...
...
Next Story

Period blood : గర్ల్​ఫ్రెండ్ పీరియడ్ బ్లడ్​ని ఫ్రీజర్​లో దాచుకుంటున్న సీఈఓ! ఇదీ అసలు కారణం..

దీర్ఘాయువు కోసం ఏటా కోట్లు ఖర్చు చేసే టెక్ కోటీశ్వరుడు బ్రయాన్ జాన్సన్, తన గర్ల్‌ఫ్రెండ్ పీరియడ్ బ్లడ్‌ను ఫ్రీజర్‌లో దాచి ఉంచుతున్నట్లు వెల్లడించారు. గర్భాశయ ఆరోగ్యం, మైక్రోప్లాస్టిక్స్‌ను విశ్లేషించేందుకే ఈ పని చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

Published on: Jul 31, 2026, 14:01:28 IST
Advertisement

వయసు పెరగకుండా, సదా యవ్వనంగా ఉండేందుకు ఏటా మిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న అమెరికన్ టెక్ కోటీశ్వరుడు బ్రయాన్ జాన్సన్ మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. తన 30 ఏళ్ల ప్రేయసి, ఆస్ట్రేలియన్-బోస్నియన్ బయోహాకర్ కేట్ టోలో రుతుస్రావ రక్తాన్ని (పీరియడ్ బ్లడ్) తాను ఏకంగా -80 డిగ్రీల సెల్సియస్ ఫ్రీజర్‌లో భద్రపరుస్తున్నట్లు ఆయన బహిరంగంగా వెల్లడించారు.

బ్రయన్ జాన్సన్ గర్ల్​ఫ్రెండ్.. (X/@/bryan_johnson)
బ్రయన్ జాన్సన్ గర్ల్​ఫ్రెండ్.. (X/@/bryan_johnson)

సోషల్ మీడియా వేదిక ఎక్స్ (ట్విట్టర్)లో ఒక పోస్ట్ చేస్తూ.. “కేట్ పీరియడ్ బ్లడ్ నా -80 °C ఫ్రీజర్‌లో ఉంది” అని రాసుకొచ్చారు. కేట్ నుంచి సేకరించిన సుమారు 10 మిలిలీటర్ల రక్తాన్ని తన ప్రయోగాల కోసం దాచి ఉంచినట్లు 'ప్రాజెక్ట్ బ్లూప్రింట్' సీఈఓ అయిన జాన్సన్ తెలిపారు. దీర్ఘాయువు పొందే క్రమంలో తాను మరీ హద్దులు దాటుతున్నానా అని ఆయన ప్రశ్నించుకున్న మరుసటి రోజే ఈ షాకింగ్ పోస్ట్ రావడం గమనార్హం.

ఫ్రీజర్‌లో రుతుస్రావ రక్తం ఎందుకు?

అసలు ఫ్రీజర్‌లో పీరియడ్ బ్లడ్ ఎందుకు ఉంచారనే దానిపై బ్రయాన్ స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. సాధారణంగా రక్తం తీసుకుని చేసే పరీక్షల కంటే, నేరుగా గర్భాశయం నుంచి వచ్చే రుతుస్రావ రక్తాన్ని పరీక్షించడం ద్వారా మరెన్నో కీలక ఆరోగ్య విషయాలు తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు.

ఈ రక్తాన్ని విశ్లేషించడం ద్వారా గర్భాశయ కణాలు, రోగనిరోధక కణాలు, స్టెమ్ సెల్స్ మాత్రమే కాకుండా, మైక్రోప్లాస్టిక్స్, పీఎఏఎస్ (శాశ్వతంగా మిగిలిపోయే రసాయనాలు), హార్మోన్ల వ్యవస్థను దెబ్బతీసే విష రసాయనాలను ఖచ్చితంగా గుర్తించవచ్చని ఆయన తెలిపారు.

ఏలాంటి శస్త్రచికిత్స లేదా బయాప్సీ అవసరం లేకుండానే గర్భాశయ ఆరోగ్య పరిస్థితులను లోతుగా పరిశీలించడానికి ఇది ఒక అద్భుతమైన మార్గమని జాన్సన్ పేర్కొన్నారు. ప్రతి నెలా వచ్చే పీరియడ్ సైకిల్‌లోనూ ఈ పరీక్షను సులభంగా పునరావృతం చేయవచ్చని, సాధారణ బ్లడ్ టెస్ట్ ద్వారా ఊహించేదాని కంటే నేరుగా గర్భాశయ వాతావరణాన్ని పరిశీలించవచ్చని ఆయన చెప్పారు.

ఎవరు ఈ బ్రయాన్ జాన్సన్?

అమెరికాకు చెందిన టెక్ వ్యాపారవేత్త అయిన బ్రయాన్ జాన్సన్, 'బ్రెయిన్‌ట్రీ' అనే ఆన్‌లైన్ పేమెంట్స్ కంపెనీని స్థాపించారు. 2013లో ఈ సంస్థను పేపాల్ కంపెనీ దాదాపు 800 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత వ్యాపారాల కంటే కూడా.. తన వయసును తగ్గించుకునే ప్రాజెక్ట్ 'బ్లూప్రింట్' ద్వారానే ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.

తన శరీరం 18 ఏళ్ల యువకుడిలా మారాలనే లక్ష్యంతో ఆయన అత్యంత కఠినమైన జీవనశైలిని పాటిస్తున్నారు. కేవలం మొక్కల ఆధారిత ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, సరైన నిద్రతో పాటు ఎప్పటికప్పుడు వందలాది మెడికల్ స్కాన్లు, బ్లడ్ టెస్టులు చేయించుకుంటారు. వృద్ధాప్యాన్ని అరికట్టేందుకు అనేక రకాల కొత్త హెల్త్ ప్రయోగాలు చేస్తూ, ఆ ఫలితాలను ఎప్పటికప్పుడు నెట్టింట పంచుకోవడం ఆయనకు అలవాటు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON