శరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.
Winter health tips : చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలా? ఇవి తీసుకోండి..
చలికాలంలో డ్రైఫ్రూట్స్, నెయ్యి, బెల్లంతో చేసే వంటకాల వెనుక ఉన్న పోషక విలువలను ఆధునిక శాస్త్రం కూడా గుర్తిస్తోంది. రోగనిరోధక శక్తి, జీవనశైలి ఆరోగ్యం కోసం వీటిని ఎలా చేర్చుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..
దేశవ్యాప్తంగా చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అయితే ఈ శీతాకాలంలో చాలా మందిలో జలుబు, దగ్గు, శ్వాసకోస ఇబ్బందులు వంటివి మొదలవుతాయి. ఉదయం పూట చల్లని గాలి, మారే వాతావరణంతో శరీరంలో రోగనిరోధక శక్తిపై ఒత్తిడి పడుతుంది. ఇలాంటి వేళ మన పూర్వీకులు పాటించిన ‘సీజనల్ ఆహార పద్ధతులు’ ఇప్పుడు ఆధునిక పోషకాహార శాస్త్రం చెబుతున్న విషయాలతో సరిపోలడం ఆసక్తి కలిగించే అంశం.

ఉదాహరణకు.. చలికాలం రాగానే భారతీయ ఇళ్లలో ఇంట్లో చేసిన పంజీరీ, తాజాగా చుట్టిన గోండ్ లడ్డూలు లేదా డైనింగ్ టేబుల్‌పై బాదం, వాల్నట్, ఎండుద్రాక్ష గిన్నెలు కనిపిస్తాయి. పంజాబ్, హరియాణాలో పంజీరీ సీజనల్ ఇష్టంగా తింటే, రాజస్థాన్‌లో బలాన్నిచ్చే గోండ్ లడ్డూలకు ప్రాధాన్యత ఉంటుంది. అదే సమయంలో గుజరాత్ చలికాలాన్ని అడదియా పాక్‌తో ఆహ్వానిస్తుంది. తరతరాలుగా వస్తున్న వంటకాలు, కుటుంబ వంటశాలల జ్ఞాపకాలు, ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలనే సరళమైన నమ్మకం వీటితో ముడిపడి ఉన్నాయి.
ఈ నేపథ్యంలో రోగనిరోధనక శక్తిని పెంచుకునేందుకు శీతాకాలంలో తీసుకోవాల్సిన కొన్ని ఆహారాలను ఇక్కడ తెలుసుకోండి..
డ్రైఫ్రూట్స్‌లో దాగి ఉన్న పోషకాల బలం
నట్స్, డ్రైఫ్రూట్స్‌లో ఉండే పోషకాలు సాధారణ రోగనిరోధక శక్తిని, సమగ్ర ఆరోగ్యాన్ని కాపాడటంలో తోడ్పడతాయని ఆధునిక పోషకాహార శాస్త్రం గుర్తిస్తోంది. చలికాలంలో శ్వాసకోస ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున, సహజ రక్షణ వ్యవస్థను నిలుపుకోవడానికి శరీరానికి తగినంత పోషణ అవసరం. ఇక్కడ వివిధ రకాల నట్స్, డ్రైఫ్రూట్స్ తమ వంతు పాత్ర పోషిస్తాయి.
బాదంలో విటమిన్ ఈ సమృద్ధిగా ఉంటుంది. ఇది కణాలను ఆక్సీకరణ నష్టం నుంచి కాపాడే యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ రోగనిరోధక శక్తికి అండగా నిలుస్తుంది. జీడిపప్పు జింక్, కాపర్ అందిస్తుంది. ఇవి ఆరోగ్యకరమైన రోగనిరోధక కణాల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తాయి.
అదే సమయంలో పిస్తాలో రోగనిరోధక ప్రక్రియలకు అవసరమైన విటమిన్ బీ6 లభిస్తుంది. వాల్నట్స్ మొక్కల ఆధారిత ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లను అందించి సమగ్ర ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఎండుద్రాక్ష, ఖర్జూరం, అంజీర్ డైటరీ ఫైబర్, పొటాషియం, ఇతర ఖనిజాలను అందించి రోజువారీ భోజనంలో పోషకాల వైవిధ్యాన్ని పెంచుతాయి. నట్స్, గింజలు, తృణధాన్యాలు, డ్రైఫ్రూట్స్‌ను సీజనల్ వంటకాల్లో కలపడం భారతీయ శీతాకాల ఆహార అలవాట్లకు దగ్గరగా ఉంటుంది.
నెయ్యి, బెల్లం కలిపితే ఏమవుతుంది?
నట్స్, డ్రైఫ్రూట్స్‌కు నెయ్యి, బెల్లం కలిపితే రుచి మరింత పెరుగుతుంది. చలికాలంలో కుటుంబ సభ్యులు ఆస్వాదించే పోషకభరితమైన, శక్తినిచ్చే కలయికగా ఇది నిలుస్తుంది.
"బలం ఒక్కరోజులో రాదు; రోజువారీ ఆహార ఎంపికల ద్వారా అది నిశ్శబ్దంగా పోగుపడుతుంది," అని నట్స్ అండ్ డ్రైఫ్రూట్స్ కౌన్సిల్ (ఇండియా) అధ్యక్షుడు గుంజన్ విజయ్ జైన్ పేర్కొన్నారు.
ఈ మాట నేటి కుటుంబాలకు ఆచరణాత్మక పాఠంగా నిలుస్తుంది. మంచి పోషణ కోసం ఖరీదైన సప్లిమెంట్లు, సంక్లిష్టమైన వంటకాలు లేదా పూర్తిగా కొత్త డైట్ ప్లాన్ అవసరం లేదు. ఉదయం తినే దాలియాలో కొన్ని తరిగిన బాదం కలపవచ్చు, పోహా లేదా ఉప్మాపై వాల్నట్ ముక్కలు చల్లుకోవచ్చు, పెరుగు గిన్నెలో ఎండుద్రాక్ష వేసుకుంటే సహజ తీపి లభిస్తుంది.
పిల్లలకు వయసుకు తగినట్లు సన్నగా తరిగిన లేదా పొడి చేసిన నట్స్ అందించవచ్చు; ఉద్యోగులు ప్యాకేజ్డ్ స్నాక్స్‌కు బదులుగా చిన్న ప్యాకెట్లో వీటిని వెంట తీసుకెళ్లవచ్చు. వృద్ధులు తమ అవసరాలకు అనుగుణంగా మెత్తగా చేసిన లేదా దంచిన వాటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు.
పరిమితి ముఖ్యం.. నిలకడే కీలకం
అయితే తీసుకునే పరిమాణం విషయంలో జాగ్రత్త అవసరం. ఉప్పు కలపని సాధారణ నట్స్ గుప్పెడు తీసుకుంటే సమతుల్య ఆహారానికి తోడ్పడతాయి. అదే సమయంలో తీపి కలిపిన డ్రైఫ్రూట్స్, సంప్రదాయ శీతాకాల వంటకాలను మితంగా తీసుకోవడం మంచిది.
చివరిగా చెప్పాలంటే చలికాల ఆరోగ్యం అంటే ఏదో మాయా పదార్థాన్ని వెతకడం కాదు. ఆలోచించి సరైన ఆహారాన్ని నిలకడగా ఎంచుకోవడమే అసలు విషయం.

E-Paper
