క్యాన్సర్ బాధితులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట నిచ్చింది. దేశంలో ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధి చికిత్సకు వాడే 137 రకాల ఔషధాల ధరలను గణనీయంగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ట్రేడ్ మార్జిన్ రేషనలైజేషన్ (టీఎంఆర్) విధానం కింద ఈ మందులను చేర్చుతూ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. సవరించిన ఈ కొత్త ధరలు 2026 నవంబర్ 9 నుంచి అమల్లోకి రానున్నాయి.
ధరలు ఎంతవరకు తగ్గుతాయి?

ప్రస్తుతం విపణిలో ఉన్న ధరల నిర్మాణం ఆధారంగా నాన్-షెడ్యూల్డ్ క్యాన్సర్ ఔషధాల గరిష్ఠ రిటైల్ ధర (ఎమ్‌ఆర్‌పీ) దాదాపు 70 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) డ్రగ్స్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ (డీపీసీఓ) 2013లోని పారాగ్రాఫ్ 19 నిబంధనల మేరకు ట్రేడ్ మార్జిన్‌ను ఎమ్‌ఆర్‌పీలో గరిష్ఠంగా 30 శాతానికి పరిమితం చేసింది.
ఈ నిర్ణయంతో పెంబ్రోలిజుమాబ్, డుర్వాల్యూమాబ్, ఓసిమెర్టినిబ్ వంటి విస్తృతంగా వాడే ఇమ్యునోథెరపీ ఔషధాలు క్యాన్సర్ రోగులకు అందుబాటు ధరల్లోకి రానున్నాయి. గతంలో 2019లో 42 రకాల క్యాన్సర్ మందులపై ట్రేడ్ మార్జిన్ల పరిమితి విధించడంతో ధరలు ఏకంగా 90 శాతం వరకు తగ్గాయి. ఆ అనుభవంతోనే ఇప్పుడు మరో 137 మందులకు ఈ నిబంధనను విస్తరించారు.
ధరల లెక్కింపు సూత్రం ఇదిగో...
ఔషధాల కొత్త ఎమ్‌ఆర్‌పీని లెక్కించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శక సూత్రాన్ని విడుదల చేసింది:
గరిష్ఠ రిటైల్ ధర (ఎమ్‌ఆర్‌పీ) = పీటీఎస్/పీటీడీ x { 1 + (టీఎమ్/ (100 − టీఎమ్)) } + వర్తించే జీఎస్‌టీ
(ఇక్కడ టీఎమ్ అంటే 30 శాతానికి మించని ట్రేడ్ మార్జిన్. పీటీఎస్/పీటీడీ అంటే 2026 మార్చి నెలలో స్టాకిస్ట్ లేదా డిస్ట్రిబ్యూటర్‌కు విక్రయించిన ధర)
ఉదాహరణకు:
ఒక నాన్-షెడ్యూల్డ్ క్యాన్సర్ మందు పాత ఎమ్‌ఆర్‌పీ ₹300 + జీఎస్‌టీ అనుకుంటే, దాని పీటీఎస్/పీటీడీ ధర ₹70గా ఉంటే:
{{/usCountry}}ఒక నాన్-షెడ్యూల్డ్ క్యాన్సర్ మందు పాత ఎమ్‌ఆర్‌పీ ₹300 + జీఎస్‌టీ అనుకుంటే, దాని పీటీఎస్/పీటీడీ ధర ₹70గా ఉంటే:
{{/usCountry}}కొత్త నిబంధన ప్రకారం అనుమతించే గరిష్ఠ ఎమ్‌ఆర్‌పీ = ₹70 x {1 + (30/(100−30))} = ₹100 + వర్తించే జీఎస్‌టీ అవుతుంది. అంటే గతంలో ₹300 ఉన్న ఔషధం ధర ఇప్పుడు ₹100కి దిగివస్తుంది.
చౌకగా మారనున్న 137 మందులు ఇవే...
కేంద్రం గురి పెట్టిన 137 నాన్-షెడ్యూల్డ్ క్యాన్సర్ మందుల జాబితాలో ప్రధానమైనవి.
- 20 రకాలకు పైగా క్యాన్సర్ల చికిత్సలో వాడే ఇమ్యునోథెరపీ ఔషధాలు.
- రొమ్ము, ప్రొస్టేట్ క్యాన్సర్ రోగులకు వాడే డెనోసుమాబ్.
- క్యాన్సర్ రోగుల్లో న్యూట్రోపేనియా నివారణకు ఉపయోగించే పెగ్ఫిల్గ్రాస్టిమ్.
- పేగు, అండాశయం, గర్భాశయ ముఖద్వార (సర్వికల్) క్యాన్సర్ల చికిత్సకు ఆమోదించిన బెవాసిజుమాబ్.
ఆసుపత్రులు, విక్రేతలకు కేంద్రం మార్గదర్శకాలు
ఔషధ పంపిణీ వ్యవస్థలో మితిమీరిన లాభాల మార్జిన్లను అరికట్టడంతో పాటు, తయారీదారుల రాబడిని కాపాడుతూ మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడకుండా చూడడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేసింది. రోగులకు నిరంతరాయంగా మందులు అందేలా తయారీ కంపెనీలు తమ ప్రస్తుత ఉత్పత్తి, సరఫరా స్థాయిలను కొనసాగించాలని ఆదేశించింది.
కొత్త ధరల అమలు కోసం విక్రేతలు, కొనుగోలుదారులకు జారీ చేసిన ఆదేశాలు:
- గెజెట్ నోటిఫికేషన్ వెలువడిన 7 రోజుల్లోగా సవరించిన ధరలను తయారీ కంపెనీలు ఎన్‌పీపీఏకి సమాచారం అందించాలి.
- సవరించిన ధరల జాబితాను తమ వెబ్‌సైట్లలో ప్రదర్శించడంతో పాటు రిటైలర్లు, ఆసుపత్రులకు చేరవేయాలి.
- 2026 నవంబర్ 9 నుంచి ఆసుపత్రులు, రిటైలర్లు తగ్గించిన ధరలకే మందులను విక్రయించాలి. తమ ఫార్మసీలలో కొత్త ధరలను స్పష్టంగా ప్రదర్శించాలి.
- ఆసుపత్రులు తమ అధికారిక వెబ్‌సైట్లలో కూడా సవరించిన ధరల పట్టికను అందుబాటులో ఉంచాలి.
వినియోగదారులు 'ఫార్మా సహీ దామ్' (Pharma Sahi Daam) యాప్ లేదా ఎన్‌పీపీఏ వెబ్‌సైట్ ద్వారా ఔషధాల సవరించిన ధరలను సరిచూసుకోవచ్చు.