దూరమైన స్నేహితులకు దగ్గరవ్వాలని ఉందా? ఎలాగో తెలియడం లేదా? ఇలా చేయండి..
వయసు పెరిగే కొద్దీ కొత్త స్నేహాలు చేయడం, పాత మిత్రులతో సంబంధాలు కొనసాగించడం అనేది పెద్ద సవాలుగా మారుతోంది. ఈ నేపథ్యంలో దూరమైన ఆత్మీయులను మళ్లీ చేరువ చేసుకునేందుకు అమెరికాకు చెందిన ప్రముఖ థెరపిస్ట్ జెఫ్రీ మెల్ట్జర్ ఐదు సులభమైన మార్గాలను పంచుకున్నారు. అవి..
వయసు పెరిగే కొద్దీ జీవితంలో బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగం, కుటుంబం, పిల్లల చదువులు అంటూ పరుగెత్తే క్రమంలో మనకు అత్యంత ఆప్తులైన బాల్య మిత్రులు, కాలేజీ స్నేహితులు దూరమవుతారు. ఒక దశలో మళ్లీ వారితో మాట్లాడాలని ఉన్నా, "ఇంతకాలం తర్వాత ఎలా ఫోన్ చేయాలి? వాళ్లు ఏమనుకుంటారో!" అనే సంకోచం చాలామందిని వెనక్కి లాగుతుంది. అయితే దూరమైన ఆత్మీయులను మళ్లీ చేరువ చేసుకోవడం అంత కష్టమేమీ కాదని, అది మన మానసిక ఆరోగ్యానికి ఎంతో మంచిదని అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ప్రముఖ మానసిక నిపుణుడు (థెరపిస్ట్) జెఫ్రీ మెల్ట్జర్ స్పష్టం చేశారు.

సామాజిక మాధ్యమాల వేదికగా ఆయన పంచుకున్న ఐదు సులువైన మార్గాలు, పాత స్నేహాలను మళ్లీ చిగురించేలా చేయడానికి ఏ విధంగా ఉపయోగపడతాయో ఇక్కడ చూద్దాము..
సరదా ఆటలు, కార్యకలాపాలకు సమయం ఇవ్వండి..
చిన్నతనంలో స్నేహం రూపుదిద్దుకోవడానికి ఆటలే ప్రధాన కారణం. పెద్దయ్యాక కూడా ఆ సూత్రం చక్కగా పనిచేస్తుంది. ముఖాముఖి కూర్చుని తీవ్రమైన విషయాలు మాట్లాడటం కంటే, ఇద్దరూ కలసి బోర్డ్ గేమ్ ఆడటం, క్రీడల్లో పాల్గొనడం లేదా ఇష్టమైన వినోదాత్మక ప్రక్రియను పంచుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఎలాంటి ఆందోళన లేకుండా సహజంగా సంభాషణ ప్రారంభమయ్యేందుకు ఇది దోహదపడుతుంది.
ఉమ్మడి ఆసక్తుల ఆధారంగా అనుసంధానం కావడం..
స్నేహితులను కలపడానికి ఇద్దరికీ ఇష్టమైన విషయాలు వంతెనలా పనిచేస్తాయి. "మీ ఇద్దరికీ ఆసక్తి ఉన్న విషయాన్ని సంభాషణకు ద్వారంగా మార్చుకోండి," అని జెఫ్రీ సూచించారు. ఉదాహరణకు సినిమాలు, పుస్తకాలు, లేదా ఇష్టమైన వంటకాల గురించి చర్చించవచ్చు. అలాగే ఎదుటివారికి ఇష్టమైన అంశాల పట్ల నిజమైన కుతూహలాన్ని చూపడం వల్ల, వారిపై మీకు ఎంత గౌరవం ఉందో వ్యక్తమవుతుంది.
చిన్నచిన్న పలకరింపులు, ప్రేమపూర్వక సంకేతాలు..
పాత మిత్రుడికి అనుకోకుండా ఒక మంచి ప్రశంస పంపడం లేదా ఒక చిన్న సహాయం చేయడం బంధంలో ఆప్యాయతను పెంచుతుంది. ప్రతిసారీ అవతలి వ్యక్తి నుంచి తక్షణ స్పందన రాకపోయినప్పటికీ, ఇటువంటి ఆప్యాయతా పూర్వకమైన ప్రవర్తన వారిని మీ వద్ద స్వేచ్ఛగా భావించేలా చేస్తుంది.
మంచి సంబంధాల కోసం హద్దులు విధించడం..
కొంతమంది వ్యక్తులతో మాట్లాడితే మానసికంగా తీవ్రమైన అలసట కలుగుతుంది. "మీ సరిహద్దులను పదేపదే ఉల్లంఘించే వ్యక్తులతో అనవసరమైన సంబంధాలను పరిమితం చేసుకోవడం వల్ల, మిమ్మల్ని గౌరవించే మంచి మిత్రుల కోసం ఎక్కువ సమయం కేటాయించవచ్చు," అని జెఫ్రీ తెలిపారు. ప్రతికూల ఆలోచనలు ఇచ్చే వారిని కాస్త దూరంగా ఉంచి, మిమ్మల్ని ప్రోత్సహించే స్నేహితులకు ప్రాధాన్యం ఇవ్వడం ముఖ్యం.
ప్రెజెంట్‌లో ఉండటం.. శ్రద్ధగా వినడం..
ఇది వినడానికి అత్యంత సరళంగా అనిపించినప్పటికీ, పాటించడంలోనే చాలామంది విఫలమవుతుంటారు! ఒక పాత మిత్రుడితో మాట్లాడుతున్నప్పుడు లేదా కలుసుకున్నప్పుడు మొబైల్ ఫోన్లు పక్కన పెట్టి, వారి మాటలను మనస్ఫూర్తిగా వినాలి. మనం అక్కడ పూర్తి ఏకాగ్రతతో ఉన్నామని ఎదుటి వ్యక్తికి అనిపించినప్పుడే బంధాలు మరింత బలంగా మారతాయి.
రూపాయి సంపాదన కంటే మంచి ఆప్తుల సంపాదన ఎంతో విలువైనది! కాబట్టి పాత స్నేహాలను మళ్లీ ప్రారంభించడానికి మొహమాటపడకుండా, ఒక చిన్న మెసేజ్ లేదా ఫోన్ కాల్‌తో సంభాషణ ప్రారంభించడం జీవితంలో సరికొత్త వెలుగులను నింపుతుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


