...
...
Next Story

Jana Nayagan Leak: ఇది చాలా బాధాకరం.. అలాంటి వాళ్లు ఎలా తప్పించుకుంటున్నారు: జన నాయగన్ లీక్‌పై మాధవన్, సూర్య ట్వీట్స్

Jana Nayagan Leak: దళపతి విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' థియేటర్లలోకి రాకముందే ఆన్‌లైన్‌లో లీక్ అవ్వడం దక్షిణాది సినీ రంగంలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. మాధవన్, సూర్య, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ చిత్ర బృందానికి మద్దతుగా నిలుస్తున్నారు.

Published on: Apr 13, 2026, 11:37:23 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Jana Nayagan Leak: తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ తన సుదీర్ఘ సినీ ప్రస్థానానికి స్వస్తి పలుకుతూ, పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టే ముందు నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయగన్’. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విజయ్ అభిమానులు ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తుంటే, తాజాగా ఈ చిత్రం పైరసీ కోరల్లో చిక్కుకోవడం కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. సెన్సార్ బోర్డు (CBFC)తో వివాదం నడుస్తున్న తరుణంలోనే ఈ సినిమా ఆన్‌లైన్‌లో లీక్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది.

"ఇది అత్యంత దారుణం" - ఆర్. మాధవన్ ఆవేదన

Jana Nayagan Leak: ఇది చాలా బాధాకరం.. అలాంటి వాళ్లు ఎలా తప్పించుకుంటున్నారు: జన నాయగన్ లీక్‌పై మాధవన్, సూర్య ట్వీట్స్
Jana Nayagan Leak: ఇది చాలా బాధాకరం.. అలాంటి వాళ్లు ఎలా తప్పించుకుంటున్నారు: జన నాయగన్ లీక్‌పై మాధవన్, సూర్య ట్వీట్స్

జన నాయగన్ లీక్ వ్యవహారంపై నటుడు ఆర్. మాధవన్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. "ఇది చాలా బాధాకరం, నన్ను తీవ్రంగా కలచివేస్తోంది. అసలు ఇలాంటి పనులు చేసి మనుషులు ఎలా తప్పించుకుంటున్నారు? వందలాది మంది కష్టపడి చేసిన పనిని గౌరవించండి. దయచేసి పైరసీ ప్లాట్‌ఫారమ్స్‌లో సినిమాను చూడకండి" అని మాధవన్ ఎక్స్‌ లో వేడుకున్నారు.

అంతకుముందు హీరో సూర్య కూడా ఇదే అంశంపై స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. "ఒక టీమ్ పడిన కష్టాన్ని ఇలా నీరుగార్చడం అన్యాయం. గౌరవం ఉన్నవారెవరూ ఈ లీకైన వెర్షన్‌ను చూడొద్దు. షేర్ చేయొద్దు. నా స్నేహితులకు నేను అండగా ఉంటాను" అని సూర్య పేర్కొన్నారు.

పూజా హెగ్డే భావోద్వేగ పోస్ట్.. కమల్ హాసన్ విశ్లేషణ

ఈ సినిమాలో కథానాయికగా నటించిన పూజా హెగ్డే తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ అయ్యారు. "ఒక సినిమా వెనుక ఎన్నో గంటల శ్రమ, సృజనాత్మకత, త్యాగాలు ఉంటాయి. మా సినిమా ఇలా ఆన్‌లైన్‌లో లీక్ అవ్వడం చూస్తుంటే నాకే కాదు, ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరికీ గుండె కోసినట్లు ఉంది" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ పొలిటికల్ థ్రిల్లర్‌లో బాబీ డియోల్, మమితా బైజూ, ప్రకాష్ రాజ్, ప్రియమణి వంటి భారీ తారాగణం ఉంది. నిజానికి ఈ చిత్రం జనవరి 9న విడుదల కావాల్సి ఉండగా, సెన్సార్ ఆలస్యం వల్ల వాయిదా పడింది.

విజయ్ తన పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తుండటంతో, ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి కీలక సమయంలో పైరసీ జరగడం నిర్మాతలకు కోలుకోలేని దెబ్బే. ఇప్పటికే దీనిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు నిర్మాణ సంస్థ కెవిఎన్ (KVN) ప్రొడక్షన్స్ ప్రకటించింది.

ఇక చెన్నై పోలీసులు ఇప్పటికే ఈ మూవీ లీక్ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగుతోంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. 'జన నాయగన్' సినిమా లీక్ అవ్వడానికి కారణం ఏంటి?

సెన్సార్ బోర్డు (CBFC) నుంచి సర్టిఫికేషన్ రావడంలో జరిగిన జాప్యం వల్ల సినిమా విడుదల వాయిదా పడింది. ఈ సమయంలోనే అక్రమ మార్గాల్లో సినిమా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో లీక్ అయింది.

2. జన నాయగన్ సినిమా విజయ్‌కి ఎందుకు అంత ప్రత్యేకం?

నటుడిగా విజయ్‌కి ఇది ఆఖరి చిత్రం. ఈ సినిమా తర్వాత ఆయన తన రాజకీయ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పనుల్లో బిజీ కానున్నారు.

3. జన నాయగన్ సినిమా లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకున్నారా?

అవును, చిత్ర నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పైరసీని ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe