...
...
Next Story

చిన్నారుల్లో పదే పదే వచ్చే ఆ కుదుపులు ఫిట్స్​కి సంకేతమా? తల్లులు జాగ్రత్త పడాల్సిందే!

ఒక ఏడాది లోపు పిల్లల్లో పదే పదే కనిపించే వింతైన శారీరక కదలికలు 'ఇన్‌ఫాంటైల్ స్పాజమ్స్' (శిశువుల్లో వచ్చే ఫిట్స్) కావచ్చు. వీటిని సకాలంలో గుర్తించి చికిత్స అందించకపోతే పిల్లల మెదడు ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడుతుందని హైదరాబాద్ యశోద హాస్పిటల్స్​కి చెందిన డాక్టర్ లోకేష్ హెచ్చరిస్తున్నారు.

Published on: Oct 12, 2026, 12:30:37 IST
Advertisement

పసిపాపలు నవ్వినా, కేరింతలు కొట్టినా, హఠాత్తుగా చేతులు కాళ్లు ఊపినా తల్లిదండ్రులు ఎంతో మురిసిపోతుంటారు. అయితే, ఒక ఏడాది లోపు వయసున్న పిల్లలు పదే పదే వింతగా లేదా ఒకే తీరుగా శరీర భాగాలను కదిలిస్తుంటే దాన్ని కేవలం చిన్నపిల్లల ఆటగా భావించి తేలిగ్గా తీసిపారేయకూడదు. అది సాధారణ శరీర కదలిక కాకపోవచ్చు లేదా 'ఇన్‌ఫాంటైల్ స్పాజమ్స్' (Infantile Spasms) అని పిలిచే ఒక రకమైన తీవ్రమైన ఫిట్స్ (మూర్ఛ వ్యాధి) కావచ్చు అని హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ చైల్డ్ అండ్ అడోలసెంట్ న్యూరాలజీ క్లినికల్ డైరెక్టర్ అండ్ లీడ్ కన్సల్టెంట్ డాక్టర్ లోకేష్ లింగప్ప హెచ్చరిస్తున్నారు..

చిన్నారుల్లో ఆ కుదుపులు ఫిట్స్​కి సంకేతమా?
చిన్నారుల్లో ఆ కుదుపులు ఫిట్స్​కి సంకేతమా?

ఈ వింత కదలికలను ప్రారంభ దశలోనే గుర్తించకపోతే, అది పసిపాపల పెరుగుతున్న మెదడు వికాసంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని లోకేష్ చెబుతున్నారు. సకాలంలో చికిత్స అందించకపోతే ఎదుగుదల లోపాలకు దారితీస్తుందని అంటున్నారు.

ఈ వ్యాధి లక్షణాలు, దాని తీవ్రతపై లోకేష్ లింగప్ప చెప్పిన కీలక విషయాలు..

ఇన్‌ఫాంటైల్ స్పాజమ్స్ లక్షణాలు ఎలా ఉంటాయి?

శిశువుల్లో వచ్చే ఈ ఫిట్స్ చాలా క్షణికంగా, కేవలం ఒకటి లేదా రెండు సెకన్ల పాటు మాత్రమే ఉంటాయి. కానీ ఇవి ఒక్కసారి వచ్చి ఆగకుండా గుంపులుగా (క్లస్టర్స్​) వస్తాయి.

  • నిద్ర లేచిన వెంటనే శరీరం ఒక్కసారిగా బిగుసుకుపోవడం
  • తల ముందు వైపునకు హఠాత్తుగా వంగడం లేదా ఊగడం
  • చేతులు ఒక్కసారిగా బయటకు లేదా లోపలికి కదలడం
  • కాళ్లు కడుపు వైపునకు ముడుచుకుపోవడం
  • వెన్నుభాగం విల్లులా వంగడం
  • కంటిపాపలు పైకి వెళ్లడం వంటివి కొన్ని లక్షణాలు

"ఈ కదలికలు ఏదో ఒకసారి వచ్చి ఆగవు. చిన్నారి నిద్ర లేచిన కొద్దిసేపటికే కొన్ని సెకన్లు లేదా నిమిషాల వ్యవధిలో పదే పదే ఒకే తీరుగా వస్తుంటాయి," అని డాక్టర్ లోకేష్ లింగప్ప వివరించారు.

సాధారణ ఉలికిపాటుకు, ఫిట్స్‌కు తేడా ఏంటి?

పాప లేదా బాబులో ఈ కదలికలతో పాటు కింది మార్పులు కనిపిస్తే తల్లిదండ్రులు వెంటనే అప్రమత్తం అవ్వాలి:

  • తల్లిదండ్రులను చూసి నవ్వడం తగ్గించడం లేదా కళ్లలోకి చూడటం నిలిపివేయడం
  • చుట్టుపక్కల విషయాలపై ఆసక్తి చూపకపోవడం
  • వయస్సుకు తగ్గ ఎదుగుదల మందగించడం
  • అంతకుముందు నేర్చుకున్న నైపుణ్యాలు (బోర్లా పడటం, కూర్చోవడం, కేరింతలు కొట్టడం) హఠాత్తుగా మరిచిపోవడం

రోగ నిర్ధారణ విధానాలు ఇవి..

చిన్నారిలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్‌ను సంప్రదించాలి. మెదడులోని విద్యుత్ తరంగాల తీరును రికార్డు చేసే ఈఈజీ పరీక్ష ద్వారా ఈ వ్యాధిని కచ్చితంగా నిర్ధారించవచ్చని డాక్టర్ తెలిపారు. అవసరాన్ని బట్టి ఎంఆర్‌ఐ స్కాన్, జెనెటిక్ పరీక్షలు చేసి వ్యాధికి ఉన్న ప్రాథమిక కారణాలను విశ్లేషిస్తారు.

తల్లిదండ్రులు ఏం చేయాలి?

"ఇది.. వయస్సుతో పాటు అదే తగ్గిపోయే సాధారణ సమస్య ఎంతమాత్రం కాదు. వెంటనే చికిత్స ప్రారంభించడం వల్ల మెదడుపై పడే తీవ్ర ప్రభావాన్ని తగ్గించవచ్చు," అని డాక్టర్ లోకేష్ లింగప్ప స్పష్టం చేశారు. హార్మోనల్ థెరపీ వంటి వైద్య విధానాల ద్వారా ఈ వ్యాధికి మెరుగైన చికిత్స లభిస్తుంది.

మీ పిల్లల్లో పదే పదే ఇలాంటి వింత కదలికలు కనిపిస్తే, వెంటనే ఫోన్‌లో వీడియో రికార్డ్ చేసి పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్‌కు చూపించడం వల్ల సరైన వ్యాధి నిర్ధారణ వేగంగా జరుగుతుంది.

డాక్టర్ లోకేష్ లింగప్ప
 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON