విరాట్ కోహ్లీ.. ఈ పేరు వినగానే పరుగుల ప్రవాహం, మైదానంలో ఆవేశం, మైండ్ బ్లోయింగ్ రికార్డులే అందరికీ గుర్తుకొస్తాయి. కానీ ఒక మనిషిగా ఆయన జీవితాన్ని చూస్తే.. ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే అద్భుతమైన జీవిత పాఠాలు కనిపిస్తాయి.

ఢిల్లీ గల్లీల నుంచి ప్రపంచ క్రికెట్‌ను శాసించే కింగ్ స్థాయికి విరాట్ ఎలా ఎదిగారు? వైఫల్యాలు ఎదురైనప్పుడు ఆయన ఎలా పుంజుకున్నారు? ప్రతి సవాలునూ ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటూ పీక్ స్టేజ్‌కు చేరిన కోహ్లీ జీవితం నుంచి ప్రతీ ఒక్కరూ నేర్చుకోవాల్సిన 5 కీలకమైన లైఫ్ లెసన్స్ ఉన్నాయి.
ఆశయం ముందు శోకం ఎంత?
కోహ్లీ జీవితంలో అత్యంత విషాదకరమైన సంఘటన 2006లో జరిగింది. ఢిల్లీ తరఫున రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఆయన తండ్రి ప్రేమ్‌నాథ్ కోహ్లీ కన్నుమూశారు. మరుసటి రోజు ఉదయానికి విరాట్ నాటౌట్‌గా ఉన్నారు. అప్పుడు ఆయన వయసు కేవలం 18 ఏళ్లు. కానీ విరాట్ పారిపోలేదు.. శోకాన్ని గుండెల్లోనే దాచుకుని, మైదానంలోకి దిగి 90 పరుగులు చేసి తన జట్టును పరాజయం నుంచి కాపాడారు. ఆ తర్వాతే తండ్రి అంత్యక్రియలకు వెళ్లారు.
లక్ష్యం నిర్దేశించుకున్నప్పుడు మన వ్యక్తిగత భావోద్వేగాలు, కష్టాలు దానికి అడ్డుకాకూడదు. మానసిక దృఢత్వం ఉంటే ఎలాంటి విషాదాన్నైనా జయించి లక్ష్యాన్ని చేరుకోవచ్చు.
క్రమశిక్షణే సక్సెస్
2012 ఐపీఎల్ వరకు కోహ్లీకి ఫిట్నెస్ను పెద్దగా పట్టించుకోలేదు. జంక్ ఫుడ్ తినడం, సాధారణ లైఫ్‌స్టైల్ గడపడం ఆయన అలవాటు. కానీ అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్లేయర్‌గా నిలవాలంటే ఫిట్నెస్ ఎంత కీలకమో ఆయన గ్రహించారు. వెంటనే ఆహార అలవాట్లను, వర్కవుట్ రొటీన్‌ను పూర్తిగా మార్చేసుకున్నారు.
విజయం అనేది ఏదో ఒకరోజు హఠాత్తుగా వచ్చేది కాదు. అది రోజువారీ క్రమశిక్షణ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మీరు చేసే పని ఏదైనా కావచ్చు.. క్రమశిక్షణ, అంకితభావం ఉంటే విజయం మీ వెంటే వస్తుంది.
వైఫల్యాన్ని సైతం పాఠంగా మార్చుకోవాలి
2014 ఇంగ్లాండ్ పర్యటన కోహ్లీ కెరీర్లో అత్యంత ఘోరమైన ఘట్టం. 5 టెస్టుల్లో కేవలం 134 పరుగులు మాత్రమే చేసి తీవ్ర విమర్శలపాలయ్యారు. ఆ సమయాన ఆయన డిప్రెషన్‌కు లోనైనట్లు కూడా తర్వాత వెల్లడించారు. అయితే ఆయన అక్కడే ఆగిపోలేదు. సచిన్ టెండూల్కర్, రవిశాస్త్రి వంటి దిగ్గజాల సలహాలతో తన బ్యాటింగ్ టెక్నిక్‌ను, మానసిక వైఖరిని సరిచేసుకున్నారు. అదే ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనలో ఏకంగా 4 సెంచరీలు బాది తిరిగి తానూ క్రికెట్లో కింగ్ అని చూపించారు.
{{/usCountry}}2014 ఇంగ్లాండ్ పర్యటన కోహ్లీ కెరీర్లో అత్యంత ఘోరమైన ఘట్టం. 5 టెస్టుల్లో కేవలం 134 పరుగులు మాత్రమే చేసి తీవ్ర విమర్శలపాలయ్యారు. ఆ సమయాన ఆయన డిప్రెషన్‌కు లోనైనట్లు కూడా తర్వాత వెల్లడించారు. అయితే ఆయన అక్కడే ఆగిపోలేదు. సచిన్ టెండూల్కర్, రవిశాస్త్రి వంటి దిగ్గజాల సలహాలతో తన బ్యాటింగ్ టెక్నిక్‌ను, మానసిక వైఖరిని సరిచేసుకున్నారు. అదే ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనలో ఏకంగా 4 సెంచరీలు బాది తిరిగి తానూ క్రికెట్లో కింగ్ అని చూపించారు.
{{/usCountry}}ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోవడం కాదు.. ఆ లోపాలను సరిదిద్దుకుని మరింత బలంగా తిరిగి రావడమే నిజమైన విజేత లక్షణం. 'ఫెయిల్యూర్ అనేది ముగింపు కాదు.. అది ఒక కొత్త ప్రారంభం'
నోటితో కాదు.. చేతలతో బదులివ్వాలి
విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత అగ్రెసివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. ప్రత్యర్థి బౌలర్లు లేదా అభిమానులు తనను హేళన చేసినప్పుడు ఆయన ఎప్పుడూ మాటల యుద్ధానికి దిగలేదు. తన బ్యాట్‌తో, సాధించిన పరుగులతోనే వారికి సమాధానం చెప్పారు.
మనల్ని విమర్శించే వారికి, చులకనగా చూసే వారికి మాటలతో సమాధానం చెప్పడం వల్ల సమయం దండగ. మీ కష్టం, మీ సక్సెస్ మాత్రమే వారి నోళ్లను మూయించగలవు. ఎవరు ఏమన్నా.. మీరు నమ్మినదాని కోసం పనిచేస్తూ వెళ్లాలి.
గెలుపోటములను సమానంగా స్వీకరించడం
కోహ్లీ కెరీర్లో మూడేళ్ల పాటు 2019 నుండి 2022 వరకు ఒక్క అంతర్జాతీయ సెంచరీ కూడా రాలేదు. 1021 రోజులు పట్టింది సెంచరీకి. ఆ సమయంలో కెప్టెన్సీ వదులుకోవాల్సి వచ్చింది. తీవ్రమైన ఒత్తిడి, నెగెటివిటీ చుట్టుముట్టాయి. కానీ ఆయన నిశ్శబ్దంగా తనతో తానే పోరాడారు. మానసిక ప్రశాంతత కోసం విరామం తీసుకున్నారు. చివరికి 2022 ఆసియా కప్‌లో అఫ్గానిస్తాన్‌పై సెంచరీతో మళ్లీ పాత కోహ్లీని ప్రపంచానికి పరిచయం చేశారు.
జీవితంలో వెలుగు నీడల్లాగే గెలుపోటములు సహజం. విజయాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా, ఓటములు ఎదురైనప్పుడు క్రుంగిపోకుండా స్థితప్రజ్ఞతతో ఉండటమే అసలైన మానసిక పరిణతి. జీవితంలో రాత్రిలాగే చీకటి ఉంటుంది.. అదే సమయంలో ఉదయంతో వెలుగూ వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
విరాట్ కోహ్లీ కేవలం ఒక రికార్డుల యంత్రం మాత్రమే కాదు.. 'ఒక మనిషి తన పరిమితులను దాటి ఎలా ఎదగగలడు' అనడానికి నిలువెత్తు నిదర్శనం. నిరంతర శ్రమ, ఆత్మవిశ్వాసం, తగ్గని పట్టుదల ఉంటే ప్రపంచంలో సాధించలేనిది ఏదీ లేదనేది కోహ్లీ జీవితం మనకు చెప్పే అసలైన పాఠం.