Gen Z Lifestyle : చిన్న కథ కాదుగా! ట్రెండింగ్‌లో రోజుకో కొత్త ‘జెన్ జీ’ లైఫ్‌స్టైల్- వింటే ఆశ్చర్యపోతారు..
Gen Z Lifestyle trends : నేటి జెన్ జీ తరం సంప్రదాయ కుటుంబ కట్టుబాట్లకు స్వస్తి పలుకుతూ వినూత్న జీవనశైలిని ఎంచుకుంటోంది. అధిక ఆదాయం, వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రయాణాలు, పెంపుడు జంతువులే ప్రాధాన్యంగా సాగుతున్న ఈ 'న్యూ ఏజ్' ట్రెండ్స్‌పై ప్రత్యేక కథనం మీకోసం.
చదువు, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు.. ఒకప్పుడు ఇదే సగటు మనిషి జీవిత చక్రం. కానీ ఇప్పుడు కాలం మారింది! ముఖ్యంగా 'జనరేషన్ జెడ్' (జెన్ జీ) ఆలోచనా ధోరణిలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. బాధ్యతల కంటే వ్యక్తిగత ఎదుగుదలకు, స్వేచ్ఛకు అధిక ప్రాధాన్యమిస్తూ సరికొత్త జీవనశైలి పదజాలాలను వీరు సృష్టిస్తున్నారు. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో 'డింక్' (Dual Income, No Kids) అనే పదం ఎంత వైరల్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు దానిని మరిన్ని కొత్త రూపాల్లోకి మార్చేస్తున్నారు మన యువత.

ఈ నేపథ్యంలో జెన్ జీలు ప్రస్తుతం ఫాలో అవుతున్న వివిధ లైఫ్స్టైల్స్ని ఇక్కడ చూసేయండి..
పిల్లలు వద్దు.. ప్రశాంతత ముద్దు!
డింక్ అంటే డ్యూయెల్ ఇన్కమ్- నో కిడ్స్! అంటే పెళ్లి చేసుకుంటారు. కానీ పిల్లల్ని కనరు! భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తారు. వచ్చే డబ్బులను తమ అవసరాల కోసం, సంతోషం కోసం ఖర్చు చేస్తుంటారు. ఇటీవలి కాలంలో ఈ డింక్ లైఫ్‌స్టైల్‌కి మంచి క్రేజ్ లభిస్తుంది. దీని లాభ, నష్టాల గురించి పూర్తిగా తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
పెంపుడు జంతువులే ప్రాణం: DINKWADs ట్రెండ్
కేవలం పిల్లలు లేకపోవడమే కాదు, వారి స్థానంలో పెంపుడు జంతువులను (ముఖ్యంగా కుక్కలను) చేర్చుకుని వాటిని పిల్లలకంటే ఎక్కువగా చూసుకునే జంటలను 'DINKWADs' (Dual Income, No Kids, With A Dog) అని పిలుస్తున్నారు. వీరు తమ సంపాదనలో ఎక్కువ భాగం ప్రీమియం పెట్ ఫుడ్, విలాసవంతమైన పెట్ ట్రావెల్స్, స్పెషలైజ్డ్ పెట్ కేర్ కోసం ఖర్చు చేస్తున్నారు. అంటే ఇక్కడ ఖర్చు తగ్గడం లేదు, కానీ ప్రాధాన్యత మారుతోంది.
ఒంటరిగా ఉండటమే ఆనందం: SINKs, SINBADs..
ఒంటరిగా ఉంటూ, తమ ఆర్థిక స్థితిపై పూర్తి నియంత్రణ కలిగి ఉండటాన్ని జెన్ జీ ఇష్టపడుతోంది. పెళ్లి చేసుకోకుండా, పిల్లలు లేకుండా ఉండే ఒంటరి వ్యక్తులను 'SINKs' (Single Income, No Kids) అంటారు. దీనిలోనే మరో వెరైటీ ‘SINBADs’! అంటే భాగస్వామి గానీ, భారీ ఆస్తులు గానీ లేకుండా, కేవలం తమ స్వేచ్ఛను, స్వతంత్రతను ఆస్వాదించే వారు. వీరు లగ్జరీ ట్రావెల్స్, సెల్ఫ్-కేర్ కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి వెనుకాడరు.
కెరీర్ వైపు మొగ్గు: DINKY, PANK..
కొంతమంది జంటలు పిల్లలను వద్దనుకోవడం లేదు కానీ, ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నారు. వీరిని 'DINKY' (Dual Income, No Kids Yet) అంటారు. వీరు కెరీర్‌లో స్థిరపడటానికి, ప్రపంచాన్ని చుట్టేయడానికి ప్రాధాన్యమిస్తారు.
ఇక మహిళల విషయంలో 'PANK' (Professional Aunt, No Kids) అనే ట్రెండ్ విపరీతంగా పెరుగుతోంది. వృత్తిరీత్యా రాణిస్తూ, పిల్లలు లేని మహిళలు తమ సంపాదనను తమ మేనల్లుళ్లు, మేనకోడళ్లపై ఖర్చు చేస్తూ, వారిని గారాబం చేస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తుంటారు.

ఆర్థిక స్వతంత్రమే లక్ష్యం: FIRE, 'డ్రై' డేటింగ్..
తొందరగా రిటైర్మెంట్ తీసుకోవాలనే లక్ష్యంతో 'FIRE' (Financial Independence, Retire Early) అనే కాన్సెప్ట్‌ను చాలామంది జెన్ జీలు ఫాలో అవుతున్నారు. దీని కోసం వీరు పిల్లల బాధ్యతను పక్కన పెట్టి పొదుపుపై దృష్టి పెడతున్నారు. అలాగే, అనవసరపు ఖర్చులు తగ్గించుకోవడానికి 'డ్రై డేటింగ్' (మద్యపానానికి దూరంగా ఉంటూ డేటింగ్ చేయడం) వంటి పద్ధతులను పాటిస్తూ తమ ఆరోగ్యం, ఆర్థిక స్థితిని కాపాడుకుంటున్నారు.
మొత్తానికి, బాధ్యతల భారం మోయడం కంటే, ఉన్న జీవితాన్ని తమకు నచ్చినట్టుగా, విలాసవంతంగా గడపడమే లక్ష్యంగా నేటి తరం ముందుకు సాగుతోంది.
వీటిపై మీ ఒపీనియన్ ఏంటి?
తరచుగా అడిగే ప్రశ్నలు -
1. DINK లైఫ్‌స్టైల్ అంటే ఏంటి?
DINK అంటే 'Dual Income, No Kids'. భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తూ, పిల్లలు లేకుండా స్వేచ్ఛగా, విలాసవంతంగా జీవించే పద్ధతిని ఇలా పిలుస్తారు.
2. PANK అంటే ఎవరిని అంటారు?
ప్రొఫెషనల్ ఆంట్, నో కిడ్స్ (PANK). వృత్తిపరంగా మంచి స్థాయిలో ఉండి, పిల్లలు లేని మహిళలు.. తమ బంధువుల పిల్లలను లేదా స్నేహితుల పిల్లలను సొంత పిల్లల్లా చూసుకుంటూ గడిపే జీవనశైలి ఇది.
3. ఈ ట్రెండ్స్ పెరగడానికి కారణం ఏమిటి?
ఆర్థిక పరమైన స్వేచ్ఛ కోరుకోవడం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ప్రయాణాల పట్ల ఆసక్తి, వ్యక్తిగత ఎదుగుదలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల జెన్ జీ ఈ మార్పులను ఆహ్వానిస్తోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


