‘ఫిట్​గా పాశ్చాత్య దేశాల వృద్ధులు- మన అంకుల్స్ మాత్రం పొట్టలు పెంచుతున్నారు!’

వయసు పెరిగే కొద్దీ ఫిట్‌నెస్‌ను ఎలా కాపాడుకోవాలనే అంశంపై ప్రముఖ ఫిట్‌నెస్ కోచ్ రాజన్ చేసిన ఇన్​స్టాగ్రామ్ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇంగ్లాండ్, భారతదేశంలోని వృద్ధుల జీవనశైలి, ఆరోగ్య అలవాట్లను పోలుస్తూ ఆయన చెప్పిన విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Published on: Sep 10, 2026, 09:11:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

80 ఏళ్లు దాటినా కొందరు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఎవరిపైనా ఆధారపడకుండా జీవిస్తుంటే, మరికొందరు వయసుతో పాటు శారీరక శ్రమను పూర్తిగా తగ్గించేస్తుంటారు. సరిగ్గా ఈ వ్యత్యాసాన్నే ప్రముఖ ఫిట్‌నెస్, వెయిట్ లాస్ కోచ్ రాజన్ తన ఇన్​స్టాగ్రామ్ వీడియో ద్వారా వెలుగులోకి తెచ్చారు. భారతదేశానికి చెందిన వృద్ధులకు.. (అంకుల్స్) ఇంగ్లాండ్‌లోని వృద్ధుల శరీర ఆకృతి, ఆరోగ్యం పట్ల వారికున్న శ్రద్ధను పోలుస్తూ ఆయన పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్​ అవుతోంది.

అంగ్రేజీ వర్సెస్ ఇండియన్ అంకుల్స్..
అంగ్రేజీ వర్సెస్ ఇండియన్ అంకుల్స్..

అయితే, భారతీయులందరూ అనారోగ్యంగా ఉన్నారనో లేదా ఇంగ్లాండ్‌లోని వారంతా అత్యంత ఫిట్‌గా ఉన్నారనో చెప్పడం తన ఉద్దేశం కాదని రాజన్ స్పష్టం చేశారు. కేవలం సమాజంలో ఉన్న అవగాహనా లోపాన్ని, వ్యాయామ ప్రాధాన్యతను ఎత్తిచూపడానికే ఈ పోలిక అని ఆయన వివరించారు.

80 ఏళ్ల వయసులో 105 పుష్-అప్‌లు!

రాజన్ షేర్ చేసిన వీడియోలో 80 ఏళ్లు దాటిన ఇంగ్లాండ్ వృద్ధులు కొందరు తమ ఫిట్‌నెస్ రహస్యాలను పంచుకున్నారు. వ్యాయామం తమను ఎలా ఆందోళన నుంచి కాపాడిందో, మానసిక ఒత్తిడిని ఎలా తగ్గించిందో వివరించారు.

"నేను తీవ్రమైన మానసిక ఆందోళనతో బాధపడేవాడిని. కానీ ప్రతిరోజూ వ్యాయామం చేయడం మొదలుపెట్టాక నా ఒత్తిడంతా మాయమైందని గ్రహించాను," అని ఓ వృద్ధుడు చెప్పారు.

మరో 86 ఏళ్ల వృద్ధుడు మాట్లాడుతూ, "ఏళ్లుగా నా శరీరాన్ని నిర్లక్ష్యం చేశాను. అందుకే ఆరోగ్యం క్షీణించింది. కానీ ఇప్పుడు దాన్ని సరిదిద్దుకునేందుకు వర్కౌట్స్ ప్రారంభించాను. రాబోయే 10 నుంచి 15 ఏళ్ల పాటు ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలని ఆశిస్తున్నాను," అని ధీమా వ్యక్తం చేశాడు.

అలాగే 82 ఏళ్ల మరొక వ్యక్తి.. తన డైలీ వర్కౌట్ రొటీన్ గురించి చెబుతూ, "నేను ఆపకుండా వరుసగా 105 పుష్-అప్‌లు తీశాను. ఆ తర్వాత జిమ్‌కి వెళ్లి 100 పుల్-అప్‌లు చేశాను. 82 ఏళ్ల వయసులో నేనే ఇవన్నీ చేయగలుగుతున్నప్పుడు, ఎవరూ సాకులు చెప్పకూడదు," అంటూ వ్యాయామం ప్రాధాన్యతను నొక్కి చెప్పారు.

వీరిని ఉదాహరణగా చూపిస్తూ, "వీరు 60, 80, 90 ఏళ్ల వయసులో కూడా నిటారుగా నిలబడుతున్నారు, వర్కౌట్స్ చేస్తున్నారు, స్వతంత్రంగా తమ పనులు తాము చేసుకుంటున్నారు," అని రాజన్ పేర్కొన్నారు.

మన 'ఇండియన్ అంకుల్స్' జీవనశైలి ఎలా ఉందంటే..

ఆ తర్వాత భారతీయ వృద్ధుల జీవనశైలిని రాజన్ ప్రస్తావించారు. 60 నుంచి 80 ఏళ్ల వయసున్న మన దేశపు పురుషుల్లో ఎక్కువమంది పెద్ద బొజ్జలతో కనిపిస్తుంటారని, నెయ్యి ఎక్కువగా ఉండే ఆలూ పరోటాలు, సమోసాలు వంటి ఆహార పదార్థాలను అతిగా తింటూ ఉంటారని విమర్శించారు.

ఒకసారి ఉద్యోగం లేదా వ్యాపారంలో స్థిరపడి, కుటుంబ బాధ్యతలు తలపైపడ్డాక చాలామంది ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ను పక్కనపెట్టి కేవలం బాధ్యతలకే ప్రాధాన్యత ఇస్తుంటారని రాజన్ అభిప్రాయపడ్డారు.

"భారత్‌లో ఎవరూ ఫిట్‌గా లేరని నేను అనడం లేదు, కానీ ఆరోగ్యకరమైన జీవనశైలిపై సరిపడా అవగాహన మాత్రం లేదు," అని వ్యాఖ్యానించారు.

మధ్య వయసు దాటిన తర్వాత బొజ్జ ఉండటం, శారీరక శ్రమ లేకపోవడం మన సంస్కృతిలోనే ఒక సాధారణ విషయంగా మారిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "మన సంస్కృతి ఎలాంటిదంటే.. 10 మందిని చూస్తే అందులో ఏడుగురు 40 నుంచి 50 అంగుళాల నడుముతో, పెద్ద పొట్టలతోనే కనిపిస్తారు," అని పేర్కొన్నారు.

ఆరోగ్యంపై దృష్టి సారించి క్రమం తప్పకుండా శారీరక శ్రమ, మంచి ఆహారపు అలవాట్లను జీవితంలో భాగం చేసుకోవాలని ఆయన నెటిజన్లకు పిలుపునిచ్చారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More