రక్తంలో షుగర్ పెరిగితే శరీరం ఇచ్చే హెచ్చరికలివే.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి

రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు శరీరం కొన్ని సూక్ష్మమైన సంకేతాలను ఇస్తుంది. వీటిని చాలామంది సాధారణ అలసటగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ లక్షణాల గురించి అమెరికాకు చెందిన ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ రవి కె. గుప్తా వెల్లడించిన కీలక విషయాలు ఇక్కడ తెలుసుకోండి.

Published on: Sep 7, 2026, 10:29:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మనకు ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్నట్లు అనిపించకపోయినా, రక్తంలో చక్కెర స్థాయిలు (బ్లడ్ షుగర్) నిశ్శబ్దంగా పెరిగిపోతుంటాయి. ఈ క్రమంలో శరీరం కొన్ని స్పష్టమైన సంకేతాలను ఇస్తుంది. అయితే చాలామంది వీటిని పెద్ద ఆరోగ్య సమస్యగా గుర్తించరు. ఇటీవల అమెరికాకు చెందిన ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ రవి కె. గుప్తా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా బ్లడ్ షుగర్ పెరిగినప్పుడు కనిపించే ప్రధాన లక్షణాలను పంచుకున్నారు.

రక్తంలో షుగర్ పెరిగితే శరీరం ఇచ్చే హెచ్చరికలివే.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి
రక్తంలో షుగర్ పెరిగితే శరీరం ఇచ్చే హెచ్చరికలివే.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి

తీరని దాహం.. తరచుగా మూత్ర విసర్జన

రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు మితిమీరినప్పుడు, మూత్రపిండాలు ఆదనపు గ్లూకోజ్‌ను మూత్రం ద్వారా బయటకు పంపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తాయి. ఈ ప్రక్రియలో శరీరం నుంచి నీరు ఎక్కువగా బయటకు వెళ్తుంది. "దీనివల్ల నిరంతరం దాహం వేయడం, తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి" అని డాక్టర్ రవి గుప్తా వివరించారు.

తిన్న తర్వాత కూడా ఆకలి.. తగ్గని నీరసం

రక్తంలో గ్లూకోజ్ పుష్కలంగా ఉన్నప్పటికీ, శరీరంలోని కణాలు దానిని శక్తిగా మార్చుకోలేవు. "భోజనం చేసిన కొద్దిసేపటికే మళ్లీ ఆకలి వేయడం, తీపి పదార్థాలు తినాలనే కోరిక పెరగడం, శరీరంలో శక్తి తగ్గడం హై బ్లడ్ షుగర్ లక్షణమే" అని ఆయన పేర్కొన్నారు.

గాయాలు త్వరగా మానకపోవడం

దీర్ఘకాలంగా రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే రక్తనాళాలు, రక్త ప్రసరణ రోగనిరోధక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటాయి. దెబ్బలు లేదా గాయాలు సాధారణం కంటే ఎక్కువ సమయం తీసుకుని మానకపోతే వెంటనే బ్లడ్ షుగర్ పరీక్ష చేయించుకోవాలి.

మసకబారే చూపు.. పదేపదే ఇన్ఫెక్షన్లు

గ్లూకోజ్ స్థాయిలు పెరిగినప్పుడు కంటి లోపల ఉండే ద్రవాల సమతుల్యత తాత్కాలికంగా దెబ్బతింటుంది. దీనివల్ల చూపు హఠాత్తుగా మసకబారుతుంది. ఇది కేవలం స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్ స్క్రీన్ చూడటం వల్ల వచ్చిన మార్పు మాత్రమే అని అనుకోవద్దు. అలాగే మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, చర్మ సమస్యలు పదేపదే వేధిస్తుంటే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మంచిది.

నడుము చుట్టుకొలత పెరగడం

శరీర బరువు స్థిరంగా ఉన్నప్పటికీ నడుము భాగంలో కొవ్వు పెరగడం ఇన్సులిన్ నిరోధకతకు (Insulin Resistance) బలమైన సంకేతం. దక్షిణాసియా వాసుల్లో తక్కువ బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) ఉన్నప్పటికీ మెటబాలిక్ ప్రమాదాలు ఎక్కువగా వస్తాయని డాక్టర్ హెచ్చరించారు.

"చాలాసార్లు బ్లడ్ షుగర్ పెరిగినా ఎలాంటి లక్షణాలు బయటకు కనిపించకపోవడమే అత్యంత ప్రమాదకరం. అందుకే తరచుగా రక్త పరీక్షలు చేయించుకుంటూ మీ షుగర్ లెవెల్స్ తెలుసుకోవడం చాలా ముఖ్యం" అని డాక్టర్ రవి గుప్తా స్పష్టం చేశారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More