జేఈఈలో ఫెయిల్​- జీవితం అయిపోయిందనుకున్నాడు! ఇప్పుడు నాన్నకి రూ. 55లక్షల బీఎండబ్ల్యూ గిఫ్ట్..

Ankur Warikoo : ఐఐటీ-జేఈఈలో ఫెయిల్ అయ్యాననే బాధ, 110 కిలోల బరువు, కెరీర్‌పై అపనమ్మకం.. ఐదేళ్ల క్రితం శౌర్య శిఖర్ పరిస్థితి ఇది. కానీ నేడు నెలవారీ ఆదాయం ఏడు అంకెలకు చేరింది. తండ్రికి రూ. 55 లక్షల విలువైన బీఎండబ్ల్యూ కారును కానుకగా ఇచ్చి నెటిజన్ల మనసులు గెలుచుకున్నాడు.

Published on: Jun 8, 2026, 06:03:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Shaurya Shikhar Success Story : జీవితంలో ఎదురయ్యే ఓటములు శాశ్వతం కాదని, పట్టుదలతో ప్రయత్నిస్తే అపజయాలే విజయానికి తొలిమెట్లు అవుతాయని నిరూపించాడు 26 ఏళ్ల శౌర్య శిఖర్. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని, తనని తాను మలచుకుంటూ సాగిన శౌర్య సక్సెస్ జర్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, కంటెంట్ క్రియేటర్ అంకుర్ వారికూ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఈ స్ఫూర్తిదాయక కథనం వేలాది మంది నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది.

శౌర్య శిఖర్..
శౌర్య శిఖర్..

కొన్నేళ్ల క్రితం శౌర్య జీవితం తీవ్ర నిరాశతో కూడుకుని ఉండేది. దేశంలోనే అత్యంత కఠినమైన ఐఐటీ-జేఈఈ పరీక్షలో అతడు క్వాలిఫై కాలేకపోయాడు. తండ్రి స్వయంగా ఐఐటీ పూర్వ విద్యార్థి కావడంతో, ఈ అపజయం శౌర్యను మానసికంగా మరింత కుంగదీసింది. తనపై తనకే నమ్మకం పోయింది. ఆ బాధతోనే ఇంజనీరింగ్ కాకుండా బీబీఏ కోర్సులో చేరాడు. కానీ ఆ కాలేజీ లైఫ్ అతడికి అస్సలు నచ్చలేదు. మానసిక ఒత్తిడి తోడవ్వడంతో శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతిని, బరువు ఏకంగా 110 కిలోలు దాటిపోయింది. భవిష్యత్తుపై ఎలాంటి ఆశలు లేని ఆ క్లిష్ట సమయంలో, కాలేజీలో చదువుకుంటూనే అంకుర్ వారికూ టీమ్‌లో శౌర్య చేరాడు. అప్పట్లో తన కెరీర్, చదువు, వ్యక్తిగత సమస్యల మధ్య నలిగిపోతూ, తన భవిష్యత్తు బాగుంటుందని ఊహించుకోవడానికి కూడా శౌర్య భయపడేవాడని వారికూ గుర్తుచేసుకున్నారు.

"అతడు ఐఐటీ-జేఈఈ రాశాడు కానీ సీటు రాలేదు. దీనితో తాను పూర్తిగా ఫెయిల్ అయ్యాననే భావన అతడిలో బలపడింది. ఎందుకంటే వాళ్ల నాన్న ఐఐటీలోనే చదువుకున్నారు! పైగా ఇంజనీరింగ్ చేయకుండా బీబీఏ డిగ్రీలో చేరి తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యాడు. బరువు 110 కిలోల కంటే ఎక్కువైంది. తల్లిదండ్రులను బాధపెట్టానని కుంగిపోయాడు. కాలేజీ నచ్చలేదు. తన జీవితం ఇక ముగిసిపోయిందని బలంగా నమ్మాడు," అని అంకుర్ వారికూ తన లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో రాసుకొచ్చారు.

ఐదేళ్ల తర్వాత.. పూర్తిగా మారిన జీవితం!

కానీ ఇప్పుడు శౌర్య జీవితం ఊహించని విధంగా మారిపోయింది. ప్రస్తుతం 26 ఏళ్ల వయసులోనే అతడు అద్భుతమైన కెరీర్‌ను నిర్మించుకున్నాడు. ప్రతి నెలా ఏడు అంకెల స్థాయిలో (లక్షల్లో) సంపాదిస్తున్నాడు. ఇటీవల తన తండ్రి రిటైర్మెంట్ కానుకగా రూ. 55 లక్షల విలువైన లగ్జరీ బీఎండబ్ల్యూ కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ లగ్జరీ కారు కోసం అతడు కట్టిన డౌన్ పేమెంట్, శౌర్య మొత్తం ఆస్తిలో 5 శాతం కంటే తక్కువే. అలాగే ఈ కారు కోసం నెలకు చెల్లించే ఈఎంఐ.. అతడి నెలవారీ సంపాదనలో 7 శాతం కంటే తక్కువ కావడం గమనార్హం. శౌర్య సాధించిన మార్పు కేవలం డబ్బు సంపాదనకే పరిమితం కాలేదు. గడిచిన కొన్నేళ్లల్లో తన ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, తన జీవితంలోనే అత్యంత ఫిట్‌గా మారిపోయాడు.

ఈ కథ కేవలం సంపద, లగ్జరీ కార్లు లేదా ఆర్థిక విజయాల గురించి మాత్రమే కాదు. జీవితంలో ఎదురయ్యే ఎదురుదెబ్బలు ఎప్పటికీ మన భవిష్యత్తును శాసించలేవని గుర్తుచేయడానికే ఈ ఉదాహరణ అని వారికూ పేర్కొన్నారు. జీవితంలో ఒక దశలో ఓటమిగా అనిపించిన విషయమే, మరో అద్భుతమైన ప్రయాణానికి ఆరంభ బిందువు అవుతుందని ఆయన వివరించారు.

"జీవితంలో ఉన్న విచిత్రం ఇదే. కాలక్రమేణా అన్నీ సర్దుకుంటాయి. కానీ మనం ఓటమి బాధలో ఉన్నప్పుడు ఈ విషయం మనకు అర్థం కాదు. నాకు ఉపయోగపడిన ఒకే ఒక్క సూత్రం ఏంటంటే: ముందుకు సాగిపోవడం (KEEP MOVING)! జీవితం ఏదో ఒక రోజు బాగుపడుతుందని మనం నమ్మితే, మనం చేయగలిగిన ఏకైక పని ప్రయత్నాన్ని ఆపకుండా ముందుకు నడవడమే. శౌర్య అలాగే నడిచాడు, ఈ రోజు అతడి జీవితం అద్భుతంగా మారింది. మీ జీవితం కూడా కచ్చితంగా మారుతుంది," అని వారికూ ముగించారు.

నెటిజన్ల స్పందన ఇలా..

ఈ స్ఫూర్తిదాయక కథనం సోషల్ మీడియాలో వేలాది మందిని ఆకట్టుకుంటోంది. జీవితంలో అపజయాలు ఎదురైనప్పుడు కలిగే నిరాశ, అపనమ్మకాలను తాము కూడా అనుభవించామని చాలా మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. విజయం అనేది ఎప్పుడూ ఒకే సరళరేఖలా సాగదని, నిరంతర పోరాటం చేసిన కొన్నేళ్ల తర్వాతే అసలైన మార్పు కనిపిస్తుందని ఈ కథ నిరూపించిందని కొనియాడారు.

"కష్టాల్లో ఉన్నప్పుడు ఆశావాదం అబద్ధంలా అనిపిస్తుంది, కానీ మనం చేసే ప్రయత్నం మాత్రమే నిజంలా కనిపిస్తుంది. నిరాశ చెందకుండా ముందుకు సాగాలని నిర్ణయించుకున్న శౌర్యను చూస్తే గర్వంగా ఉంది. ఇది నిజంగా ఇన్స్పిరేషన్," అని ఒక నెటిజన్ రాశారు.

"జీవితంలో చాలా మంది చేసే పెద్ద తప్పు ఏంటంటే.. ఈ రోజు ఉన్న పరిస్థితులే శాశ్వతం అని నమ్మడం. గెలిచిన ప్రతి ఒక్కరూ ఒకప్పుడు దారి తెలియక ఇబ్బంది పడ్డవారే, కానీ వారు ప్రయత్నాన్ని ఆపలేదు. మన నమ్మకం ముగిసిపోయిన చాలా కాలానికి విజయం అందుతుంది," అని మరో యూజర్ కామెంట్ చేశారు.

"విజయం సాధించిన ప్రతి ఒక్కరి జీవితంలోనూ అంతా గందరగోళంగా ఉన్న ఒక అధ్యాయం కచ్చితంగా ఉంటుంది. తేడా అల్లా ఒక్కటే.. ఆ ఒక్క చాప్టర్ చదివి వాళ్లు పుస్తకాన్ని మూసేయలేదు, కథను ముందుకు నడిపించారు," అని మరొకరు స్పందించారు.

"మనం ఒక పరీక్షనో, ఒక తిరస్కరణనో లేదా జీవితంలో ఒక చెడ్డ దశనో చూసి అదే సర్వస్వం అనుకుంటాం. కానీ ఆ క్షణం తర్వాత మనం ఏం చేశామనేదే మన జీవితాన్ని నిర్దేశిస్తుంది. ముందుకు సాగిపోండి, అక్కడే అసలైన కథ మొదలవుతుంది," అంటూ నెటిజన్లు శౌర్యపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More