మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటి. శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపించడం, ఆహారం జీర్ణం కావడంలో సహాయపడడం, పోషకాలను నిల్వ చేయడం, రోగనిరోధక శక్తికి తోడ్పడడం - ఇలాంటి ముఖ్యమైన పనులను కాలేయం చేస్తుంది. అయితే కాలేయానికి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా ఎలాంటి లక్షణాలు లేకుండానే నెమ్మదిగా పెరుగుతుంటాయి. చాలాసార్లు వ్యాధి తీవ్రస్థాయికి చేరిన తర్వాతే సమస్య బయటపడుతుంది. అలాంటి వాటిలో దీర్ఘకాలిక హెపటైటిస్ వల్ల వచ్చే లివర్ క్యాన్సర్ ఒకటి. దీని గురించి మణిపాల్ హాస్పిటల్, విజయవాడకు చెందిన డాక్టర్ రాజేశ్ చంద్ర, గ్యాస్ట్రోఎంటరాలజీ కన్సల్టెంట్ వివరించారు.
హెపటైటిస్ అంటే ఏమిటి?

హెపటైటిస్ అంటే కాలేయంలో వాపు రావడం. దీనికి అనేక కారణాలు ఉన్నప్పటికీ, ముఖ్యంగా హెపటైటిస్ బి (HBV), హెపటైటిస్ సి (HCV) వైరస్‌లు ప్రపంచవ్యాప్తంగా లివర్ క్యాన్సర్‌కు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ఈ వైరస్‌లు శరీరంలోకి వచ్చిన తర్వాత చాలా సంవత్సరాల పాటు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. కానీ ఆ సమయంలో కాలేయంలో నిరంతరం వాపు కొనసాగుతూ ఆరోగ్యకరమైన కణాలను దెబ్బతీస్తూనే ఉంటుంది.
హెపటైటిస్ నుంచి లివర్ క్యాన్సర్ ఎలా వస్తుంది?
కాలేయం పదేపదే దెబ్బతింటూ ఉండటంతో అది తిరిగి కోలుకునే ప్రయత్నం చేస్తుంది. ఇలా గాయం కావడం, మళ్లీ మానడం అనే ప్రక్రియ చాలాకాలం కొనసాగితే మొదట ఫైబ్రోసిస్ వస్తుంది. ఆ తర్వాత అది సిర్రోసిస్‌గా మారుతుంది. అంటే కాలేయంలో శాశ్వత మచ్చలు ఏర్పడతాయి. ఈ సిరోసిస్ ఉన్నవారిలో హెపటోసెల్యులార్ కార్సినోమా (HCC) అనే అత్యంత సాధారణ లివర్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది.
హెపటైటిస్ బి లేదా హెపటైటిస్ సి ఉన్నవారికి, ఈ వైరస్‌లు లేనివారితో పోలిస్తే లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా రెట్లు ఎక్కువ. ముఖ్యంగా హెపటైటిస్ బి ఉన్న కొందరిలో సిర్రోసిస్ రాకముందే కూడా లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే క్రమం తప్పకుండా చెక్-అప్ చేయించుకోవడం చాలా అవసరం.
గుర్తించడం ఎందుకు కష్టం?
దీర్ఘకాలిక హెపటైటిస్ అయినా, ప్రారంభ దశలో ఉండే లివర్ క్యాన్సర్ అయినా రెండూ ఎక్కువగా "సైలెంట్ డిసీజెస్". అంటే చాలా కాలం వరకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. వ్యాధి ముదిరిన తర్వాత మాత్రమే కొన్ని సంకేతాలు కనిపిస్తాయి.
వాటిలో కొన్ని...
{{/usCountry}}దీర్ఘకాలిక హెపటైటిస్ అయినా, ప్రారంభ దశలో ఉండే లివర్ క్యాన్సర్ అయినా రెండూ ఎక్కువగా "సైలెంట్ డిసీజెస్". అంటే చాలా కాలం వరకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. వ్యాధి ముదిరిన తర్వాత మాత్రమే కొన్ని సంకేతాలు కనిపిస్తాయి.
వాటిలో కొన్ని...
{{/usCountry}}ఎప్పుడూ అలసటగా అనిపించడం
కారణం లేకుండా బరువు తగ్గిపోవడం
ఆకలి తగ్గిపోవడం
కడుపు నొప్పి
పొట్ట ఉబ్బరంగా అనిపించడం
కామెర్లు రావడం
మూత్రం ముదురు రంగులో రావడం
ఇలాంటి లక్షణాలు కనిపించే సమయానికి వ్యాధి చాలా వరకు ముదిరే అవకాశం ఉంది. దాంతో చికిత్స కూడా కొంత క్లిష్టంగా మారుతుంది. హెపటైటిస్ వల్ల వచ్చే లివర్ క్యాన్సర్‌ను చాలా వరకు నివారించవచ్చు. ముందుగానే వ్యాధిని గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.
హెపటైటిస్ బి వ్యాక్సిన్ చాలా మంచి రక్షణను ఇస్తుంది. అందుకే ప్రతి శిశువుకూ, అలాగే రిస్క్ లో ఉన్న వ్యాక్సిన్ తీసుకోని పెద్దవారికీ, ఇది తప్పనిసరి అని వైద్యులు సూచిస్తున్నారు. హెపటైటిస్ సి కి ప్రస్తుతం వ్యాక్సిన్ లేకపోయినా, ఇప్పుడు అందుబాటులో ఉన్న అత్యాధునిక యాంటీవైరల్ మందులతో చాలా మంది పూర్తిగా కోలుకునే అవకాశం ఉంది. ప్రారంభ దశలో చికిత్స తీసుకుంటే లివర్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా గణనీయంగా తగ్గుతుంది.
అలాగే దీర్ఘకాలిక హెపటైటిస్ బి ఉన్నవారికి యాంటీవైరల్ చికిత్స ఇవ్వడం వల్ల వైరస్‌ను నియంత్రించవచ్చు. వ్యాధి వేగంగా పెరగకుండా అడ్డుకోవడంతో పాటు లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని కూడా తగ్గించవచ్చు.
ఎవరెవరు రెగ్యులర్ చెకప్ చేయించుకోవాలి?
దీర్ఘకాలిక హెపటైటిస్ ఉన్నవారు, సిర్రోసిస్ ఉన్నవారు, కుటుంబంలో లివర్ క్యాన్సర్ హిస్టరీ ఉన్నవారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి వైద్యుల సూచన మేరకు లివర్ అల్ట్రాసౌండ్, అలాగే ఆల్ఫా ఫీటోప్రోటీన్ (AFP) వంటి రక్తపరీక్షలు చేయించుకోవాలి. ముందుగానే వ్యాధిని గుర్తిస్తే చికిత్స ఫలితాలు చాలా మెరుగ్గా ఉంటాయి. అవసరాన్ని బట్టి శస్త్రచికిత్స, లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్, అబ్లేషన్, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ వంటి ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.
కాలేయాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే
కాలేయం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవగాహనే మొదటి అడుగు. హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకోవడం, సురక్షితమైన వైద్య విధానాలను పాటించడం, ప్రమాదంలో ఉన్నవారు స్క్రీనింగ్ చేయించుకోవడం, మద్యం తగ్గించడం, సరైన బరువును కాపాడుకోవడం, వైరల్ హెపటైటిస్ ఉంటే ఆలస్యం చేయకుండా చికిత్స తీసుకోవడం ద్వారా లివర్ క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు.
ముందుగానే గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే, హెపటైటిస్ జీవితాంతం వెంటాడే సమస్యగానో, లివర్ క్యాన్సర్‌గానో మారకుండా కూడా నివారించవచ్చు.
డాక్టర్ రాజేశ్ చంద్ర
గ్యాస్ట్రోఎంటరాలజీ, కన్సల్టెంట్
మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.