మధుమేహం నియంత్రణకు ‘మెంతి నీరు’- ఉదయం పరగడుపున తాగితే 7 అద్భుత ప్రయోజనాలు!

 షుగర్ లెవల్స్ అదుపులో ఉంచడానికి సహజసిద్ధమైన పరిష్కారం.. ‘మెంతి నీరు’ అని వైద్య నిపుణులు అంటున్నారు. మెంతులతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని సూచిస్తున్నారు. శరీరంపై ఈ మెంతి నీటి ప్రభావం గురించి వివరంగా ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 23, 2025, 06:40:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మధుమేహం అనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. వయస్సుతో సంబంధం లేకుండా ఈ మధుమేహం అందరిని ఇబ్బంది పెడుతోంది. చాలా మంది రక్తంలో చక్కెర స్థాయిలను మెయిన్​టైన్​ చేయలేకపోతుంటారు. అందుకే ఆహారాన్ని ఆస్వాదిస్తూనే, గ్లూకోజ్ స్థాయిలు స్థిరంగా ఉండేలా చూసుకోవడానికి పరిష్కారాల కోసం చూస్తుంటారు. ఈ సమస్యకు మీరు బహుశా ఆలోచించని ఒక అద్భుతమైన మార్గం మెంతి గింజల నీరు! ఈ సాధారణ పానీయం మీ రోజువారీ ఆహారంలో నిజమైన మార్పును తీసుకురాగలదు. ముఖ్యంగా ఉదయం పరగడుపున తాగితే మరీ మంచిది.

మెధుమేహం నియంత్రణకు మెంతి నీరు! (Adobe Stock)
మెధుమేహం నియంత్రణకు మెంతి నీరు! (Adobe Stock)

మెంతులతో ఉపయోగాలు ఏంటి?

సాంప్రదాయ వైద్యంలో, వంటకాల్లో విస్తృతంగా ఉపయోగించే విలువైన మూలిక వస్తువు మెంతులు. "వీటి గింజల్లో పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు, కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటాయి," అని ఫరీదాబాద్‌లోని ఫోర్టిస్ హాస్పిటల్ చీఫ్ డైటీషియన్ కిరణ్ దలాల్ తెలిపారు. ఈ లక్షణాల కారణంగా మెంతులు ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడంలో ఎంతగానో ఉపయోగపడతాయని వివరించారు.

మెంతి నీరు తయారుచేసే విధానం: ఒక టీస్పూన్ మెంతులను ఒక గ్లాసు నీటిలో రాత్రిపూట నానబెట్టాలి. "మరుసటి రోజు ఉదయం పరగడుపున ఆ నీటిని తాగండి," అని ఆమె సూచించారు.

ఈ విధానం వల్ల గింజల్లోని ప్రయోజనాలను సులభంగా సంగ్రహించవచ్చు. దీని వల్ల మీ శరీరం వాటిని త్వరగా గ్రహిస్తుంది.

మెంతి నీరు రక్తంలో చక్కెరను తగ్గిస్తుందా?

మెంతి నీరు తాగడం మధుమేహాన్ని మెరుగ్గా నిర్వహించడానికి ఎలా సహాయపడుతుందో ఇక్కడ తెలుసుకోండి..

1. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ చాలా ముఖ్యం. మీ శరీరం ఇన్సులిన్‌కు ఎంత సున్నితంగా ఉంటే, అది గ్లూకోజ్‌ను అంత మెరుగ్గా నిర్వహించగలదు. మధుమేహంతో బాధపడేవారికి ఇది మరింత ముఖ్యం. 'ఫ్రంటియర్స్ ఇన్ న్యూట్రిషన్'లో ప్రచురించిన పరిశోధన ప్రకారం, మెంతులు ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఉదయాన్ని మెంతి నీరుతో ప్రారంభించడం వల్ల మీ ప్యాంక్రియాస్ మరింత సమర్థవంతంగా పనిచేసి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

2. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది

మెంతుల్లో సాల్యుబుల్​ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మీ ప్రేగులలో చక్కెరలు అబ్సార్షన్​ని​ వేగాన్ని తగ్గిస్తుంది. "ఇది రోజంతా మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది," అని డైటీషియన్ తెలిపారు. రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులను నిర్వహించడానికి సహజమైన, సులభమైన మార్గం కావాలంటే, మీ ఉదయపు దినచర్యలో మెంతి నీరుని జోడించండి.

3. బరువు నియంత్రణకు సహకరిస్తుంది

మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన బరువు నిర్వహణ చాలా అవసరం. మెంతుల్లోని అధిక ఫైబర్ కంటెంట్ బరువును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. "ఉదయం మెంతి నీరు తాగడం వల్ల మీకు ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇది తర్వాత చిరుతిళ్లు తినే లేదా అతిగా తినే అవకాశాన్ని తగ్గిస్తుంది," అని నిపుణులు చెప్పారు. బరువును నియంత్రించడం అనేది ఇన్సులిన్ సున్నితత్వాన్ని, రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరుస్తుంది.

4. ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలకు మద్దతు

మధుమేహం ఉన్నవారు తమ కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా నిర్వహించుకోవాలి. "మెంతులు ఎల్​డీఎల్​ (చెడు) కొలెస్ట్రాల్‌ను తగ్గించగలవు. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది," అని ఆహార నిపుణులు వివరించారు. మధుమేహాన్ని నియంత్రిస్తూనే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మెంతి నీరును ఉదయపు అలవాటులో చేర్చుకోవడం ఉత్తమం.

5. జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

జీర్ణ సమస్యలు మీ రోజువారీ జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తాయో మీకు తెలిసిందే. మెంతులు ఆరోగ్యకరమైన జీర్ణాశయానికి మద్దతు ఇస్తాయి. మలబద్ధకం, ఉబ్బరం, అజీర్ణం వంటి సాధారణ సమస్యలను తగ్గిస్తాయి. సజావుగా ఉండే జీర్ణవ్యవస్థ శరీరం పోషకాలను మెరుగ్గా గ్రహించడానికి సహాయపడుతుంది.

6. పోషకాల శోషణను పెంచుతుంది

మీ శరీరం ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలను అబ్సార్బ్​ చేసుకోవడానికి మెంతులు సహాయపడతాయి. మధుమేహాన్ని నిర్వహించే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆహారం వారి ఆరోగ్యానికి కీలకం! ప్రతిరోజూ మెంతి నీరు తాగడం వల్ల మీ శరీరం సరిగ్గా పనిచేయడానికి అవసరమైన పోషకాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి సహాయపడుతుంది.

7. రోగనిరోధక శక్తిని పెంచుతుంది

బలమైన రోగనిరోధక వ్యవస్థ ముఖ్యం. మరీ ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి ఇది అత్యవసరం. ఎందుకంటే వారికి అంటువ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. "మెంతులలో యాంటీబాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి క్రిముల నుంచి రక్షించడానికి సహాయపడతాయి," అని డైటీషియన్ వివరించారు. మెంతి నీరును క్రమం తప్పకుండా తాగడం వల్ల మీ మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది, మీకు మరింత శక్తి లభిస్తుంది. తరచుగా అనారోగ్యం పాలయ్యే అవకాశం తగ్గుతుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More