...
...
Next Story

Bone health : ఎముకల బలం కోసం కాల్షియం ట్యాబ్లెట్లు మాత్రమే తీసుకుంటే సరిపోదు! ఇవి తెలుసుకోండి..

ఎముకలు గట్టిగా ఉండటానికి రోజూ కాల్షియం సప్లిమెంట్లు తీసుకోవడం మాత్రమే సరిపోదని అమెరికాకు చెందిన ఆర్థోపెడిక్ నిపుణుడు డాక్టర్ డగ్ లూకాస్ స్పష్టం చేశారు. ఎముకల క్షీణతను అరికట్టడానికి ప్రోటీన్, వ్యాయామం, ఇతర కీలక పోషకాలతో కూడిన పూర్తిస్థాయి ప్రణాళిక అవసరమని ఆయన వెల్లడించారు. ఆ వివరాలు..

Published on: Aug 27, 2026, 07:29:29 IST
Advertisement

మనదేశంలో నలభై ఏళ్లు దాటిన వారు, ముఖ్యంగా మహిళలు, ఎముకల బలహీనత లేదా నడుము నొప్పుల నుంచి ఉపశమనం కోసం మొదట ఆలోచించేది కాల్షియం గురించే. డాక్టర్ సలహా ఉన్నా లేకపోయినా, మెడికల్ షాప్‌కు వెళ్లి కాల్షియం బిళ్లలు తెచ్చుకుని మింగేయడం ఒక అలవాటుగా మారింది. అయితే, మీరు కూడా రోజువారీగా కాల్షియం టాబ్లెట్లు వాడేస్తూ "నా ఎముకలు కొండంత బలంగా ఉంటాయి," అని ధీమాగా ఉంటే పప్పులో కాలేసినట్లే! కేవలం కాల్షియం తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారవని, ఎముకల క్షీణత (ఆస్టియోపోరోసిస్) ఆగిపోదని అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, ఆస్టియోపోరోసిస్ నిపుణుడు డాక్టర్ డగ్ లూకాస్ స్పష్టం చేశారు.

Orthopaedic surgeon Dr Doug Lucas says you also need protein, resistance training, and key nutrients to prevent bone loss. (Freepik)
Orthopaedic surgeon Dr Doug Lucas says you also need protein, resistance training, and key nutrients to prevent bone loss. (Freepik)

చాలామంది గృహిణులు, ఆఫీసు ఉద్యోగులు ఎండ తగలకపోవడం వల్ల తీవ్రమైన విటమిన్ డీ లోపంతో బాధపడుతుంటారు. శరీరంలో విటమిన్ డీ, మెగ్నీషియం లేనప్పుడు ఎంత కాల్షియం తిన్నా అది ఎముకలకు పట్టదు. అంతేకాదు, ఆ అదనపు కాల్షియం రక్తనాళాల్లో పేరుకుపోయి ఇతర గుండె సంబంధిత సమస్యలకు దారితీసే ముప్పు కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఎముకలను జీవితాంతం దృఢంగా ఉంచుకోవడానికి డాక్టర్ లూకాస్ కొన్ని కీలక అంశాలను వివరించారు.

వ్యాయామం - వెయిట్ ట్రైనింగ్ తప్పనిసరి

ఎముకల మొత్తం పరిమాణంలో సగం భాగం ప్రోటీన్‌తోనే నిర్మితమై ఉంటుంది. ఆహారంలో ప్రోటీన్ తగ్గితే, ఎముకల నిర్మాణాన్ని పునరుద్ధరించడానికి శరీరానికి కావాల్సిన ముడి పదార్థాలు లభించవు. ప్రతీ ఒక్కరూ తమ ఆదర్శ శరీర బరువులో ప్రతి పౌండ్‌కు ఒక గ్రాము ప్రోటీన్ చొప్పున తీసుకోవాలని డాక్టర్ లూకాస్ సూచించారు. ఉదయం టిఫిన్ సమయానికే గుడ్లు, గడ్డ పెరుగు లేదా ప్రోటీన్ షేక్ ద్వారా కనీసం 30 గ్రాముల ప్రోటీన్ తీసుకోవడం వల్ల రోజూవారీ లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చు.

సహాయక పోషకాలు: విటమిన్ డీ, కే, మెగ్నీషియం

ఎముకల కోసం కాల్షియం ఒక్కటే పనిచేయలేదు. విటమిన్ డీ, విటమిన్ కే, మెగ్నీషియం అనేవి కాల్షియంను శరీరం పీల్చుకోవడానికి, దానిని నేరుగా ఎముకల్లోకి పంపడానికి సహాయపడతాయి. వీటిలో ఏ ఒక్కటి తగ్గినా కాల్షియం సమర్థవంతంగా పనిచేయదు. అందుకే విపరీతంగా టాబ్లెట్లు వాడేసే ముందు బ్లడ్ టెస్టులు చేయించుకుని, శరీరంలో ఏ పోషకం తక్కువగా ఉందో తెలుసుకుని దానికి తగ్గట్టుగా చికిత్స తీసుకోవాలి.

హార్మోన్ల సమతుల్యత

వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో హార్మోన్ల స్థాయిలో మార్పులు వస్తాయి. ముఖ్యంగా మహిళల్లో మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజెన్ తగ్గిపోవడం వల్ల ఎముకల సాంద్రత వేగంగా పడిపోతుంది. అందుకే వ్యాయామం, మంచి ఆహారంతో పాటు హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడం ద్వారానే ఎముకల ఆరోగ్య పరిరక్షణ సాధ్యమవుతుంది.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఆరోగ్యపరమైన విషయాల కోసం మీరు మీ వైద్యుడిని సంప్రదించడం శ్రేయస్కరం.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON