Weight loss drugs : బరువు తగ్గే మందులు వాడుతున్నారా? మోజులో పడేముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

Weight loss treatment : డయాబెటిస్ నియంత్రణ కోసం పుట్టి, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బరువు తగ్గడానికి హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న జీఎల్పీ-1 మందులు ఇప్పుడు భారత్‌లోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అయితే, వీటిని తీసుకునే ముందు సరైన అవగాహన లేకపోతే తీవ్ర ఇబ్బందులు తప్పవు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Published on: Jul 1, 2026, 06:43:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మారుతున్న జీవనశైలి కారణంగా ఊబకాయం, మధుమేహం వంటి జీవక్రియ లోపాలు మనదేశంలో పెను సవాలుగా మారాయి. ఈ క్రమంలోనే గ్లోబల్ మార్కెట్‌లో సంచలనం సృష్టించిన ఒజెంపిక్, మౌంజారో, వెగోవీ వంటి బరువు తగ్గించే మందులకు డిమాండ్ అమాంతం పెరిగింది. ఇక సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, టోరెంట్ వంటి దిగ్గజ భారతీయ ఫార్మా కంపెనీలు ‘ఒబెడా’, ‘నోవెల్‌ట్రీట్’ వంటి పేర్లతో అత్యంత చౌకగా జెనరిక్ ఇంజెక్షన్లు, టాబ్లెట్లను మార్కెట్లోకి తెచ్చాయి. ఒకప్పుడు నెలకు రూ. 10 వేల కంటే ఎక్కువ ఖర్చయ్యే ఈ చికిత్స, ఇప్పుడు రూ. 1,000 నుండి రూ. 3,000 లకే లభిస్తుండటంతో సామాన్యులు సైతం వీటి వైపు మొగ్గు చూపుతున్నారు.

Weight-loss drugs ozempic and wegovy linked to lower cancer deaths
Weight-loss drugs ozempic and wegovy linked to lower cancer deaths

అసలు ఈ మందులు ఎలా పనిచేస్తాయి?

మన శరీరంలో సహజంగా ఉండే ‘జీఎల్పీ-1’ అనే హార్మోన్‌ను ఇవి అనుకరిస్తాయి. ఇది మెదడుకు ‘కడుపు నిండింది’ అనే సంకేతాన్ని పంపుతుంది. జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదింపజేసి, రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇన్సులిన్ విడుదలకు ప్యాంక్రియాస్‌ను ప్రేరేపిస్తుంది. ఈ ద్వంద్వ చర్య వల్ల అటు టైప్-2 డయాబెటిస్ నియంత్రణలో ఉండటంతో పాటు ఇటు బరువు కూడా వేగంగా తగ్గుతారు.

అయితే, సోషల్ మీడియాలో చూపిస్తున్న ఆకర్షణీయమైన ప్రకటనలు చూసి, ఇవి కేవలం ఒక క్యాజువల్ లైఫ్‌స్టైల్ ప్రొడక్ట్ అనుకుంటే పొరపాటే. ఇది ముమ్మాటికీ ఒక కీలకమైన వైద్యపరమైన నిర్ణయం.

అందుకే.. ఈ మందులను వాడటానికి ముందు ప్రతి ఒక్కరూ గమనించాల్సిన 7 ముఖ్యమైన విషయాలు ఇక్కడ చూద్దాం.

1. సైడ్ ఎఫెక్ట్స్, పొంచివున్న ముప్పు..

బరువు తగ్గించే మందులు వాడేవారిలో దుష్ప్రభావాలు సర్వసాధారణం. వీటి గురించి ముందే తెలుసుకోవడం మంచిది.

జీర్ణకోశ సమస్యలు: ఈ మందుల డోస్ ప్రారంభించినప్పుడు లేదా పెంచినప్పుడు వికారం, వాంతులు, విరేచనాలు, మలబద్ధకం, తీవ్రమైన కడుపునొప్పి వంటి సమస్యలు చాలా మందిలో కనిపిస్తాయి.

తీవ్రమైన అనారోగ్యాలు: అరుదుగానైనా.. ప్యాంక్రియాటైటిస్ (ప్యాంక్రియాస్ వాపు), పిత్తాశయ వ్యాధులు, మూత్రపిండాల సమస్యలు, రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోవడం వంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి.

క్యాన్సర్ హెచ్చరికలు: జంతువులపై జరిపిన ప్రయోగాల ఆధారంగా.. కొన్ని రకాల మందులు థైరాయిడ్ సీ-సెల్ ట్యూమర్లకు దారితీసే ప్రమాదం ఉందని తేలింది. అందుకే వ్యక్తిగతంగా లేదా కుటుంబంలో 'మెడుల్లరీ థైరాయిడ్ కార్సినోమా' చరిత్ర ఉన్న రోగులకు ఇవి అస్సలు సురక్షితం కావు.

2. మధ్యలోనే మానేస్తున్న రోగులు..

మందులు వాడిన కొత్తలో బరువు తగ్గినప్పటికీ.. పైన పేర్కొన్న సైడ్ ఎఫెక్ట్స్ భరించలేక చాలా మంది రోగులు ఈ చికిత్సను మధ్యలోనే ఆపేస్తున్నారు. మరికొందరు సోషల్ మీడియాలో సెలబ్రిటీలు చూపించినట్లు రాత్రికి రాత్రే ఫలితాలు రావట్లేదని, లేదా ఒక దశకు వచ్చాక బరువు తగ్గడం ఆగిపోయిందని నిరాశతో మందులు వాడటం మానేస్తున్నారు.

3. జీవితకాలం వాడాల్సిన పరిస్థితి?

ఊబకాయం అనేది ఒక దీర్ఘకాలిక సమస్య. ఈ మందులు కూడా దీర్ఘకాలిక వాడకం కోసమే రూపొందించడం జరిగింది. క్లినికల్ స్టడీస్ ప్రకారం.. ఈ మందులను ఎప్పుడైతే ఆపేస్తారో, ఆ తర్వాత తగ్గిన బరువులో చాలా భాగం మళ్లీ పెరిగిపోతారు! మందు ఆపగానే ఆకలిని అణచివేసే, జీర్ణక్రియను నెమ్మదింపజేసే శారీరక సంకేతాలు మాయమవుతాయి. పూర్వపు అలవాట్లు మారకపోతే ఆకలి మళ్లీ మొదలై పాత బరువు తిరిగి వచ్చేస్తుంది.

4. జీవనశైలి మార్పులు తప్పనిసరి..

ఈ మందులు జీవనశైలి మార్పులకు ప్రత్యామ్నాయం కావు, కేవలం ఒక సాయం మాత్రమే. మీ ఆహార నియమాల్లో క్యాలరీల తగ్గింపు, క్రమంతప్పకుండా వ్యాయామం చేయడం వంటివి కొనసాగిస్తేనే శాశ్వత ఫలితాలు ఉంటాయి. మందులు వాడుతున్నాం కదా అని ఇష్టమొచ్చినట్లు తింటే ఎలాంటి ప్రయోజనం ఉండదు.

5. మీకు నచ్చిన ఫుడ్ అంటేనే విరక్తి కలగవచ్చు!

జీఎల్పీ-1 మందులు కేవలం మీ కడుపునే కాదు.. మీ మెదడులోని ‘డోపమైన్’ వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తాయి. తద్వారా మనకు ఇష్టమైన ఆహారాలపై ఉండే క్రేవింగ్స్ (కోరికలు) తగ్గిపోతాయి. దీనివల్ల ఒకప్పుడు మీరు ఎంతో ఇష్టంగా తినే బిర్యానీ లేదా స్వీట్లపై మీకు ఒక్కసారిగా విరక్తి లేదా అనాసక్తి కలగవచ్చు.

6. మీ వ్యక్తిగత హెల్త్​ హిస్టరీ ముఖ్యం..

మీరు ఇప్పటికే ఇతర అనారోగ్య సమస్యలకు వాడుతున్న మందులతో ఇవి రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ పూర్తి మెడికల్ హిస్టరీని డాక్టర్‌కు వివరించిన తర్వాతే, మీ శరీరానికి ఇది సరిపోతుందో లేదో నిర్ధారించుకోవాలి.

7. సొంత వైద్యం వద్దు.. డాక్టర్‌ను సంప్రదించండి..

ఇండియన్ డ్రగ్ కంట్రోలర్ (డీజీసీఐ) నిబంధనల ప్రకారం.. ఈ మందులను కేవలం ఎండోక్రినాలజిస్టులు, ఇంటర్నల్ మెడిసిన్ నిపుణులు లేదా కార్డియాలజిస్టులు మాత్రమే ప్రిస్క్రైబ్ చేయాలి.

ప్రభుత్వ నిఘా కూడా వీటిపై కఠినంగా ఉంది. కాబట్టి మెడికల్ షాపులకు వెళ్లి ఓవర్-ది-కౌంటర్ పద్ధతిలో సొంతంగా కొనుగోలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు.

చివరగా చెప్పాలంటే.. బరువు తగ్గడంలో ఈ అధునాతన మందులు అద్భుతంగా సహాయపడతాయి అనడంలో సందేహం లేదు. కానీ, వాటిని సురక్షితంగా వాడుతూ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ సాధించాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులు, స్వీయ నియంత్రణ మాత్రమే నిజమైన మార్గాలు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More