...
...
Next Story

TIME100 Next India: 'టైమ్ 100 నెక్ట్స్ ఇండియా' కవర్ పేజీపై ఆలియా భట్.. ఆర్ఆర్ఆర్ గుర్తు చేసుకుంటూ రాజమౌళి ప్రశంసల వర్షం

TIME100 Next India: ప్రతిష్ఠాత్మక మ్యాగజైన్ 'టైమ్' తొలిసారిగా విడుదల చేసిన ‘టైమ్ 100 నెక్ట్స్ ఇండియా 2026’ జాబితా కవర్ స్టార్‌గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆమె గురించి ఎస్.ఎస్. రాజమౌళి ప్రత్యేక వ్యాసం రాస్తూ, భారతీయ సినిమాకు ఆమె ఒక గ్లోబల్ అంబాసిడర్ అని కొనియాడారు.

Published on: Nov 19, 2026, 14:19:48 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

TIME100 Next India: ప్రపంచ ప్రఖ్యాత 'టైమ్' మ్యాగజైన్ తొలిసారిగా రూపొందించిన 'టైమ్ 100 నెక్ట్స్ ఇండియా' జాబితాలో బాలీవుడ్ అగ్ర కథానాయిక ఆలియా భట్ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. దేశ భవిష్యత్తును తమ పనితీరు, ఆలోచనలు, దృక్పథంతో తీర్చిదిద్దుతున్న వర్ధమాన నాయకులు, సృజనాత్మక ప్రతిభావంతులకు గుర్తింపుగా టైమ్ ఈ ప్రత్యేక జాబితాను విడుదల చేసింది.

TIME100 Next India: 'టైమ్ 100 నెక్ట్స్ ఇండియా' కవర్ పేజీపై ఆలియా భట్.. ఆర్ఆర్ఆర్ గుర్తు చేసుకుంటూ రాజమౌళి ప్రశంసల వర్షం (AFP)
TIME100 Next India: 'టైమ్ 100 నెక్ట్స్ ఇండియా' కవర్ పేజీపై ఆలియా భట్.. ఆర్ఆర్ఆర్ గుర్తు చేసుకుంటూ రాజమౌళి ప్రశంసల వర్షం (AFP)

ఇందులో ఆలియా భట్ కవర్ స్టార్‌గా మెరవగా, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఆమె గురించి ప్రత్యేకంగా ప్రశంసాపూర్వక వ్యాసం రాయడం విశేషం. ఈ జాబితాలో ఆలియాతో పాటు ఆర్యన్ ఖాన్, అనిరుధ్ రవిచందర్, పార్వతి తిరువోతు, క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ తదితర యువ ప్రముఖులకు చోటు దక్కింది.

'ఆర్ఆర్ఆర్' రోజులను గుర్తుచేసుకున్న రాజమౌళి..

తన 'ఆర్ఆర్ఆర్' (RRR) చిత్రంలో 'సీత' పాత్రలో నటించిన ఆలియా భట్ అంకితభావాన్ని రాజమౌళి ఈ వ్యాసంలో ఆకాశానికెత్తారు. “ఆలియా ఆర్ఆర్ఆర్ సెట్స్‌లోకి వచ్చినప్పుడు ఆమె పాత్రకు ఉన్న సన్నివేశాలు చాలా తక్కువ. కానీ తన కళ్లతో, మౌనంతోనే ఎంతో భావాన్ని పలికించింది. హిందీ చిత్రసీమ నుంచి వచ్చినప్పటికీ, తెలుగు భాషపై పట్టు సాధించి ప్రతి డైలాగ్‌ను సొంతం చేసుకుంది. మొత్తం సినిమా భారం తన భుజాలపైనే ఉందన్నంత బాధ్యతగా సీత పాత్రలో జీవించింది” అని రాజమౌళి పేర్కొన్నారు.

“ఆలియా ఎప్పుడూ సులభమైన దారిని ఎంచుకోదు. అత్యంత కఠినమైన పాత్రలను సైతం ఎంతో సునాయాసంగా పోషిస్తుంది. నేడు భారతీయ సినిమా ప్రపంచ వేదికపై తన గొంతు వినిపిస్తోంది. బాఫ్టా (BAFTA) వంటి ప్రతిష్ఠాత్మక వేదికలపై మన చిత్ర పరిశ్రమ తరఫున ఆమె మాట్లాడిన తీరు గర్వకారణం. రాబోయే తరం నటీనటులు తమ ధైర్యాన్ని ఆలియాతో కొలుచుకుంటారు” అంటూ జక్కన్న ప్రశంసల వర్షం కురిపించారు.

జాబితాలో మెరిసిన ఇతర భారతీయ ప్రముఖులు వీరే..

దర్శకుడు ఆర్యన్ ఖాన్, పాయల్ కపాడియా, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, నటులు వేదాంగ్ రైనా, పార్వతి తిరువోతు, కని కుశ్రుతి, గాయకుడు ఫహీమ్ అబ్దుల్లా కూడా ఉన్నారు. ఇందులో అనిరుధ్ గురించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఆర్యన్ ఖాన్ గురించి విశాల్ భరద్వాజ్ వ్యాసాలు రాశారు.

భారత మహిళా క్రికెట్ టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ, ఒలింపిక్ బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్, స్కైరూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకుడు పవన్ కుమార్ చందన తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. డిసెంబర్ 12న ముంబైలో టైమ్ ప్రత్యేక గాలా ఈవెంట్ నిర్వహించనుంది.

'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' నుంచి 'లవ్ అండ్ వార్' వరకు..

2012లో కరణ్ జోహార్ 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఆలియా, ఆ తర్వాత 'హైవే' (2014) చిత్రంతో తనలోని అసలైన నటిని పరిచయం చేశారు. 'ఉడ్తా పంజాబ్', 'రాజీ', 'గల్లీ బాయ్', 'గంగూబాయి కతియావాడి', 'రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ' వంటి చిత్రాలతో స్టార్‌డమ్‌తో పాటు జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. 2023లో 'హార్ట్ ఆఫ్ స్టోన్' చిత్రంతో హాలీవుడ్‌లోనూ అడుగుపెట్టారు.

ప్రస్తుతం ఆలియా భట్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న పీరియాడికల్ డ్రామా 'లవ్ & వార్' (Love & War) చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో తన భర్త రణబీర్ కపూర్, విక్కీ కౌశల్‌లతో కలిసి ఆమె నటిస్తుండగా, క్యాబరే డ్యాన్సర్‌గా ఆలియా ఫస్ట్ లుక్ ఇప్పటికే సంచలనం సృష్టించింది. ఈ చిత్రం 2027 జనవరిలో థియేటర్లలో విడుదల కానుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks