమస్యల వల్లే ఈ ఆలస్యం జరిగింది.

దీంతో తీవ్ర నిరాశకు గురైన అభిమానులను ఊరడిస్తూ సూర్య సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ పోస్ట్ పెట్టారు. "కష్ట కాలంలో మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ రోజు నుంచి మీ ముందుకు కరుప్పు, వీరభద్రుడు వస్తున్నారు" అని సూర్య పేర్కొన్నారు.

కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం

డైరెక్టర్, నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో లాయర్ కమ్ ఫైటర్ పాత్రలో సూర్య నటనకు థియేటర్లలో చప్పట్లు, ఈలలు మోగుతున్నాయి. స్వాసిక, ఇంద్రన్స్, యోగి బాబు, సుప్రీత్ రెడ్డి లాంటి నటుల స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారింది. వీకెండ్ కావడంతో రానున్న రెండు రోజుల్లో కరుప్పు వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More