మీ గుండె బలహీనపడుతోందని చెప్పే 5 హెచ్చరికలు ఇవే.. వయస్సు పెరగడం వల్లే అనుకోకండి

గుండె వైఫల్యం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని వేధిస్తోంది. అలసట, కాళ్ల వాపులు, శ్వాస ఆడకపోవడం వంటి 5 సున్నితమైన సంకేతాలను కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ వివరించారు. వీటిని ముందే గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు.

Published on: Dec 23, 2025, 08:36:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చిన్నపాటి అలసట వచ్చినా పని ఒత్తిడి అనుకుంటాం, కాస్త ఆయాసం వస్తే వయసు పైబడుతోందిలే అని సరిపెట్టుకుంటాం. కానీ, మనం సాదాసీదాగా భావించే ఈ మార్పులే మన గుండె బలహీనపడుతోందనడానికి సంకేతాలు కావొచ్చు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6.4 కోట్ల మందిని వేధిస్తున్న 'గుండె వైఫల్యం' (Heart Failure) గురించి బెంగళూరు మణిపాల్ హాస్పిటల్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ హరనహళ్లి కీలక విషయాలను పంచుకున్నారు. మన కళ్లు గప్పి గుండెను దెబ్బతీసే ఆ 5 లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

మీ గుండె బలహీనపడుతోందని చెప్పే 5 హెచ్చరికలు ఇవే.. వయస్సు పెరగడం వల్లే అనుకోకండి (Twitter/WebMD)
మీ గుండె బలహీనపడుతోందని చెప్పే 5 హెచ్చరికలు ఇవే.. వయస్సు పెరగడం వల్లే అనుకోకండి (Twitter/WebMD)

1. శారీరక సామర్థ్యం క్రమంగా తగ్గడం

"గుండె వైఫల్యానికి సంబంధించి అత్యంత సాధారణమైన, మొదట కనిపించే లక్షణం శారీరక శక్తి తగ్గడం. గతంలో సులువుగా చేసిన పనులను కూడా ఇప్పుడు చేయలేకపోవడం, త్వరగా అలసిపోవడం వంటివి కనిపిస్తాయి" అని డాక్టర్ ప్రదీప్ పేర్కొన్నారు. చాలామంది దీనిని వృద్ధాప్య లక్షణంగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. ముఖ్యంగా మోకాళ్ల నొప్పులు, వెన్నునొప్పి ఉన్నవారు తాము నడవలేకపోవడానికి ఆ నొప్పులే కారణమని అనుకుంటారు కానీ, లోపల గుండె బలహీనపడుతోందన్న విషయాన్ని గమనించలేరు.

2. కాళ్ల వాపులు.. షూ టైట్ అవుతున్నాయా?

గుండె పంపింగ్ సామర్థ్యం తగ్గినప్పుడు శరీరంలోని ద్రవాలు కింది భాగాలకు చేరుతాయి. దీనివల్ల పాదాలు, చీలమండల వద్ద వాపులు వస్తాయి.

"ప్రారంభంలో ఈ వాపులు సాయంత్రం వేళ కనిపిస్తాయి, ఉదయానికి తగ్గిపోతాయి. కానీ సమస్య తీవ్రమవుతున్న కొద్దీ రోజంతా వాపులు అలాగే ఉంటాయి" అని డాక్టర్ వివరించారు. మీ చెప్పులు లేదా షూస్ గతంలో కంటే టైట్‌గా అనిపిస్తున్నా, అది శరీరంలో నీరు చేరుతోందనడానికి ఒక సంకేతం.

3. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

ఊపిరితిత్తుల్లో ద్రవాలు చేరడం వల్ల శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ముఖ్యంగా రాత్రిపూట పడుకున్నప్పుడు ఊపిరి అందక ఇబ్బంది పడటం, దీనికోసం అదనంగా రెండు మూడు దిండ్లు వాడుకోవడం వంటివి జరుగుతాయి. కొందరైతే గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక్కసారిగా ఊపిరి అందక, దగ్గుతో మెలకువ వచ్చి కూర్చుంటారు. దీనిని వైద్య పరిభాషలో 'ప్రాక్సిమల్ నాక్చర్నల్ డిస్పానియా' అంటారు. ఇది గుండె స్థితిని సూచించే ప్రమాదకర హెచ్చరిక.

. కాళ్ల వాపులు.. షూ టైట్ అవుతున్నాయా? (Unsplash)
. కాళ్ల వాపులు.. షూ టైట్ అవుతున్నాయా? (Unsplash)

4. రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జన

గుండె సరిగ్గా పనిచేయనప్పుడు మూత్రపిండాలకు రక్తప్రసరణలో మార్పులు వస్తాయి. దీనివల్ల రాత్రివేళల్లో పదే పదే మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. ఒకవేళ మీకు రాత్రిపూట ఈ సమస్య కొత్తగా మొదలైతే, అది కేవలం కిడ్నీ లేదా ప్రోస్టేట్ సమస్యే కాకపోవచ్చు, గుండె బలహీనత కూడా కావచ్చు.

5. ఆకలి తగ్గడం.. ముఖం ఉబ్బడం

శరీరంలో ద్రవాలు పేరుకుపోవడం వల్ల పొట్ట ఉబ్బరంగా అనిపించడం, కొంచెం తినగానే కడుపు నిండినట్లు అనిపించడం వంటివి జరుగుతాయి. దీనివల్ల ఆకలి తగ్గుతుంది. అలాగే ఉదయం నిద్ర లేవగానే ముఖం ఉబ్బినట్లుగా (Puffiness) కనిపించడం కూడా గుండె బలహీనతకు ఒక సూచన కావొచ్చని డాక్టర్ ప్రదీప్ హెచ్చరించారు.

ఎవరు జాగ్రత్తగా ఉండాలి?

అధిక బరువు, మధుమేహం (Diabetes), రక్తపోటు (Hypertension) ఉన్నవారు, అలాగే గతంలో గుండెపోటు వచ్చిన వారు ఈ లక్షణాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి. "గుండె వైఫల్యాన్ని ప్రారంభ దశలోనే గుర్తిస్తే మెరుగైన చికిత్స అందించవచ్చు. దీనివల్ల రోగి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి" అని డాక్టర్ భరోసా ఇచ్చారు.

కాబట్టి, మీ శరీరంలో వచ్చే చిన్న చిన్న మార్పులను వయసు మీద పడటంతో ముడిపెట్టకుండా, వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించి అవసరమైన పరీక్షలు (X-ray, NT-proBNP వంటివి) చేయించుకోవడం ఉత్తమం.

(గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించగలరు.)

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More