Secret for long life : రోజుకు 10వేల అడుగులు, నో షుగర్, నో మైదా- 88ఏళ్ల బామ్మ హెల్త్ సీక్రెట్స్..
Fintess for old age : సంక్లిష్టమైన డైట్‌లు, జిమ్‌లకు దూరంగా ఉంటూ కేవలం రోజువారీ నడక, మంచి అలవాట్లతో 88ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా జీవిస్తున్న బామ్మ గురించిన ఆసక్తికర విషయాలను ఇక్కడ చూసేయండి. మీ జీవితంలో అప్లై చేసుకోండి..
ఈ కాలంలో ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకాలంటే బయోహ్యాకింగ్, హైటెక్ సప్లిమెంట్లు, కఠినమైన డైట్ నియమాలు పాటించాలని చాలా మంది భావిస్తుంటారు. కానీ, ఆరోగ్యకరమైన జీవితానికి మూల సూత్రాలు చాలా సరళంగా ఉంటాయని నిరూపించారు ఒక 88ఏళ్ల బామ్మ! ఆమె చెప్పిన చిన్న చిన్న అలవాట్లు కేవలం వృద్ధులకే కాకుండా, యువతకు కూడా చక్కటి స్ఫూర్తినిస్తాయి.

లాస్ ఏంజిల్స్‌కు చెందిన సైకోథెరపిస్ట్ టేలర్ బౌమన్ తన 88ఏళ్ల బామ్మకు సంబంధించిన ఒక ఆసక్తికర వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. స్టైలిష్‌గా టోపీ, సన్ గ్లాసెస్ పెట్టుకుని చేతిలో కాఫీ కప్పుతో కనిపించిన ఆ నవ యవ్వన వృద్ధురాలు.. తన నిత్య జీవితంలో పాటించే ఆరోగ్య సూత్రాలను పంచుకున్నారు.
అందరితో కనెక్ట్ కావడమే అసలైన యవ్వనం..
తాను ఉత్సాహంగా ఉండటానికి ప్రధాన కారణం శారీరకంగా, సామాజికంగా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండటమే అని ఆ 88ఏళ్ల బామ్మ చెప్పారు.
ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి బలమైన సామాజిక సంబంధాలు ఎంతగానో ఉపయోగపడతాయని వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు. బామ్మ దైనందిన జీవితం సరిగ్గా ఇదే సూత్రంపై ఆధారపడి ఉంటుంది.
"నేను చాలా బిజీగా ఉంటాను. ప్రతిరోజూ బయటకు వెళతాను. ఒకవేళ బయట వాతావరణం బాగోలేకపోతే, గంటల తరబడి ఫోన్‌లో స్నేహితులతో మాట్లాడుతాను. ఎప్పుడూ నలుగురితో టచ్‌లో ఉంటాను," అని ఆమె తెలిపారు. తన సామాజిక జీవితాన్ని విభిన్నంగా మలుచుకుంటూ మానసిక ఉల్లాసాన్ని పొందుతున్నట్లు చెప్పారు.
"నాకు పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. అందుకే కొన్ని గ్రూపులతో కలిసి పాడుతుంటాను. స్నేహితులతో కలిసి కాఫీ తాగుతూ ముచ్చటించడం, బుక్ క్లబ్‌లు, టీ పార్టీలకు వెళ్లడం నాకు ఇష్టం," అని ఆమె వివరించారు.
విభిన్న వయసుల వారితో బుక్ క్లబ్‌లు..
ఆమె మేధోపరమైన ఆలోచనలు చాలా విభిన్నంగా ఉంటాయి. కేవలం ఒకే వయసు వారితో కాకుండా, వివిధ వయసుల గ్రూపుల్లో ఆమె ఉత్సాహంగా పాల్గొంటారు. "బుక్ క్లబ్‌లు చాలా సరదాగా ఉంటాయి. ఒక బుక్ క్లబ్‌లో అందరూ చాలా చిన్న వయసు వారే ఉంటారు. వాళ్లు మనం 'చదవాల్సిన' పుస్తకాలు చదువుతారు. మరో బుక్ క్లబ్ నా వయసు వారితో ఉంటుంది. వాళ్లు సరదాగా, ఆసక్తికరంగా ఉండే పుస్తకాలు చదువుతారు. నాకు ఈ రెండూ ఇష్టమే," అని బామ్మ చెప్పారు.
రోజూ 10 వేల అడుగుల నడక.. చెడు ఆహారానికి దూరం
88ఏళ్ల బామ్మ సామాజిక జీవితమే కాకుండా, శారీరక వ్యాయామం యువతను కూడా ఆశ్చర్యపరుస్తుంది.
"నేను చాలా దూరం నడుస్తాను. రోజుకు 10 వేల అడుగులు, అంటే సుమారు 5 మైళ్లు (దాదాపు 8 కిలోమీటర్లు) నడవడానికి ప్రయత్నిస్తాను," అని ఆమె తెలిపారు.
సాధారణంగా ఆరోగ్యంగా ఉండటానికి రోజుకు 7 వేల నుంచి 10 వేల అడుగులు నడవాలని నిపుణులు సూచిస్తుంటారు. కానీ 88ఏళ్ల వయసులోనూ ఈ లక్ష్యాన్ని క్రమం తప్పకుండా ఆమె పాటించడం విశేషం.
వర్షం కురిసినా నడక ఆపుతారా అని అడిగినప్పుడు, "వర్షంలోనూ నడిచాను. చలి ఎక్కువగా ఉంటే మాత్రం బయటకు వెళ్లను," అని ఆమె నవ్వుతూ బదులిచ్చారు.
యాక్టివ్‌గా ఉండటంతో పాటు ఆహార విషయంలోనూ కొన్ని కఠినమైన నియమాలు పాటిస్తున్నారు. "నేను పంచదార ముట్టను. మైదాతో చేసిన ఏ పదార్థం కూడా తినను," అని స్పష్టం చేశారు.
వృద్ధుల ఆరోగ్యం, ముందు జాగ్రత్త వైద్యం గురించి సమాజంలో చర్చ జరుగుతున్న తరుణంలో.. ఈ 88ఏళ్ల బామ్మ చెప్పిన ఈ చిన్న విషయాలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆయుష్షు పెరగడమే ముఖ్యం కాదని, బతికే ప్రతి క్షణాన్ని ఆరోగ్యంగా, ఆనందంగా గడపడమే అసలైన జీవితమని ఆమె నిరూపించి చూపారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


