ఏ ఆరోగ్య సమస్యకు ఏ పప్పు తింటే మేలు? పోషకాహార నిపుణులు చెప్పిన ఆసక్తికర విషయాలు

మన భారతీయ భోజనంలో పప్పు ఒక అంతర్భాగం. అయితే గుండె ఆరోగ్యం, మధుమేహం, పీసీఓఎస్ (PCOS) వంటి వివిధ ఆరోగ్య సమస్యలకు ఏ రకమైన పప్పు మేలు చేస్తుందో పోషకాహార నిపుణులు వివరించారు. మీ శరీర తత్వానికి తగిన పప్పును ఎంచుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Published on: Jan 7, 2026, 08:35:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతీయుల ఇళ్లలో 'పప్పు-అన్నం' అంటే కేవలం ఆహారం మాత్రమే కాదు, అదొక ఎమోషన్. ఎంత విలాసవంతమైన వంటకాలున్నా, వేడివేడి పప్పు అన్నం తింటే వచ్చే తృప్తి వేరు. అయితే, పప్పు కేవలం రుచి కోసమే కాదు.. మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలను అందించే సంజీవని కూడా. గుండె సంబంధిత సమస్యల నుండి మధుమేహం వరకు, మనం ఎంచుకునే పప్పు మన ఆరోగ్యంపై కీలక ప్రభావం చూపుతుంది.

ఏ ఆరోగ్య సమస్యకు ఏ పప్పు తింటే మేలు? పోషకాహార నిపుణులు చెప్పిన ఆసక్తికర విషయాలు (Unsplash)
ఏ ఆరోగ్య సమస్యకు ఏ పప్పు తింటే మేలు? పోషకాహార నిపుణులు చెప్పిన ఆసక్తికర విషయాలు (Unsplash)

ప్రముఖ పోషకాహార నిపుణురాలు దీప్శిఖ జైన్ (MSc Global Public Health Nutrition, UK), మనకు ఎదురయ్యే సాధారణ ఆరోగ్య సమస్యలను బట్టి ఏ పప్పును ఆహారంలో చేర్చుకోవాలో సోషల్ మీడియా వేదికగా వివరించారు. ఆ వివరాలు మీ కోసం..

1. గుండె ఆరోగ్యం కోసం - శనగలు (Chickpeas)

గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారికి శనగలు ఎంతో మేలు చేస్తాయి. అధిక బరువు, కొలెస్ట్రాల్, రక్తపోటు వంటి సమస్యలు గుండెపై ప్రభావం చూపుతాయి.

"గుండె ఆరోగ్యం మందగించిన వారు శనగలను తీసుకోవడం ఉత్తమం. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం, పీచు పదార్థం (Fiber) గుండె పనితీరును మెరుగుపరచడమే కాకుండా, బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి" అని దీప్శిఖ వివరించారు.

2. పీసీఓఎస్ (PCOS) సమస్య ఉంటే - పెసర పప్పు (Mung Dal)

ప్రస్తుతం మహిళల్లో పీసీఓఎస్ సమస్య సర్వసాధారణమైపోయింది. హార్మోన్ల అసమతుల్యత, కడుపు ఉబ్బరం వంటి ఇబ్బందులను ఇది కలిగిస్తుంది. పెసర పప్పు చాలా తేలికగా ఉండటమే కాకుండా, శరీరంలో వాపును (Inflammation) తగ్గిస్తుంది. ఇది హార్మోన్ల సమతుల్యత దెబ్బతినకుండా చూస్తుంది. కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రాకుండా పీసీఓఎస్ లక్షణాలను అదుపు చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

3. మధుమేహంనియంత్రణకు - ఎర్ర పప్పు (Masoor Dal)

భారతదేశాన్ని 'మధుమేహ రాజధాని'గా పిలుస్తారు. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి సరైన పప్పును ఎంచుకోవడం ముఖ్యం. మధుమేహం ఉన్నవారు లేదా ప్రీ-డయాబెటిక్ దశలో ఉన్నవారు 'మసూర్ దాల్' (ఎర్ర పప్పు) తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో పీచు పదార్థం (Fiber) పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలోకి చక్కెర వేగంగా చేరకుండా నిరోధించి, బ్లడ్ షుగర్ లెవల్స్ స్థిరంగా ఉండేలా చేస్తుంది. 2024లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం, ఇలాంటి హై-ఫైబర్ ఆహారం గుండె జబ్బులు, క్యాన్సర్ ముప్పును కూడా తగ్గిస్తుంది.

4. జీర్ణ సమస్యలు వేధిస్తుంటే - పొట్టు తీసిన పెసర పప్పు

గ్యాస్, అసిడిటీ లేదా కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు ఉన్నప్పుడు భారీగా ఉండే పప్పులు తినడం వల్ల జీర్ణవ్యవస్థపై భారం పడుతుంది. అలాంటి సమయాల్లో పొట్టు తీసిన పెసర పప్పు అత్యుత్తమ ఎంపిక. ఇది చాలా సులభంగా జీర్ణమవుతుంది. ఇందులో యాంటీ-న్యూట్రియెంట్స్ తక్కువగా ఉండటం వల్ల, శరీరం పోషకాలను త్వరగా గ్రహిస్తుంది. మీ జీర్ణవ్యవస్థకు విశ్రాంతినిస్తూనే పోషణను అందిస్తుంది.

(గమనిక: ఈ సమాచారం సోషల్ మీడియాలోని నిపుణుల సలహాల ఆధారంగా సేకరించబడింది. ఏదైనా ఆహార నియమావళిని మార్చుకునే ముందు మీ వ్యక్తిగత వైద్యుడిని లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించడం మంచిది.)

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More