Airport divorce : అక్కడి వరకు కలిసే వెళతారు- ఆ తర్వాత విడిపోతారు.. ఏంటి ఈ ‘ఎయిర్‌పోర్ట్ డివోర్స్’ ట్రెండ్?
Airport divorce trend : ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టగానే భార్యాభర్తలు తాత్కాలికంగా 'సింగిల్' అయిపోయే సరికొత్త ట్రావెల్ ట్రెండ్ 'ఎయిర్‌పోర్ట్ డివోర్స్'.. నెటిజన్లలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. అసలు దీని అర్థం ఏంటి? ఎందుకు ఇది? ఇక్కడ వివరంగా తెలుసుకోండి..
"ఎయిర్‌పోర్టులో ఉన్నప్పుడు సమయంతో సంబంధం ఉండదు.. అక్కడ మనం ఎలాగైనా ఉండొచ్చు, ఉదయాన్నే కాక్‌టెయిల్ తాగినా, బ్రేక్‌ఫాస్ట్‌గా చాక్లెట్ తిన్నా ఎవరూ పట్టించుకోరు," అని కొందరు సరదాగా చెబుతుంటారు. కానీ, ప్రయాణాల విషయంలో విపరీతమైన ఆందోళన పడే మనస్తత్వం ఉన్నవారిని అడిగితే ఈ మాటను అస్సలు ఒప్పుకోరు.

సాధారణంగా విమానాశ్రయాల్లో మనకు రెండు రకాల ప్రయాణికులు కనిపిస్తుంటారు. మొదటి రకం.. ఫ్లైట్ టైమ్ కంటే 3 గంటలు ముందే ఎయిర్‌పోర్టుకు వచ్చేసి, సెక్యూరిటీ చెకింగ్స్ అన్నీ పూర్తి చేసుకుని, బోర్డింగ్ గేట్ ఎప్పుడు తెరుస్తారా అని ఆత్రుతగా ఎదురుచూసేవారు. రెండో రకం.. ఫ్లైట్ టైమ్‌కు కరెక్ట్‌గా 45 నిమిషాల ముందు దాకా రానక్కర్లేదని కూల్‌గా షాపింగ్ చేస్తూ, లాంజ్‌లో ప్రశాంతంగా తింటూ గడిపేవారు. ఒకవేళ ఈ ఇద్దరూ భార్యాభర్తలయితే.. ఇక ఆ ఎయిర్‌పోర్టులో పడే పాట్లు, వచ్చే గొడవలు అంతా ఇంతా కాదు. బహుశా అందుకేనేమో, ఈ మధ్యకాలంలో జంటలు తమ మానసిక ప్రశాంతత కోసం 'ఎయిర్‌పోర్ట్ డివోర్స్' వైపు మొగ్గు చూపుతున్నారు.
అసలు ఏంటి ఈ 'ఎయిర్‌పోర్ట్ డివోర్స్'?
పేరు చూసి ఇది నిజమైన విడాకులు అనుకుంటే పొరపాటే! ప్రయాణాల సమయంలో భాగస్వాముల మధ్య వచ్చే గొడవలను నివారించేందుకు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఒక సరదా ట్రెండ్ ఇది. ప్రయాణం అనేది ఒక్కోసారి మనుషుల్లోని అసహనాన్ని, చిరాకును బయటకు తీస్తుంది. అందుకే, 'సండే టైమ్స్' కథనం ప్రకారం.. మీరు ఎయిర్‌పోర్టులో లగేజీ డ్రాప్ చేసిన క్షణం నుంచి బోర్డింగ్ గేట్ వద్దకు చేరే వరకు భార్యాభర్తలు ఇద్దరూ అధికారికంగా 'సింగిల్' అని ప్రకటించుకుంటారు. ఎవరికీ నచ్చినట్లు వారు సమయాన్ని గడపడమే ఈ కాన్సెప్ట్.
ట్రావెల్ రైటర్ హ్యూ ఆలివర్ 2025లో రాసిన ఒక కథనంలో ఈ పదాన్ని మొదటిసారి ఉపయోగించారు. ప్రయాణం సాఫీగా సాగడానికి తను, తన భార్య ఎయిర్‌పోర్టులో ఈ తాత్కాలిక విడాకుల పద్ధతినే పాటిస్తామని, ఇదే తమ హ్యాపీ రిలేషన్‌షిప్ వెనుక ఉన్న రహస్యమని ఆయన పేర్కొన్నారు.
ప్రాక్టికల్‌గా ఇది ఎలా పని చేస్తుంది?
ఆలివర్ మాటల్లోనే చెప్పాలంటే.. "బోర్డింగ్ గేట్ నంబర్ అనౌన్స్ చేయడానికి ముందే, నేను డిపార్చర్ బోర్డు స్పష్టంగా కనిపించే చోట కూర్చుంటాను. గేట్ నంబర్ పడగానే పరిగెత్తడానికి సిద్ధంగా ఉంటాను. కానీ నా భార్య మోర్వెన్నాకు ఫ్లైట్ అప్పుడే స్టార్ట్ కాదని బాగా తెలుసు. అందుకే ఆమె ఎయిర్‌పోర్టులోని షాపులన్నీ నిదానంగా బ్రౌజ్ చేస్తుంది. చివరి నిమిషంలో ఫ్లైట్ ఎక్కడం ఆమెకు ఒక ఛాలెంజ్."
అందుకే ఎవరి స్టైల్‌లో వారు ప్రయాణాన్ని ఎంజాయ్ చేయడానికి ఈ తాత్కాలిక దూరం ఉపయోగపడుతుంది.
నెటిజన్లు ఏమంటున్నారు?
ఈ కొత్త ఎయిర్‌పోర్ట్ డివోర్స్ ట్రెండ్‌పై సోషల్ మీడియాలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఒక నెటిజన్ తీవ్రంగా స్పందిస్తూ.. "ఇలాంటి ట్రెండ్స్ ఎందుకు? మాట్లాడకుండా వేర్వేరు ఫ్లైట్లలో, వేర్వేరు గమ్యస్థానాలకు వెళ్లిపోవచ్చు కదా! మళ్లీ ఇంటికొచ్చాక విడివిడిగా ఎంత బాగుందో మాట్లాడుకుని, శాశ్వతంగా విడిపోవచ్చు. ఈ ట్రెండ్స్ అక్కడికే దారితీస్తాయి," అని విమర్శించారు.
మరొకరు సరదాగా.. "మా తల్లిదండ్రులు కూడా ఎయిర్‌పోర్టులో ఇలాగే చేశారు.. ఆ తర్వాత నిజంగానే విడాకులు తీసుకున్నారు!" అని కామెంట్ పెట్టారు.
అయితే కొందరు మాత్రం ఈ ఆలోచనను సమర్థించారు. "మా వారితో ప్రయాణం అంటేనే ఒక పెద్ద టాస్క్. నేనేమో 20 నిమిషాల ముందు వెళ్దామంటాను, ఆయనేమో 3 గంటల ముందే కూర్చుంటారు. మేము ఇల్లు వదిలే ముందే ఎయిర్‌పోర్ట్ డివోర్స్ తీసుకోవడం చాలా బెటర్," అని ఒక మహిళా నెటిజన్ మద్దతు తెలిపారు. మరికొందరు మాత్రం.. "మనిషి చేసే ప్రతి చిన్న అలవాటుకు ఇలా ఒక పేరు పెట్టాల్సిన అవసరం లేదు," అని కొట్టిపారేశారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


